‘అడగని వారిది పాపం..అడిగిన వారికి అన్నీ చేస్తున్నాం’

0
286

ఏం చేసినా అడ్డుకుంటారు… ఆ తర్వాత ఏం చేయలేదంటారు!

పండుగలా జరిగిన జన్మభూమిపై విమర్శలా ?

ప్రతిపక్షాల తీరుపై రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల ధ్వజం

రాజమహేంద్రవరం, జనవరి 13 : ప్రతిపక్షాలు రాజకీయ దురుద్ధేశ్యాలతోనే జన్మభూమి కార్యక్రమం దండగని విమర్శలు చేస్తున్నాయని, వాస్తవానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా పండుగలా జరిగిందని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. జన్మభూమి కార్యక్రమం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతోందని, కొన్ని సమస్యలను వెనువెంటనే పరిష్కరించినా, ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల ప్రతికూల భావం ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ జన్మభూమి మొక్కుబడిగా సాగిందన్న విమర్శకుల మాటల్లో నిజం లేదని, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం సాగిందని, ‘అడగని వారిదే పాపం అడిగినవారందరికి అన్నీ చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామసభల్లో కొత్త ఫించన్లు, కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ప్రయోజనాలు అందజేశామని, ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకుని వాటి పరిష్కారానికి తదుపరి చర్యలకై అధికారుల దృష్టికి తీసుకెళుతున్నామని తెలిపారు. ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా విమర్శలు చేస్తున్నాయన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎందరికో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఒక్క హక్కుంపేట గ్రామంలోనే రూ. 18 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని, దుళ్ళ వంటి గ్రామాల్లో కూడా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభమవుతున్నాయని, అర్హులైన వారందరికో ఫించన్లు, ఇళ్ళ పట్టాలు, రేషన్‌ కార్డులు అందిస్తున్నామని, రూ. కడియం, రూరల్‌ మండలాల్లో రూ. 139 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామాల్లో ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తూ, ప్రతి గ్రామంలో స్మశాన వాటికలు, దోబీఖానాలు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్కీమ్‌లు చేపడుతున్నామన్నారు. రెండున్నర లక్షల సబ్సిడీతో 70 మందికి ట్రాక్టర్లను పంపిణీ చేశామని, వివిధ పథకాల కింద రుణాలు మంజూరు చేయించామని, గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటా మరుగుదొడ్లు కట్టుకునేలా ప్రోత్సహకాలు అందించామని, ఈ ఏడాది భారీగా గృహ నిర్మాణం చేపట్టామని గోరంట్ల తెలిపారు. అనేక గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోందని, ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌ పథకం కింద పెద్ద ఎత్తున గృహాల నిర్మాణం జరుగుతోందన్నారు. రూరల్‌ నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లలో అర్హులైన వేయి మందికి ఫించన్లు ఇచ్చామన్నారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నా ”ఏం చేశారు” అని ప్రతిపక్షాలు అడుగుతుంటే వారిని ఏమనాలో తెలియడం లేదని గోరంట్ల వ్యాఖ్యానించారు. ”ఏమైనా చేద్దామంటే అడ్డుకుంటారు…ఆ తర్వాత ఏమీ చేయలేదంటారు” అని ప్రతిపక్ష నేతల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. మరో వైపు అధికారుల తీరు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. కొందరు అధికారులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ప్రజలను ఒప్పించి కొన్ని రహదారుల విస్తరణ చేపట్టగా వారికి ఇవ్వవలసిన బాండ్లను ఇప్పటికీ ఇవ్వకపోవడం సరికాదని, నగర ప్రజలు ఎంతో సహృదయులని, నగరాభివృద్ధిలో, రహదారుల విస్తరణలో వారి సహృదయుత మరువలేనిదన్నారు. అయితే అవసరం తీరాక ఇలా వ్యవహరిస్తే మున్ముందు రహదారుల విస్తరణ పనులు చేపట్టడం ఇబ్బందిగా మారుతుందన్నారు. స్టేడియం నిర్మాణ పనుల్లో, కంబాలచెరువు అభివృద్ధి పనుల్లో…ఇలా అన్నింటా అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులకు మంచిగా చెబుతున్నా వారు తీరు మార్చుకోవడం లేదని, వారిని ఎలా దారికి తేవాలో తమకు తెలుసని ఆయన ఆగ్రహంగా అన్నారు. పిచ్చుకల్లంకతో సహ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి పర్చే విషయమై త్వరలో సీఎం సమక్షంలో ఓ సమావేశం జరగనుందని ఒక ప్రశ్నకు సమాధానంగా గోరంట్ల చెప్పారు. మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి, లాలాచెరువు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా ముగింపు దశకు వచ్చాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, రూరల్‌ తెదేపా నాయకులు మార్ని వాసు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here