అదుపు తప్పిన స్కార్ఫియో

0
1142
ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి గాయాలు – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
లోకేష్‌ పర్యటనలో అపశృతి – జాతీయ రహదారిపై ప్రమాదం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 16 : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. లోకేష్‌ పర్యటిస్తున్న వాహనశ్రేణిలోని స్కార్పియో వాహనం జాతీయ రహదారిపై వేమగిరి నుంచి లాలాచెరువువైపు వస్తుండగా డెక్కన్‌క్రానికల్‌ కార్యాలయం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని తిరగబడింది. వాహనం వేగంతో రావడంతో మూడు పల్టీలు కొట్టింది. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాను ప్రారంభించడానికి వస్తున్న నారా లోకేష్‌కు వేమగిరి జంక్షన్‌వద్ద తేదేపా శ్రేణిలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి భారీ కాన్వాయ్‌తో నగరంలోకి వస్తుండగా ఈ అపశృతి చోటు చేసుకుంది లోకేష్‌ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు గాయాలయ్యాయి. అలాగే నడుపుతున్న డ్రైవర్‌ బి అనిల్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాన్వాయిల్‌లో ప్రమాదం జరగడంలో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బోల్తా పడిన కారులో ఆదిరెడ్డి ఉండటంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనను  ఎంతగానో శ్రమించి బయటకు తీశారు. హుటాహుటిన బొల్లినేని హాస్పటల్‌కు తరలించారు. ఆదిరెడ్డి చేతికి గాయాలు కాగా ఆయన చికిత్స పొందుతున్నారు. అలాగే డ్రైవర్‌ అనిల్‌కుమార్‌ తలకు బలమైన గాయం కావడంతో 11 కుట్లు వేశారు. ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జాబ్‌మేళా ప్రారంభించిన అనంతరం యువనేత నారా లోకేష్‌, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, టిడిపి నాయకులు బొల్లినేని హాస్పటల్‌కు వెళ్ళి ఆదిరెడ్డిని పరామర్శించారు. యువనాయకులు ఆదిరెడ్డి వాసుకు లోకేష్‌ ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబు చేశారు. అనంతరం డ్రైవర్‌ అనిల్‌కుమారును లోకేష్‌, చినరాజప్ప ఇతర నాయకులు పరామర్శించారు. అనంతరం లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ భగవంతుడు దయవల్ల ఆదిరెడ్డి స్వల్ప గాయాలతోనే బయటపడ్డారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.