అండగా నిలుద్దాం….నిశ్చింతగా ఉందాం…. 

0
447
(జి.కె. వార్తా వ్యాఖ్య)
సహనాన్ని అసమర్ధతగా భావించి భారతదేశాన్ని అస్ధిరపర్చడమే ధ్యేయంగా ఏదో విధంగా కయ్యానికి కాలుదువ్వుతూ సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ  ఉరి సెక్టార్‌లో 19 మంది మన జవాన్లను పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు, ఆ ఉగ్రవాదులకు పరోక్ష మద్ధతు ఇస్తున్న పాక్‌కు భారత సైన్యం గట్టిగానే బదులివ్వడం పౌరులందరిలో ఆనందాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇరుగు పొరుగు దేశాలతో సుహృద్భావంగా వ్యవహరించాలనే భావనతో ఎంతగా కవ్వించినా ఓర్పుగా వ్యవహరిస్తూ వస్తున్న భారత్‌ సహనాన్ని చేతకానితనంగా భావించి దశాబ్ధాలుగా ఉగ్ర దాడులకు పాల్పడుతున్న పాకిస్ధాన్‌కు ఎందుకు ధీటుగా బదులివ్వలేకపోతున్నామన్న పౌరుల్ని దొలుస్తున్న ప్రశ్నలకు సమాధానమన్నట్టుగానూ, పాక్‌ ధోరణి ఇక మారేది కాదని తేలిపోవడంతోనూ మొన్న రాత్రి ఆక్రమిత కశ్మీరులోని ఉగ్ర శిబిరాలపై భారత జవాన్లు దాడులకు పాల్పడి  40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అందుకు యావత్‌ భారత్‌ సైన్యానికి, ఆ సైన్యానికి మార్గనిర్ధేశం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జాతి జేజేలు పలుకుతోంది. 1947లో భారత్‌, పాకిస్ధాన్‌ రెండు దేశాలుగా చీలిపోయినప్పుటి నుంచి భారత్‌పై విద్వేషాన్ని, విషాన్ని చిమ్ముతూ మన దేశంపై అనేక పర్యాయాలు యుద్ధానికి వచ్చి పరాభవానికి గురైనా, అంతర్జాతీయ సమాజం దృష్టిలో దోషిగా నిలబడినా ఏ మాత్రం బుద్ధి తెచ్చుకోని పాకిస్ధాన్‌, ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీరు సరిహద్దుల్లోని ఉరి సెక్టార్‌లో దొంగ దెబ్బ తీసి 19 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దీంతో యావత్‌ భారత జాతి రక్తం మరిగిపోయింది. జవాన్ల త్యాగాన్ని ఊరికే పోనివ్వబోమని ప్రకటించిన మోడీ సర్కార్‌ ఆ దిశగా పాక్‌కు, ఆ దేశ ఉగ్రవాద సంస్ధలకు గట్టి హెచ్చరిక పంపడంలో విజయం సాధించింది. అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా, ఆసియా ఖండంలోని ఇతర దేశాలు చెప్పినా ఆ హితోక్తులను పెడచెవిన పెడుతూ ఉగ్రవాద కర్మాగారాన్ని నెలకొల్పి అవకాశం దొరికినప్పుడల్లా  మన దేశంలో ఉగ్రదాడులకు ఉసిగొల్పుతూ అస్ధిరపరుస్తున్నా ఎప్పటికైనా పాక్‌ బుద్ధి మారబోదా అని  ఎదురుచూస్తున్నా అంతకంతకు ఆ వక్ర బుద్ధి పెరిగిందే తప్ప మార్పు రాలేదు. మారణ ¬మం సృష్టించిన కరడుగట్టిన ఉగ్రవాది బిన్‌లాడెన్‌కు ఆశ్రయమిచ్చి తమ వద్ద లేడని చెప్పినా, ముంబై అండర్‌గ్రౌండ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు పరోక్ష సహాయ సహకారాలు అందించినా, భారత ప్రజాస్వామ్య వ్యవస్ధకు అత్యున్నత వేదికైన పార్లమెంట్‌పై దాడులకు పాల్పడినా కూడా మనం ప్రతి దాడి చేయకుండా సహనంగానే వ్యవహరించార. 1965 కి ముందు భారత పాలకుల తప్పిదాలకు, అసమర్ధత విదేశాంగ విధానాలకు మన దేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీరులో కొంత భాగాన్ని కోల్పొయాం. లాల్‌బహుదుర్‌ శాస్త్రి హయాంలో కూడా  శత్రు దేశాల దాడిలో మనదే పై చేయి అయ్యింది. శాంతి మంత్రం జపించడాన్ని అసమర్ధతగా భావించి భారత్‌పై పరోక్షంగా, ప్రత్యక్షంగా సమరానికి కాలుదువ్వుతున్న పాకిస్ధాన్‌కు 1998లో నాటి ప్రధాని వాజ్‌పాయ్‌ హయాంలో కార్గిల్‌ సెక్టార్‌లో గట్టిగానే బుద్ధి చెప్పారు. అప్పుడూ వాజ్‌పాయ్‌ నాయకత్వానికి జాతి జేజేలు పలికి బాసటగా నిలిచింది. ఆలీన విధానాన్ని పాటిస్తున్న భారత్‌ ముందు పద్ధతిగా శాంతి మంత్రం జపిస్తూ వస్తుండగా దానిని చేతకానితనంగా భావిస్తున్న పాక్‌ హద్దులు మీరినప్పుడల్లా సుద్దులు చెబుతూ ధీటుగా బదులిస్తున్నా  దాని వక్ర బుద్ధి మాత్రం మారలేదు. ఇరుగు పొరుగు దేశాలతో ముఖ్యంగా దాయాది దేశమైన పాకిస్ధాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉండాలనే ఆలోచనతో మన ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఇస్లామాబాద్‌ వెళ్ళి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, తరుచు పాక్‌లో పర్యటించడం చేస్తున్నా లోన కత్తులు,పైన నవ్వులు అన్నట్టుగా పాక్‌ వ్యవహరిస్తూ వచ్చింది. అప్పుడప్పుడు తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే మన దేశంలోని పంజాబ్‌లో పఠాన్‌కోటలో ఉగ్ర దాడులు చేయించినా సహనంగానే వ్యవహరించింది. తాజాగా జమ్మూకాశ్మీరు సరిహద్దుల్లోని ఉరి సెక్టార్‌లో పాక్‌ ప్రేరేపిత ముష్కరులు మన సైనిక స్ధావరంపై భీకర దాడులకు తెగబడి  19 మంది జవాన్ల ఉసురు తీయడంతో భారత్‌ ధీటుగానే స్పందించింది.  ఖబడ్ధార్‌ అన్న హెచ్చరిక అన్నట్టుగా సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై  భారత్‌ సైన్యం దాడులకు పాల్పడి ముష్కరులను మట్టుబెట్టడం ద్వారా పాక్‌ గుండెల్లో దడ పుట్టించింది. అంతేగాక భారత్‌-పాక్‌ల మధ్య ఉన్న నదీ జలాల ఒప్పందాలను సమీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ సమాజంలో  పాక్‌ను దోషిగా, ఒంటరిగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే భారత్‌ హెచ్చరికలు పాక్‌లో ప్రకంపనలే సృష్టిస్తోంది. పాక్‌ ముష్కరులను మట్టుబెట్టడానికి భారత జవాన్లకు బాసటగా నిలిచిన నరేంద్రమోడీ నిర్ణయాలకు, విధానాలకు జాతి ప్రజలే గాక రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సంపూర్ణ మద్ధతు ఇవ్వాలి. దేశం కంటే మనకేదీ ముఖ్యం కాదన్న సత్యాన్ని ఈ సందర్భంగా ప్రతి  ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక  ¬దా ఇవ్వలేదన్న బాధ మనకు ఉన్నా ఈ తరుణంలో మనమంతా ఏకీకృతంగా మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలుద్దాం. దీంతో పాటు భారత సైన్యం చేసిన సమర సింహనాదంతో పాక్‌ మరింతగా పేట్రేగే అవకాశాలున్నందున మన దేశంలోని నిద్రాణ శక్తుల్ని (స్లీపర్‌ సెల్స్‌) తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నందున మన అంతర్గత భద్రతా యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయవలసిన అవసరం ఉంది.