అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలి

0
371
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 28 : అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రత్యేక న్యాయస్థానం ద్వారా న్యాయం చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (ఆర్‌పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్‌పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 1995 సం||రం|| నుండి 2012-13 సం||రం|| వరకు నాటి పాలకుల నుండి నేటి పాలకుల వరకు అగ్రిగోల్డ్‌ సంస్థను స్థాపించిన అల్వా వెంకట రామారావు, వారి కుటుంబ సభ్యులను మరికొంతమందిని అధికారికంగా ప్రోత్సహిస్తూ ప్రజలకు ఆ సంస్థపై నమ్మకం కలిగే లాగా చేశారన్నారు. అగ్రిగోల్డ్‌ మార్కెటింగ్‌ను, ఆ సంస్థ కార్యకలాపాలను ప్రభుత్వం అధికారికంగా కొనసాగటానికి అన్ని రకాల అనుమతులు కల్పించిందని, కొంతమంది సెలబ్రిటీస్‌ కూడా ఈ సంస్థకు ప్రచారం చేసి ప్రజలను నమ్మించారని ఆయన తెలిపారు. ఈ సంస్థపై ప్రభుత్వం, సెలబ్రిటీస్‌ కల్పించిన నమ్మకం కారణంగా 8 రాష్ట్రాలలో 32 లక్షలమంది ఈ సంస్థలో నగదు డిపాజిట్లు చేసి అగ్రిగోల్డ్‌ సంస్థను ప్రోత్సహించారు. ఈ సంస్థ ఖాతాదారుల నుండి సుమారు 8వేల కోట్లు వసూలు చేసి బాధితులను మోసగించింది. సుమారు 6 లక్షలమంది నిరుద్యోగులు ఈ సంస్థను నమ్మి ఏజెంట్లుగా కొనసాగి నేడు బాధితుల నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అగ్రిగోల్డ్‌ చేసిన మోసానికి ఆందోళన చెంది సుమారు 110 మంది గుండెపోటుతోను, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 20 లక్షల మంది బాధితులు 2 లక్షలకు పైబడి ఏజెంట్లు నేడు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని ఈ సంస్థలో అధిక శాతం, నిరుపేదలు, సామాన్యులు, మధ్య తరగతి కుటుంబీకులే మోసపోయారని కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం సిఐడి దర్యాప్తుతో చేతులు దులుపుకుందని, ప్రస్తుతం అగ్రిగోల్డ్‌ సమస్య న్యాయస్థాన విచారణలో వుందని, భారతదేశంలో పాలనా వైఫల్యం కారణంగా తీర్పు వెలువడే సరికి బాధితులలో సగం మంది జీవించి వుంటారా? అనే సందేహం బాధితులను వెంటాడుతుందని ఆయన పేర్కొన్నారు. బాధితుల కష్టార్జితంను అగ్రిగోల్డ్‌ సంస్థ నిర్వాహకులు దోచుకుంటున్నారని, న్యాయం కోసం బాధితులు ప్రభుత్వం చుట్టూ నేతలు చుట్టూ సిఐడి కార్యాలయం చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరగడానికి రవాణా ఖర్చులు, ఫీజులు, ఇతర ఖర్చులు, అతి విలువైన సమయాన్ని బాధితులు నేటికి అనుభవిస్తూ మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు.  ఒక ప్రక్క ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ అప్పులకన్నా ఆస్థులు ఎక్కువ ఉన్నాయని అని చెప్పుతున్నారు. మరోప్రక్క కేంద్ర, రాష్ట్ర అధికార పాలకులు అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలుస్తాం అంటున్నారు. ఇంకో ప్రక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ వంకతో వారి పార్టీ కార్యకలాపాలకు కార్యకర్తల వలే వాడుకుంటున్నారు. కానీ ఓ ఒక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాలను నిలదీయటం లేదు, ప్రశ్నించడం లేదు అని ఆయన తీవ్ర ఆక్షేపణ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే అగ్రిగోల్డ్‌ ఆస్థులను తక్షణం స్వాధీనం చేసుకుని ప్రత్యేక నిధుల నుండి బాధితులకు ఇవ్వాల్సిన నగదును చెల్లించాలన్నారు. బాధితుల మానసిక వేదనకు కనికరించి 3 నెలల గడువులోపు న్యాయస్థాన తీర్పు వెలువడే విధంగా ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రభుత్వం నియమించి యుద్ధ ప్రాతిపదికన అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణ న్యాయం చేయాలని ఆర్‌పిసి అధ్యక్షులు మేడా ప్రభుత్వాన్ని  డిమాండ్‌ చేశారు. సభకు ఆర్‌పిసి నగర అధ్యక్షులు కాసా రాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆర్‌పిసి సెక్యులర్స్‌ పొట్నూరి అప్పలస్వామి, లంక దుర్గాప్రసాద్‌, ఆర్‌.కె.చెట్టి, డి.వి.రమణమూర్తి, కాకి ఈశ్వర్‌, దుడ్డె త్రినాథ్‌, ద్వాదశి శ్రీను, సిమ్మా దుర్గారావు, జిత్తుక అప్పన్న, వనుం శ్రీను, గోపి శ్రీను, కొల్లి సిమ్మన్న, ఖండవల్లి భాస్కర్‌, తిర్లెపర శ్రీను పాల్గొన్నారు.