అండం – పిండం

0
147
మనస్సాక్షి  – 1157
వెంకటేశం జీవితం బొత్తిగా దుర్భరంగా తయారయింది. అదీ పెళ్ళయిం తర్వాత..
అంటే దానర్థం ఆ వచ్చిన వెంకటలక్ష్మీ ఏవో బాధలు పెట్టేస్తుందని కాదు. పెళ్ళయి మూడేళ్ళయినా పిల్లలు పుట్టడం లేదని వెంకటేశం వైపు ముసలమ్మ సణుగుడు ఎక్కువయిపోయింది. ‘యిదిగో.. ఎంకన్న బాబూ.. ఎలాంటి కుటుంబం మనది. గిరీశం తాతగారి గురించయితే తెలీందే వుందీ.. అబ్బో.. ఆయన గురించి  యిప్పటికీ కథలు కథలుగా చెప్పుకుం టారు. అలాంటి కుటుంబంలో పుట్టి నోడివి. నీ సంగతేంటి? లాంటి విసుర్లు తప్పడం లేదు. దాంతో వెంకటేశం ఈ నస తట్టుకోలేక వెంకటలక్షీతో వెళ్ళి డాక్టర్‌కి చూపించుకున్నాడు. డాక్టర్‌ పరీక్షలన్నీ చేసి వెంకటేశంలో ఏ లోపం లేదని తేల్చి పారేశాడు. అలాటే వెంకటలక్ష్మీలో  అండా లయితే  విడుదలవుతున్నాయి గానీ గర్భాశయం బాగా చిన్నగా  ఉందనీ, దాని వలన గర్భం నిలవడం కష్టమనీ తేల్చి చెప్పేశాడు. మొత్తానికి సమస్య ఏంటనేది తెలిసింది. దాంతో ఏం చేయాలా అని వెంకటేశం దంపతులు ఆలోచనలో పడ్డారు. అప్పుడు డాక్టర్‌ ఓ సలహా యిచ్చాడు. ” పోనీ మీ బిడ్డని యింకొకరి గర్భంలో పెంచుదాం. దాన్నే సరోగసి గర్భం అంటారు” అన్నాడు. యిదేదో బానే ఉందని యిద్దరూ ఒప్పుకున్నారు. అక్కడ్నుంచి తమ బిడ్డని గర్భంలో మోసే సరోగసీ తల్లి కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పుడు మొదలయింది అసలు సమస్య. యింతకీ ఆ సమస్య మొదలయింది సుచిత్ర రూపంలో….
——-
సుచిత్రంటే ఎవరో కాదు.. వెంకటేశానికి స్వయానా మేనమామ కూతురు. పాపం చిన్నప్పట్నుంచసరీ వెంకటేశాన్ని పెళ్ళాడడానికి ముచ్చట పడేది. అయితే వెంకటేశం మేనరికాలవి యిష్టపడక బయట సంబంధం చేసేసుకున్నాడు. దాంతో సుచిత్ర పెళ్ళీ పెటాకులూ లేకుండా అలాగే ఉండిపోయింది. యిదిగో.. యిప్పుడు వెంకటేశం దంపతులకి పిల్లలు పుట్టకపోవడంతో, యింకా సరోగసీ మదర్‌ కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో సుచిత్ర మళ్ళీ బయటకొచ్చింది. ఎవరేమన్నా పట్టించుకోకుండా వాళ్ళకి సరోగసీ మదర్‌ కింద బిడ్డను కని యివ్వడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. అంతే కాదు.. తర్వాత వెంకటేశం దంపతుల బిడ్డని తన గర్భంలో మోసి పెంచి కనివ్వడం జరిగింది.
——-
16 సంవత్సరాలు గడిచాయి. ఆ రోజో విశేషం జరిగింది. వెంక టేశం దంపతుల కొడుకు అనంతం కనిపించకుండా పోయాడు. దాంతో అంతా కంగారు పడి వెతకడం మొదలుపెట్టారు. వెతగ్గా వెతగ్గా చివరికి వాడు సుచిత్ర యింట్లో దొరికాడు. దాంతో అంతా కలిసి యిదేం పనంటూ  సుచిత్రని గట్టిగా నిలదీశారు. అయితే అప్పుడో గమ్మత్తు జరిగింది. ఓ పక్కన అనంతం సుచిత్రని గట్టిగా పట్టుకుని ” నేను మా అమ్మని వదిలుండను. నన్ను కన్న మా అమ్మని యింత కాలం నాకు దూరంగా ఉంచారు” అన్నాడు. దాంతో సుచిత్ర కూడా వాడిని గట్టిగా హత్తుకుని  ”అవును.. నేను నా బిడ్డని వదులుకోలేను” అంది. దాంతో అంతా షాక్‌ తిన్నారు. ఎవరెంతగా చెప్పినా సుచిత్ర వినడం లేదాయె. యింతలో విషయం తెలిసి  అక్కడకొచ్చిన  గిరీశం.. ” ఏంటమ్మా..యిదేవ యినా బాగుందా ?” అన్నాడు. దాంతో సుచిత్ర ” చూడన్నయ్యా.. వీడి జీన్స్‌ వాళ్ళవే అయ్యండొచ్చు. మరి వీడిని తొమ్మిది నెలలూ కడుపులో మోసి కన్నది నేను కాదా?” అంది. దాంతో గిరీశం యిబ్బంది పడి ” నువ్వు చెప్పింది నిజమే అనుకో.. కానీ..” అంటూ ఆపాడు.
——
 వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే అంతా కల! ”యిదేంటీ.. యిలాంటి కలొచ్చిదేంటీ ” అనుకున్నాడు. అలా ఆలోచి స్తూనే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో యింకో కలొచ్చింది….
——
పెళ్ళయిన తర్వాత వెంకటేశానికి తలనొప్పి ఎక్కువయిపోయింది. అంటే దానర్థం ఆ వచ్చిన భార్యామణి సూరేకాంతం, ఛాయాదేవి బాపతని కాదు. యింట్లో ఉన్న ముసలమ్మ యింకా పిల్లల్లే రేంటని వెంకటేశాన్ని ఉతికి ఆరేస్తోంది. దాంతో వెంకటేశం వెంకటలక్ష్మీతో వెళ్ళి పరీక్షలవీ చేయించు కున్నాడు. పరీక్షలు చేసిన డాక్టర్‌ వెంక టేశంలో ఏ లోపం లేదనీ తేల్చాడు. అంతే కాదు.. సమస్యంతా వెంకట లక్ష్మీలోనే ఉందని తేల్చేశాడు. వెంకట లక్ష్మీలో గర్భాశయం అయితే బాగానే ఉందనీ, ఎటొచ్చి అండాల తయారీలో లోపం వల్ల తల్లి అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పేశాడు. దాంతో వెంకటేశం దంపతులు  డీలా పడ్డారు. యింతలో డాక్టర్‌ యింకో సలహా యిచ్చాడు. ”మీకు పిల్లలు కావాలంటే యింకో పని  చేయెచ్చు. వెంకటేశం గారి వీర్యాన్ని బయట యింకెవరో అజ్ఞాత స్త్రీ అండంతో ఫలదీకరణం చేసి ఆ పిండాన్ని  మీ గర్భాశయంలో ప్రవేశపెట్టొచ్చు. ఆ రకంగా మీరే బిడ్డని కనొచ్చు” అన్నాడు. యిదేదో వెంకటేశం దంపతులకు బాగానే ఉందని పించింది. దాంతో ఓకే చేసేశారు.
——-
పదహారేళ్ళ గడిచిపోయాయి. ఆరోజు వెంకటేశం, వెంకటలక్ష్మీ, వాళ్ళబ్బాయి అనంతం యింట్లో టీవీ చూస్తున్నారు. అప్పుడు జరిగిందది. సుచిత్ర విసురుగా తలుపులు తోసుకుని లోపల కొచ్చింది. అయితే అనంతాన్ని చూడగానే సుచిత్ర మొహంలో ఓ రకమయిన భావోద్వేగాలు తొంగి చూశాయి. చటుక్కున వెళ్ళి వాడిని దగ్గరికి తీసుకుంది. అంతే కాదు. ఉద్వేగంగా వీడు నా బిడ్డ. నా అంశతపో పుట్టినవాడు. కావలిస్తే డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించు కోండి. డాక్టర్‌ చెప్పిన మీదటే యింతకాలం నేను నోర్మూసుకుని కూర్చున్నాను. యింకాగలేను. నేను వీడిని తీసుకుపోతా” అంది. దాంతో వెంకటేశం దంపతులు షాక్‌కి గురయ్యారు. ఏం మాట్లాడాలో తెలీనట్టుగా ఉండిపోయారు.. యింతలో భోజనాని కని గిరీశం అక్కడికి రావడం జరిగింది. గిరీశాన్ని చూసేసరికి సుచిత్ర ” చూడన్నయ్యా.. వీడు నా అండం నుంచి పుట్టిన బిడ్డ. నేనే గానీ నా అండం ఈయకపోతే వీడు పుట్టేవాడా..” అంటూ నిలదీసింది. దాంతో గిరీశం యిబ్బంది పడి” నువ్వు చెప్పింది నిజమే కావచ్చు.. కానీ….”  అంటూ ఆపాడు.
——-
వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. యింకో కల..! ”ఏంటీ… ఈ ‘కానీ’ కలలు అనుకున్నాడు. యింతలోనే గిరీశం రావడం జరి గింది. ”ఏవివాయ్‌.. వెంకటేశం.. జోరుగా కలలు కంటు న్నట్టున్నావ్‌” అన్నాడు. వెంకటేశం తలూపి” అవును గురూ గారూ..” అంటే తనకొచ్చిన కలలు చెప్పాడు.అంతా విన్న గిరీశం ”ఏం లేదోయ్‌.. ఈ మధ్యఓ 74 ఏళ్ళ స్త్రీ కవలల్ని కని గిన్నీస్‌ రికార్డులోకి ఎక్కింది కదా. ఆవిడ కూడా వేరే స్త్రీ అండం అరువు తెచ్చుకుని మరీ యిలా పిల్లల్ని కనడం జరిగింది. అదేదో నీ మనస్సులో ఉండి ఈ కలలొచ్చినట్టున్నాయి” అన్నాడు. దాంతో వెంకటేశం అనుమానంగా  ” అవును గురూ గారూ.. ఓ పక్కన ఆవిడ గిన్నీస్‌ రికార్డ్‌లోకి ఎక్కినా బయట్నుంచి విమర్శలు గట్టి గానే వస్తున్నట్టున్నాయి” అన్నాడు. గిరీశం తలూపి ” అవునోయ్‌” అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలన్న మనిషి ప్రయత్నం మంచిదే గానీ అందులో విచక్షణా విచక్షణల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అయినా యింత లేటు వయసులో పిల్లల్ని కని వాళ్ళ ఆలనా పాలానా ఎలా చూసుకోగలదనీ? యింకో సమస్యేం టేంటే  ఈవిడ పేరు యింతిదిగా మార్మోగి పోతుంటే ఆ బిడ్డల పుట్టుక కోసం అండదానం చేసిన స్త్రీ ఉండబట్టలేక బయటకొచ్చి  అల్లరి చేసే అవకాశం లేదా? ఎంతయినా తనకి అంత గుర్తింపు దక్కలేదన్న బాధ ఉంటుంది కదా. ఏతావాతా ఈ పరిణామాలన్నీ ఆ పిల్లల భవిష్యత్తుని ప్రశాంతంగా ఉంచుతాయా అని. అంతా ఆలోచిస్తే బాగుంటుంది” అంటే తేల్చాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here