అగ్రిగోల్డ్‌ బాధితులకు బేషరతుగా చెల్లింపులు జరపాలి

0
286
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణం ప్రభుత్వం బేషరతుగా చెల్లింపులు జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్‌ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజంట్స్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో శారదా కుంభకోణంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని  ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చెల్లింపులు జరిపిందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం తక్షణం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని  డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ కంపెనీ నిర్వాకం కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వందమందికి పైగా బలైపోయారని, అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అగ్రిగోల్డ్‌  ఆస్తులను విక్రయించి బాధితులకు సత్వరం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.   సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ యాజమాన్యం దుర్మార్గ వైఖరి కారణంగా బాధితులకు, ఏజంట్లకు రావాల్సిన మొత్తం అందడం లేదని,  దేశ వ్యాప్తంగా ప్రజలనుంచి వసూలు చేసిన మొత్తాన్ని బినామీ పేర్లతో ఉంచి అనుభవిస్తున్న అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కారణంగా పేద ప్రజలు నానా అగచాట్లకు గురవుతున్నారని, కొందరు పిల్లల పెళ్ళిళ్లు చేయలేక, మరికొందరు మంచి చదువు చెప్పించలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఏజంట్లపై డిపాజిటుదారుల ఒత్తిడి అధికంగా ఉన్నందున ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ ఏజంట్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పురెడ్ల శేషు కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ 9వ తేదీన విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వెలగపూడి సచివాలయం వరకు నిర్వహించనున్న పాదయాత్రలో ప్రతీ ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వినతి పత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవల మరణించిన అగ్రిగోల్డ్‌ ఏజంట్‌ కెఆర్‌వివి దుర్గా ప్రసాద్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. పేద కుటుంబానికి చెందిన దుర్గా ప్రసాద్‌ కుటుంబానికి ప్రభుత్వ సిఎం సహాయనిధినుండి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ఈసమావేశంలో తీర్మానించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కిర్ల కృష్ణ, అగ్రిగోల్డ్‌ సంఘ కార్యదర్శి పి.విజయ్‌కుమార్‌, సహాయ కార్యదర్శి బిఎన్‌మూర్తి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎన్‌.వివి సత్యనారాయణ( నాగు), జి.శ్రీహరి రాధాకృష్ణ, వి.భవాని, టి.చక్రవర్తి, అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజంట్లు పెద్దయెత్తున పాల్గొన్నారు.