అందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తాం 

0
265
-ఎమ్మెల్యే ఆకుల హామీతో దీక్షను విరమించిన కొండబాబు
రాజమహేంద్రవరం 21, నవంబరు: స్థలానికి కొరత లేదని, అందరికీ పట్టాలు ఇప్పించి పక్కా గృహలను నిర్మించి ఇస్తామని రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హామీ ఇచ్చారు. 49వ డివిజన్‌లోని సుబ్బారావు నగర్‌లో ఇటీవల ఇచ్చిన పట్టాల పంపిణీలో కొందరికి జరిగిన అన్యాయంపై బహుజన సమాజ్‌ పార్టీ(బిఎస్‌పి) జిల్లా అధ్యక్షులు, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ ఛైర్మన్‌ బర్రే కొండబాబు దంపతులతోపాటు, సంబంధిత పట్టాల బాధితులు మంగళవారం నుంచి క్వారీ మార్కెట్‌ సెంటర్‌లో ‘వంట, వార్పు, నిద్ర’ అనే నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యలోనే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పట్టాల పంపిణీ వ్యవహారంలో జరిగిన లోపాలను సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు రెవెన్యూ శాఖకు చెందిన ఆర్‌ఐ, సర్వేయర్‌ లక్ష్మి, విఆర్‌ఒ కృష్ణలతో మాట్లాడారు. వాస్తవంగా ఉన్న భూమి వివరాలతోపాటు, ఎంతమందికి ఎన్నేసి చదరపు గజాల స్థలాలను కేటాయించారనే అంశంపై ఆరా తీశారు. పట్టాల పంపిణీ కాకుండా మరికొంత భూమి సంబంధిత ప్రాంతంలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీంతో మొత్తం ఉన్న భూమిని సదును చేసి గత 30-40 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారందరికీ పక్కా గృహాలు ఇచ్చేలా మ్యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆకుల ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ క్వారీ మార్కెట్‌ సెంటర్‌లో జరుగుతున్న నిరసన శిబిరానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. వారం పది రోజుల్లోగా అధికారుల సంబంధిత అధికారులను రికార్డులను తయారు చేస్తారని, గత 30-40 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ప్రతీ ఒక్కరికీ అదే ప్రాంతంలో పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేలా కార్యచరణను చేపడతానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి నిరసన కార్యక్రమాన్ని విరమించాలని సూచించారు. దీంతో బాధితుల అభిప్రాయాలకు అనుగుణంగా బర్రే కొండబాబు దంపతులతోపాటు, బాధితులకు ఆయన నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని విరమిస్తున్నామని, బాధితులకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఇచ్చిన హామీ మేరకు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌పి జిల్లా కన్వీనర్‌ పట్నాల విజయకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here