అటే వెళదామా ?

0
645
జనసేనలో చేరాలని దుర్గేష్‌పై ఒత్తిడి
రేపు అనుచరులతో సమావేశంలో నిర్ణయం
రాజమహేంద్రవరం, ఆగస్టు 11 : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు వ్యవధి సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఉన్న పార్టీల్లో తమకు భవిష్యత్తు, అవకాశాలు లేవని భావిస్తున్న కొందరు నేతలు ‘ప్రక్క’ చూపులు చూస్తున్నారు.  గడువు ప్రకారం జరిగితే ఎన్నికలకు ఇక ఎనిమిది నెలలు మాత్రమే వ్యవధి ఉన్నందున ఆ నేతలు తమ తమ పార్టీల్లో తమకు దక్కుతున్న ప్రాధాన్యత, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశాలు, గెలుపోటముల గురించి అంచనా వేసుకుని భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. సాధారణంగా ఈ పరిస్థితి అధికార పక్షంలో ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఈ వాతావరణం కనిపిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య అధికంగా ఉండటంతో చాలా మంది నేతలకు తమ రాజకీయ భవితవ్యంపై బెంగ పట్టుకుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సోదిలో లేకుండా పోవడంతో ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు సైద్ధాంతికం ఇమడలేమనే కారణంతో పాటు  అంతవరకు ప్రధాన ప్రత్యర్థిగా కత్తులు దూసుకున్న పార్టీ కావడంతో అధికార తెలుగుదేశంలోకి వెళ్ళలేక  తమ అభిమాన నేత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహనరెడ్డి స్థాపించిన కాంగ్రెస్‌ అన్న పదం ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి క్యూ కట్టారు. వీరిలో కొందరు టిక్కెట్‌పై అధినేత జగన్‌ నుంచి హామీ పొంది వచ్చిన వారు కొందరైతే మరికొందరు బేషరతుగా చేరిన వారూ ఉన్నారు. అయితే అప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతలకు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఈ కొత్తవారి రాక కొంత ఇబ్బందిగా తయారైంది. ఓ వైపు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇంతవరకు పెరగకపోగా ఇప్పట్లోనూ పెరిగే అవకాశాలు లేకపోవడంతో పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇది ఓ విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధి నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఉన్న నేతలకు నచ్చచెప్పలేక, కొత్త నేతలకు ఎలా సర్ధుబాటు చేయాలో తెలియక జగన్‌ కూడా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కల్పనపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని కలిగించడమే గాక ఆ సామాజిక వర్గ ఆగ్రహాన్ని ఆయన చవి చూడవలసి వచ్చింది. జిల్లాలో కొనసాగుతున్న జగన్‌ పాదయాత్రలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. జగన్‌ ప్రకటన ఆ పార్టీలోని కాపు సామాజిక వర్గ నేతలకు ఇబ్బందిగా మారింది. టిక్కెట్లపై స్పష్టమైన హామీ దక్కకపోవడంతో పాటు తమ సామాజిక వర్గ ప్రయోజనంపై జగన్‌ నుంచి ప్రతికూల వ్యాఖ్యలు రావడం వారిని మరింత నైరాశ్యపర్చింది. దీంతో చాలా మంది నేతలకు తమ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. తెలుగుదేశంలోకి వెళ్ళలేక, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉండలేని పరిస్థితుల్లో వారికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఓ పెద్ద ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. అనుచర గణం కూడా తమ నేతలపై ఒత్తిడి తెస్తుండటంతో వారు డోలాయమానంలో పడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే అక్కడ కూడా ద్వారాలు మూసుకుపోతాయేమోనన్న బెంగ వారిలో మొదలైంది. అయితే సామాజిక సమీకరణలపై తనకు ఆసక్తి, నమ్మకం లేదని పవన్‌ తెగేసి చెప్పినా కూడా అనుచర గణంలో యువత మాత్రం తమ నేతలను జనసేనలోకి వెళ్ళాలని ఒత్తిడి తెస్తుండటంతో  ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వారికి ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లాలో కొందరు నేతలు ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను వీడి జనసేనలోకి  వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం శాఖ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ రేపు తన అనుచర గణంతో సమావేశమవుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దుర్గేష్‌ రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించి తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో త్రిముఖ పోరు నెలకొని ఉంది. గత ఎన్నికల్లో రూరల్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ప్రస్తుత కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు నియోజకవర్గాన్ని వీడకుండా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ తిరిగి వచ్చే ఎన్నికల్లో పోటీకి  సిద్ధమవుతున్నారు. అలాగే కడియం గ్రామానికి చెందిన ప్రముఖుడు గిరజాల బాబ్జీ కూడా ఈ నియోజకవర్గం టిక్కెట్‌ ఆశిస్తూ ఆయన కూడా చాపకింద నీరులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నా జగన్‌ మొగ్గు వీర్రాజు వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దుర్గేష్‌కు పార్లమెంట్‌ టిక్కెట్‌ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్‌ అనూహ్యంగా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ టిక్కెట్‌ను బీసీ వర్గానికి కేటాయిస్తామని ప్రకటించడంతో దుర్గేష్‌ వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది. అంతే గాక దుర్గేష్‌కు పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించినా పార్టీ పరంగా ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి అనుచరగణంలో ఉంది.  దీంతో తమ నేత రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత కావాలని వారు పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దుర్గేష్‌ రేపు తన అనుచరులతో సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అనుచరుల ఒత్తిడి, సూచన మేరకు దుర్గేష్‌ జనసేన వైపు అడుగులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో  ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లువుతుందని భావిస్తున్నారు. మంచి వక్తగా, సమస్యలపై సునిశిత పరిశీలన, అవగాహన కలిగిన సమర్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందిన దుర్గేష్‌ జనసేనలో చేరితే ఆ పార్టీకి సానుకూలాంశమే అవుతుంది. అంతే గాక దుర్గేష్‌ బాటలో జిల్లాలో మరి కొందరు నేతలు జనసేన బాట పట్టే అవకాశాలు లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here