అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారికి,

0
170
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నమస్కరించి రాసుకుంటున్న విన్నపములు
అయ్యా!
గోదావరి నీటిని తెలంగాణకు ఇవ్వాలన్న తమరి ప్రతిపాదన ఆందోళన కలిగిస్తున్నది. ఇందువల్ల మన రాష్ట్రం శాశ్వతంగా నష్టపోగలదన్న భయం కలుగుతున్నది
గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలలో వాడటం కోసం, గోదావరి నీరు పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి తోడి, ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి మరియు నాగార్జున సాగర్‌ డ్యాంలోకి పంపి సదరు నీటిని ఇరు రాష్ట్రాలు మథ్యన సమానంగా పంచుకోవాలనే ఆలోచన, దీనికయ్యే ఖర్చు ఇరు రాష్ట్రాలు సమానంగా భరించాలి అనే ప్రతిపాదన సరికాదని తమకు విన్నవించుకుంటున్నాము.
మీరు, కెసిఆర్‌ గారు సమామేశమై ఇందుకు జలవనరుల నిపుణుల సలహ కమిటీ కూడా ఏర్పాటు చేసారు. ఇక్కడ మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాటిని నివృత్తి బహిరంగంగా చేయమని మనవి.
1) పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అంధ్ర ప్రాంతానికి చెందిన ప్రాజెక్టు. సదరు ప్రాజెక్టు వెనుక నిలువ చేసే నీరు పూర్తిగా అంధ్రప్రదేశ్‌ సొంతం. సదరు నీటి నుంచి తోడి, ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్‌ డ్యాంలకు పంపటమంటే, మన రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి తాకట్టు పెట్టటంతో సమానం. అది రాష్ట్ర ప్రజల హక్కులు ఉల్లంఘన.
2) దుమ్ముగూడెం టైల్‌ పాండ్‌ నిర్మాణం ద్వారా గోదావరి జలాలు ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్ళిస్తే, మాకు అభ్యంతరం లేదు. కానీ సదరు దుమ్ముగూడెం టైల్‌ పాండ్‌ లోకి నీరు పోలవరం బ్యాక్‌ వాటర్‌ నుంచి తోడటం మాత్రం అభ్యంతరకరం.
3) దుమ్ముగూడెం టైల్‌ పాండ్‌ కి జలాలను వేరుగా, పోలవరం నుంచి కాకుండా, వేరే విథానంలో పోగేసి, సదరు నీటిని పై తెలిపిన రెండు క ష్ణా ప్రాజెక్టులకు మళ్ళించిన పక్షంలో మాకు అభ్యంతరం లేదు.కారణం పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే నీరు గోదావరి నది పై ప్రాంతాలైన మహరాష్ట్ర నుంచి రావు. అవి చత్తీస్‌ గఢ్‌, జార్ఖండ్ మరియు గోదావరి జిల్లాల పరివాహక ప్రాంతాలలో కురిసే వర్షాల వలన వచ్చే వరదనీటి నుంచి వస్తాయి. కాబట్టి సదరు నీటికి తెలంగాణాకు సంభందం లేదు.
4) ఏంతో వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్న తరువాత గోదావరి నీరు ఎత్తిపోతల పథకం ద్వారా చేసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం, మరలా పోలవరం ప్రాజెక్టు నీటి పైన దృష్టి ఎందుకు పెడుతున్నారు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిరూపయోగమా? లేక నీటి మళ్ళింపు తెలంగాణా ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా సాథ్యం కాదా? అందుకే పోలవరం ప్రాజెక్టు నీటి పైన కన్నేసారా కేసిఅర్‌ గారు?
5) అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏన్నో పేచీలు పెట్టిన కేసిఅర్‌ గారు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇది లోతుగా అలోచించండి.
6) దుమ్ముగూడెం టైల్‌ పాండ్‌ నిర్మాణం ఖర్చు విషయంలో కూడా మనం సగం ఖర్చు భరించాల్సిన అవసరం లేదు. మనది ఆసలే పేద రాష్ట్రం. పైగా లోటు బడ్జెట్‌ తో నడుస్తున్న చరిత్ర. అటువంటప్పుడు తెలంగాణా రాష్ట్ర జల అవసరాలకు, మన విలువైన, అమూల్యమైన, అరుదైన సోమ్ము ఖర్చు చేయాలా?
7) దుమ్ముగూడెం టైల్‌ పాండ్‌ నిర్మాణం ఏవరి అథ్వర్యంలో జరగాలి? దాని పైన ఏవరి పెత్తనం ఉండాలి? నీటి విడుదల విషయంలో ఖరాఖండిగా ఒప్పందాలు జరగాలి. లేకపోతే వారి ప్రాంతం నుంచి నీరు వదలము అంటే, మనం వారి భూభాగంలోకి వెళ్ళి పోరాటం చేయలేము. కాబట్టి నిర్మాణం, నిర్వహణ, అథికారల విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఉండాలి.
8) ఇటు పోలవరం నిర్మాణం జరగిన తరువాత మనకు శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణా డెల్టాకు హక్కుగా లభించే వాటా నీటిని రాయలసీమకు మళ్ళించుకోవచ్చును. అరకంగా మన రాష్ట్ర జల అవసరాలకు మన వాటా నీరు ఉపయోగపడుతుంది.
9) ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎర్పాటు చేసుకున్న ఉమ్మడి అస్థులు విషయంలోనే ఏన్నో మెలికలు పెడుతున్న కేసిఅర్‌ గారు, రేపు అరుదైన, అమూల్యమైన జలవనరుల విషయంలో అడ్డం పడరు అనటానికి ఆస్కారం లేదు. ఎన్నో సార్లు అయన మాటలు మార్చటం చూసాము. మాట మీద నిలబడని ఏకైక రాజకీయ నాయకుడు కేసిఅర్‌ గారు. అటువంటి వ్యక్తితో సంభందాలు, సంభాషణలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యమంత్రి గారూ దయచేసి పై విషయాలలో ఎటువంటి ప్రలోభాలకు లోంగకుండా, మొహమాటాలు పడకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, స్పష్టంగా చర్యలు, చర్చలు, ఒప్పందాలు జరగాలి. సదరు విషయాలు ముందుకు సాగటానికి పూర్వమే, ప్రజలలో బహిరంగ చర్చకు పెట్టి, ప్రజల అమోదంతో ముందుకు సాగాలని మనవి.
కాని పక్షంలో మీరు చేసుకున్న ఒప్పందాలు మన రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, ప్రగతికి మరణశాసనాలు అవుతాయి. ఈ ఉత్తరంలో ఏమైనా పొరబాటు దోర్లినా, అసంగత విషయాలు అనిపించినా, మన్నించండి.
కానీ ఇందులో అంశాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలని ప్రార్ధిస్తున్నాము.
ఇట్లు
తమ ప్రజానీకం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here