అడుగులన్నీ బ్యాంక్‌లకే…

0
308
వేకువజామునుంచే బారులు తీరిన ఖాతాదారులు
కోట్లలో డిపాజిట్లు – వేలల్లో చెల్లింపులు – పలుచోట్ల వాగ్వివాదాలు
పోలీస్‌ బందోబస్తు మధ్య కార్యకలాపాలు – రేపటి నుంచి ఏటీఎంలు
బ్యాంక్‌ల్లో అదనపు కౌంటర్లు, వ్యవధి పెంపు – శని,ఆదివారాల్లో కూడా పని
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 10 : ‘ రెక్కాడితే గాని డొక్కాడదు’ అన్నది నిన్నటి మాట….’డబ్బు ఆడితే గాని చేయి ఆడదు’ అన్నది నేటి మాట. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో ఇంట్లో ఎంత డబ్బున్నా ఏమీ లేనట్టే అన్న చందాన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు బ్యాంక్‌లు, పోష్టాఫీస్‌ల్లో  ఈరోజు నుంచి పాత నగదు డిపాజిట్‌ చేసి వంద రూపాయల నోట్లను లేదా అందుబాటులో ఉంటే కొత్త కరెన్సీ తీసుకునే అవకాశం కల్పించడంతో వాటికి పోటెత్తారు. అయితే రూ. 50, 20, 10 రూపాయల నోట్లను కూడా బ్యాంక్‌లు ఇస్తుండటంతో నిన్నటి వరకు వాటిని తీసుకోవడానికి ఇష్టపడని ప్రజలు ఈరోజు ఆ నోట్లను కళ్ళకు అద్దుకుని తీసుకుంటున్నారు. కొత్త నోట్లు తగినన్ని అందుబాటులోకి రాకపోవడంతో రూ. 100, రూ.50, 20, 10 నోట్లను తీసుకుంటున్నారు. వేకువజాము నుంచే బ్యాంక్‌లు, పోష్టాఫీస్‌ల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. అన్ని బ్యాంక్‌ల ముందు ఇదే పరిస్థితి కనిపించింది. తమ వద్ద ఉన్న రూ. 500, రూ.1,000 నోట్లను ఎకౌంట్‌ ఉన్న బ్రాంచీలకు వెళ్ళి డిపాజిట్‌ చేసి రోజువారీ అవసరాల కోసం కొత్త నోట్లను లేదా వంద లేదా ఇతర చిన్న   నోట్లను తీసుకోవడం కోసం ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. చేతిలో డబ్బులు ఆడకపోవడంతో నిన్న తీవ్ర ఇబ్బందులకు పడ్డ ప్రజలు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసి ఈ వేకువజాము నుంచే బ్యాంక్‌లకు పరుగులు తీశారు. దాదాపు అన్ని బ్యాంక్‌ల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పని వేళలను పెంచారు. వాస్తవానికి ఈ నెల 12, 13 తేదీల్లో బ్యాంక్‌లకు సెలవు రోజులైనా ఈ రెండు రోజుల్లో యథావిధిగా పనిచేయనున్నాయి. ఈరోజు కూడ ఏటీఎంలు పనిచేయకపోగా రేపటి నుంచి అవి పని చేయనున్నాయి.  కొత్తగా తీసుకొస్తున్న  రూ. 500, రూ.2,000 నోట్లను రేపటి నుంచి పనిచేయనున్న అన్ని ఏటీఎంలో ్ల అందుబాటులో ఉంటాయని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. రేపటి నుంచి ఏటీఎంల్లో రూ. 50 నోట్లు కూడా అందుబాటులోకి రానున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పాత నోట్ల మార్పిడికి, కొత్త నోట్లను తీసుకోవడానికి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయడమే గాక తమ శాఖలు ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయని  ఎస్‌బిఐ వర్గాలు తెలిపాయి.  ఐసిఐసిఐ బ్యాంక్‌లైతే ఈరోజు, రేపు రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఐసిఐసిఐ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా పనివేళలను పెంచి ఏటీఎంల్లో విత్‌డ్రాలపై ఆంక్షలు తొలగించామని ప్రకటించింది. నోట్ల మార్పిడికి 50 రోజుల సమయం ఉన్నందున వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.  కాగా బ్యాంక్‌ల్లో తగినన్ని రూ.500, రూ. 2000 నోట్లు అందుబాటులో లేకపోవడంతో  రూ. 100, రూ. 50 నోట్ల కోసం గిరాకీ ఏర్పడింది.  ఇలా ఉండగా కొన్ని బ్యాంక్‌లో ్ల డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తుండగా మరి కొన్ని బ్యాంక్‌ల్లో డిపాజిట్ల స్వీకరణతో పాటు  నగదు చెల్లింపు కూడా చేస్తున్నారు. అయితే బ్యాంక్‌ల్లో వారానికి రూ. 20 వేల వరకు మాత్రమే చెల్లింపులు ఉంటాయి. రోజుకు నాలుగు వేల రూపాయల వరకే సొమ్ము చెల్లిస్తారు. అయితే సొమ్ము తీసుకోవడానికి ఖాతాదారులు పాన్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు, మరేదైనా ధృవీకరణ పత్రాన్ని విధిగా బ్యాంక్‌లో చూపవలసి ఉంటుంది. ఇలా ఉండగా బ్యాంక్‌ల వద్ద రద్దీని నియంత్రించేందుకు, ఘర్షణలను నిరోధించడానికి అన్ని శాఖల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.  బ్యాంక్‌ల్లో రూ. 2.50 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకుంటే ఆదాయ పన్ను శాఖ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అయితే ఒకే ఖాతా నుంచి నిత్యం భారీగా సొమ్ము డిపాజిట్‌ చేస్తే మాత్రం ఆ ఖాతాదారులు ఆ శాఖ సందేహాలను నివృత్తి చేయవలసి ఉంటుంది.