అంతలోనే ఎంత తేడా

0
396
మిలమిలలాడిన కళ్ళే చిట్లించాయి…నిలిచిన లావాదేవీలు
 కొత్త నోట్ల కోసం ఎదురు తెన్నులు -బ్యాంక్‌ల వద్ద ఇబ్బందులపై కలవరం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 : అంతలోనే ఎంత తేడా…..నిన్నటి వరకు ఆ నోట్లు చూస్తే మిలమిలలాడే కళ్ళు తెల్లారేసరికి ముఖం చిట్లించే స్ధాయికి పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం గత అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయడంతో పేదలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడ చూసినా నోట్ల రద్దుపైనే చర్చ జరిగింది.  ఈరోజు బ్యాంక్‌ల్లో నగదు లావాదేవీలను నిలిపి వేశారు. అలాగే ఏటీఎంల్లో కూడా నగదు తీసుకునే సౌకర్యాన్ని కూడా నిలిపివేశారు. దీంతో డబ్బు కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడా వంద రూపాయల నోటుగాని, రూ. 50 నోటు గాని  కనబడలేదు. ఆసుపత్రుల్లో, పెట్రొల్‌ బంక్‌ల్లో ఈరోజు, రేపు  రూ.500, రూ.1000 నోట్లను అనుమతించాలని ప్రభుత్వం చెప్పినా ఆసుపత్రుల్లో ఆ నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. అలాగే పెట్రొల్‌ బంక్‌ల్లో రూ. 500 నోటిస్తే చాలా బంక్‌ల్లో చిల్లర లేదని చెప్పడంతో వినియోగదారులు అయిష్టంగానే  రూ. 500 కు సరిపడా పెట్రొల్‌ కొట్టించుకున్నారు. ఇక ఎక్కడా కూడా రూ. 500, రూ.1000 నోట్లను తీసుకోకపోవడంతో ఇక లావాదేవీలు నిలిచిపోయి ప్రజలు నానా యాతన పడ్డారు. బ్యాంక్‌ల్లో రేపటి నుంచి ఈ నోట్ల స్థానే కొత్త రూ. 500, రూ. 2,000 నోట్లను ఇస్తామని  కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రేపటి నుంచి బ్యాంక్‌ల వద్ద పడే కష్టాల గురించి తలుచుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో బ్యాంక్‌లు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పినా వినియోగదారులకు పాట్లు తప్పేటట్టు లేవు. ఇక ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 500,  రూ. 1000 నోట్లను బ్యాంక్‌ల్లో మార్చుకునే  సౌకర్యం కల్పించినా వారు పాన్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నకలును జతపరచవలసి ఉంది. ఏమైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పెద్ద కలకలమే కలిగించింది.