అదే ఉత్సాహం….అవే కేరింతలు

0
363
ఆరవ వారం కోలాహలంగా హ్యాపి సండే
బాక్సింగ్‌ విద్యార్ధినికి దన్నుగా ఉంటామని కమిషనర్‌ హామీ
రాజమహేంద్రవరం, నవంబర్‌ 27 : అదే వేదిక….అదే ఉత్సాహం…అవే కేరింతలు….. హ్యాపి సండే కార్యక్రమంతో  పుష్కరఘాట్‌  పరిసరాలు మళ్ళీ కోలాహలంగా కనిపించాయి. నగర పాలక సంస్థ ఆధ్వర్యాన గత ఆరు వారాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్ధులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ వారం శేఖర్‌ డ్యాన్స్‌ స్కూలు విద్యార్ధుల ప్లాష్‌మోబ్‌ అందరినీ ఆకట్టుకుంది. చిన్న పిల్లలు,యువకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా నృత్యాలు చేసి అందరినీ అలరించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్ధినీ విద్యార్ధుల కోలాటం, నృత్యాలు, ఆటలు ఆనందంగా సాగాయి. హ్యాపి సండేలో ఇటీవలే అండర్‌ –  17 జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన శ్రీనివాస రామానుజమ్‌ నగర పాలక సంస్థ పాఠశాల విద్యార్ధిని నజ్రీన్‌ బాక్సింగ్‌ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు మాట్లాడుతూ నగర పాలక సంస్థ తరఫున  నజ్రీన్‌ను ప్రోత్సహిస్తామని, త్వరలో శ్రీలంకలో జరిగే పోటీలకు  వెళ్ళేందుకు సహాయ సహకారాలను అందిస్తామని ప్రకటించారు. శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, గొందేశి మాధవిలత, గొర్రెల సురేష్‌,పితాని లక్ష్మీ తదితరులు నజ్రీన్‌ను అభినందించారు.  రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్చచౌదరి కొద్దిసేపు హ్యాపి సండే కార్యక్రమంలో పాల్గొని విద్యార్దుల ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా రాయల్‌ మింజ్‌ సంస్ధ నగర పాలక సంస్థకు బహుకరించిన కొత్త వాహనాన్ని  గోరంట్ల చేతుల మీదుగా అందజేశారు.  రూ. 8.5 లక్షలు విలువ చేసే ఈ వాహనాన్ని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి అందజేయనున్నారు.