అధినేతలు వస్తున్నారు..

0
52
రేపు జిల్లాకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రాక
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 4 : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు నెలల అనంతరం తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌లు రేపు వేర్వేరుగా తూర్పు గోదావరి పర్యటనకు రానుండటంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న శ్రేణులకు దిశా నిర్ధేశం చేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు నేతల పర్యటనలు దోహదపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అధినేతల పర్యటనలు విజయవంతానికై ఆయా పార్టీల శ్రేణులు సన్నద్ధమయ్యాయి. చంద్రబాబు తన పర్యటనలో కాకినాడలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనుండగా పవన్‌ కళ్యాణ్‌ మలికిపురం మండలంలోని దిండిలో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొని కోనసీమలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
చంద్రబాబు పర్యటన సాగుతుందిలా..
 చంద్రబాబు రేపు ఉదయం 8.30 గంటలకు  విజయవాడ నుంచి రావులపాలెం చేరుకుంటారు. ఆ తర్వాత 8.45 గంటలకు జొన్నాడ సెంటర్‌ మీదుగా వేమగిరి, రాజమహేంద్రవరం, రాజానగరం, పెద్దాపురం మీదుగా కాకినాడ రూరల్‌కు చేరుకుంటారు. కాకినాడ అచ్చంపేట వద్ద హోప్‌ ఆసుపత్రి ఎదురుగా ఉన్న లక్ష్మీ పరిణయ ఫంక్షన్‌ హాలుకు చేరుకుని ఉదయం 11 గంటలకు జరిగే జిల్లా తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని సాయంత్రం వరకు నియోజకవర్గ సమీక్షల్లో పాల్గొంటారు. రాత్రికి కాకినాడలో బస చేసి మరుసటి రోజు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం వరకు  మిగతా నియోజకవర్గాల నాయకులతో సమీక్షిస్తారు.
పవన్‌కల్యాణ్‌ పర్యటన వివరాలు..
పవన్‌కల్యాణ్‌ ఈ నెల 5,6 తేదీల్లో  రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పవన్‌ 5 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలక మలికిపురం మండలంలోని దిండి రిసార్ట్స్‌లో జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. 6 వ తేదీ ఉదయం దిండి రిసార్ట్స్‌ నుంచి బయలుదేరి అంతర్వేది వెళ్ళి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here