అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో కేంద్రం ఎందుకు చొరవ చూపడం లేదు ?

0
394
రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల సూటి ప్రశ్న – పవన్‌, జగన్‌ల తీరుపై ధ్వజం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 23 : అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడం లేదని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ మహారాష్ట్ర కేంద్రంగా ఇటువంటి ఆర్ధిక నేరమే జరిగితే కేంద్రం చొరవ చూపిందని, అగ్రిగోల్డ్‌ విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. బిజేపి నేతలు రాంమాధవ్‌, కన్నా లక్ష్మినారాయణలు అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. వారి పోరాటంలో చిత్తశుద్ది కొరవడం వల్లే వారి ధర్నాకు పట్టుమని పదిమంది కూడా రాలేదని, ప్రజా స్పందన కొరవడిందన్నారు. అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌లు సేకరించింది, అవకతవకలకు పాల్పడింది 2014కు ముందని, ఆ సమయంలో సహకార మంత్రిగా కన్నా లక్ష్మినారాయణే ఉన్నారని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు కోర్టు ద్వారా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం  పోరాడుతుందన్నారు. అగ్రిఆస్తులపై కోర్టు ప్రకటించిన ధరలకు బిజేపి నేతలు కొనుగోలు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. బిజేపి నేత రామమాధవ్‌ తెలుగువాడినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కోనసీమ వాసి అయ్యి ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏమి సాధించారని ప్రశ్నించారు. కేంద్ర  ప్రభుత్వ సంస్ధలైన సిబిఐ, రా లు అవినీతిమయం కావడానకి మోదీ, అమిత్‌షాలే కారణమన్నారు. జివిఎల్‌ను అచ్చోసిన అంబోతులా ఎపిపైకి వదిలేశారని మండిపడ్డారు. ఢిల్లీలో పైరవీలు చేసుకుని బ్రతికే వీధికుక్క జీవిఎల్‌ అని తీవ్రస్వరంతో విమర్శించారు. జీవిఎల్‌ నీ బ్రతుకేమిటీ, ఎక్కడ నుంచి వచ్చావు, ఎపిలో కనీసం పంచాయితీ బోర్డు మెంబర్‌గానైనా పోటీ చేసి గెలవగలవాని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు ఇవ్వలేదని, రైల్వే జోన్‌ ఇవ్వలేదని, పెట్రో కెమికల్‌ కారిడార్‌, పోర్టులు ఇవ్వలేదని, పోలవరంకు నిధులు ఇవ్వడం లేదని, చివరికి నన్నయ అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ. 30 కోట్లుకూడా వెనక్కి తీసుకున్నారని కేంద్రంపై నిప్పులు చెరిగారు. నగరంలో ఐదు ఫ్లై ఓవర్‌లకు గాను ఒక్కదానికే నిధులు మంజూరు చేశారన్నారు. బరితెగించి ఇష్టారాజ్యంగా కేంద్ర సంస్ధలతో బెదిరించాలనుకుంటే వారి పప్పులేమీ ఉడకవన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిద్దామనుకుంటే ఎపి ప్రజలు జగన్‌, పవన్‌లులాగా చేతకాని దద్దమ్మలు కారన్నారు. ఆత్మాభిమానం కోసం పెట్టిన పార్టీ టిడిపీ అని గుర్తుచేశారు. తీత్లీ తీవ్రతను ప్రపంచానికి తెలియజేయలేదని పవన్‌ చెప్పడం హాస్యాప్పదంగా ఉందన్నారు. తిత్లీ వచ్చిన రోజున చంద్రబాబు నిద్రపోకుండా అధికారులను అప్రమత్తం చేశారని, మరుసటి రోజునే శ్రీకాకుళం వెళ్ళి సహాయక చర్యలు ముమ్మరం చేశారని, వారంరోజులుగా తిత్లీ ప్రభావం గురించి టీవి ఛానల్స్‌లో వచ్చినా తెలియదనడం సరికాదన్నారు. తిత్లీలో ఇళ్ళు కోల్పోయిన వారందరికీ రూ.2.5లక్షలతో ప్రభుత్వం ఇళ్ళు నిర్మించనుందని, నష్టపరిహారం రెండు రెట్లు చేసిందని గుర్తుచేశారు. పవన్‌కు దమ్ముంటే ప్రధాని ఇంటి ఎదుట ధర్నా చేయాలన్నారు. తిత్లీతో శ్రీకాకుళం అతలాకుతలం అయితే ఒక్క బిజేపి నేత అయినా రాకపోవడం దారుణమన్నారు. అవినీతి మయమయిన బిజేపి నేతలకు టిడిపి గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్యాపురం కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శంకర్రావు, సాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం బ్యాంక్‌ డైరెక్టర్‌ సూరంపూడి శ్రీహరి, శీలం గోవింద్‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here