అక్రమ కేసులతో వేధిస్తున్నారు

0
96
సెంట్రల్‌ జైలులో హర్షకుమార్‌ను పరామర్శించిన రాజప్ప
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : దళిత సామాజిక వర్గానికి నాయకుడుగా ఉంటూ పదేళ్ళపాటు పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేసిన జి.వి.హర్షకుమార్‌ను జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రిమాండ్‌ కారణంగా సెంట్రల్‌ జైలులో ఉన్న హర్షకుమార్‌ను రాజప్ప, రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా ప్రథమ చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ గతంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కూడా ఈ విధంగానే అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు.  హర్షకుమార్‌ తనపై ఉన్న కేసులకు సంబంధించి హైకోర్టులో స్టే తెచ్చుకున్న తరువాత కూడా అరెస్ట్‌లు చేయించారన్నారు. కేవలం ప్రజాప్రతినిధిగా తమతో ఉన్న స్నేహభావం కారణంగానే హర్షకుమార్‌ను కలిసి మద్దతుగా నిలిచామని, ఇందులో వేరే రాజకీయాలు ఏమీలేవని రాజప్ప అన్నారు. రాజధాని అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టిన తరువాత వైసిపి నేతలు రకరకాల ప్రకటనలు చేస్తున్నారని, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలు తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. ఇలాంటి గందరగోళ నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్‌ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుండి రైతులు, పెట్టుబడిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.  అనంతరం సెంట్రల్‌ జైలు నుంచి హర్షకుమార్‌ నివాసానికి వెళ్ళి అక్కడ కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, పేపరుమిల్లు కార్మిక సంఘం నాయకుడు చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, ఆచంట బాలాజీ, శనివాడ అర్జున్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here