అధికారం కాదు….రాష్ట్రం శాశ్వతం

0
168
(జీ.కె. వార్తా వ్యాఖ్య)
శాసనసభ శీతాకాలపు సమావేశాల ఆఖరురోజున గౌ. ముఖ్యమంత్రి గారు రాజధానిగా అమరావతి కొనసాగింపుపై ఎట్టకేలకు స్పందించారు. ఆ స్పందన కూడా అలా ఇలా లేదు.. గుంటూరు మిరపకారంలా చాలా ఘాటుగా.. ఎవ్వరూ ఊహించని విధంగా రాష్ట్రానికి ఒక్క రాజధానేం ఖర్మ.. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు.. ఉత్తరాంధ్ర విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని.. అమరావతి లెజిస్లేటివ్‌ కేపిటల్‌గా, రాయలసీమ కర్నూలు జ్యుడీషియల్‌ కేపిటల్‌గా వుండవచ్చు అని సంచలనాత్మక ప్రకటన చేసారు.. బహుశా ఆ మేరకు ఈవిషయమై ఏర్పాటైన కమిటీ కూడా నిర్ణయం చేసే అవకాశముంది.. మరి కమిటీ నిర్ణయం చేయకముందే సీఎమ్‌ ఎందుకు చెప్పవలసివచ్చిందా అనే అనుమానం చాలా మందికి వస్తుంది.. వాళ్లు వెలిబుచ్చబోయే అభిప్రాయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి అదే ఫైనల్‌ కావచ్చు. ఇన్నాళ్లూ తాను మాట్లాడకుండా బొత్స వంటి మంత్రులతో రోజుకో మాట మాట్లాడిస్తూ గందరగోళం సృష్టించిన తరువాత సీఎమ్‌ తన అభిప్రాయం వెలిబుచ్చడంతో భూములిచ్చిన అమరావతి రైతుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.. సహజంగానే ఆందోళనలు కూడా మొదలయ్యాయి.  ఇంతకూ ఈ మూడు రాజధానుల నిర్ణయమెంతవరకూ ఆచరణ సాధ్యమో ఒకసారి పరిశీలిస్తే… శాసనసభ సమావేశాలు అమరావతిలో సాగుతాయి.. సెక్రటేరియట్‌ మొదలైన పరిపాలనా భవనాలూ విభాగాలూ విశాఖలో వుంటే హైకోర్ట్‌ కర్నూలులో వుంటుందన్నమాట.. శాసనసభకు అందుబాటులో లేకుండా సెక్రటేరియట్‌ అధికారగణం ఆరు వందల కిలోమీటర్ల దూరంలో వైజాగులో వుండడం ఆచరణయోగ్యమేనా.. ఎమ్మెల్యేలతో పనివున్న సామాన్యుడు అమరావతి వెళ్లి పనిచూసుకుని సెక్రటేరియట్‌ పనులకోసం కాని వివిధ శాఖల కార్యాలయాలకు కానీ వైజాగ్‌ వెళ్లాలి.. సుదూరంలో వున్న రాయలసీమ ప్రాంతవాసులకిది సులభ సాధ్యమేనా? అలాగే శ్రీకాకుళంవంటి ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు హైకోర్టు పనులమీద కర్నూలు వంటి రాష్ట్రానికి చివర వున్న ప్రాంతానికి వెళ్లడం కష్టం కాదా ?? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రభుత్వానికి లేదా ??? మాటతప్పను.. మడమతిప్పను.. అంటూ పదేపదే చెప్పే గౌ. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షనేతగా ఆనాడు శాసనసభలో రాజధానిగా అమరావతి వుండడాన్ని తాను స్వాగతిస్తున్నానని కనీసం ముప్పైవేల ఎకరాలైనా రాజధానికి కావాలీ అని ఆనాడు అన్న మాటలపై ఎందుకు వెనకకు తగ్గినట్లు? రాజధానిలో ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ వంటి అవకతవకలు జరిగి వుంటే ఎంక్వైరీచేసి అపరాధులను చట్ట ప్రకారం శిక్షించాలేగానీ మొత్తానికి అమరావతి కాన్సెప్ట్‌నే చెరిపివేయాలనుకోవడం విజ్ఞతా.. తెదేపా ఆరోపిస్తున్నట్లు కక్ష సాధింపుచర్యలు కాదా.. రివర్స్‌ పరిపాలనకు నిదర్శనం కాదా.. ప్రధాన ప్రతిక్షనాయకుడి మీది కోపాన్ని అమాయక రైతులమీద చూపించడం న్యాయమా… ఈ ప్రశ్నలన్నిటికీ అధికారపార్టీ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరముంది. తిరుగులేని ఆధిపత్యాన్ని 151 మంది ఎమ్మెల్యేల రూపంలో ప్రజలు తమకు కట్టబెట్టారన్న అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే అయిదేళ్లు తిరగకుండా అదే ప్రజలు ‘రివర్స్‌’అయ్యే ప్రమాదం వుంది.. ”అధికారం శాశ్వతం కాదు..సమాజం  శాశ్వతం.. ప్రజలు ముఖ్యం…వారి భవిష్యత్తు ముఖ్యం”అని గుర్తిస్తే మంచిది. ఎక్కడో దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయి కాబట్టి మనకెందుకుండకూడదన్న వితండవాదానికి పోతే ఇప్పటికే కులాల పేరుతో మతాల పేరుతో వైషమ్యాలు రేగుతున్న నవ్యాంధ్రలో ప్రాంతీయ విభేధాలు కూడా మొలకెత్తే  ప్రమాదాన్ని గుర్తించడం మంచిది.. ఈ నిజాన్ని అధికార పక్షమే కాకుండా ఈ నిర్ణయాన్ని సమర్ధించే అతికొద్ది కుహానా మేధావులు కూడా గుర్తించకపోతే రాబోయే తరాలకు తీరని ద్రోహం చేసిన వాళ్లవుతారు.. తస్మాత్‌ జాగ్రత్త !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here