అధినేత నమ్మకాన్ని నిలబెట్టా….

0
497
రెండేళ్ళలో రూ.13.5 కోట్లతో గుడా అభివృద్ధి పనులు
అందరి కృషితో సంస్థను అత్యున్నత స్థానంలో నిలిపాం : మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, మే 27 :గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ(గుడా)ని తొలి చైర్మన్‌గా తనకు చంద్రబాబు అవకాశం కల్పించగా, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత రెండేళ్లుగా గుడా చైర్మన్‌గా సమర్థవంతంగా పనిచేసి అప్పగించిన బాధ్యతను సంతృప్తికరంగా నెరవేర్చానని గుడా మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు గన్ని కృష్ణ అన్నారు. స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని  గన్ని స్వగృహంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడా ద్వారా జిల్లాలో 13.5కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి రూ 2 కోట్ల 21 లక్షలు కేటాయించామని, ఆ పనులు కొన్ని పూర్తి కాగా, కొన్ని ప్రగతిలో ఉన్నాయన్నారు. తన పదవీ కాలం మే 20వ తేదీతోనే ముగిసిందని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తానని.. ఆ తరువాత అన్ని పార్టీల నాయకులతో స్నేహితుడిగానే ఉంటానన్నారు. గుడా ఏర్పడిన తరువాత చాలా ఒడిదుకులు.. ఇబ్బందులు ఎదుర్కొన్నామని అయినా ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారులు, ప్రభుత్వ పెద్దల సహకారంతో గాడిన పెట్టడానికి ప్రయత్నాలు చేసామన్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకుని వచ్చి భవనాల ప్లాన్లు, లే అవుట్లకు పారదర్శకంగా అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఏ ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు పదవి అప్పగించారో దాన్ని నెరవేర్చడానికి శాయశక్తులా పనిచేసానని పేర్కొన్నారు. సుదీర్ఘ ఎన్నికల కోడ్‌ కారణంగా చాలా మంది యుడిఎ చైర్మన్లు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అవకాశం దక్కలేదన్నారు. రాజమహేంద్రవరానికి అవుటర్‌ రింగ్‌ రోడ్డు సాధనకు విశేషంగా కృషిచేసామని, అది త్వరలోనే సాకారం కాబోతోందన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను లీ అసోసియేట్స్‌ సంస్థ తయారు చేసిందని గుడా అధికారులు వెల్లడించడానికి సిద్ధమవుతున్నారన్నారు. గతంలో గుడాకు వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన విజయరామరాజు, ప్రస్తుత విసి అమరేంద్ర, నగరపాలకసంస్థ కమీషనర్‌ సుమిత్‌కుమార్‌ తనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని, వారితో పాటు సిబ్బంది కష్టపడటం వలన  సిఆర్‌డిఎ తరువాత స్థానంలో గుడా ఉండటం తన పనితీరుకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో అనుమతులు ఆలస్యం కావడం వల్ల ప్రజల్లో చాలా అపోహలు వచ్చాయని అయినాసరే పారదర్శకంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్లామన్నారు. అనధికార లేవుట్లలో 60 శాతం అభివృద్ధి ఉంటే 40 అడుగుల రోడ్లు,డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం ఉంటే క్రమబద్ధీకరణ చేయించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి జిఓ తెచ్చామన్నారు. గుడా తొలి చైర్మన్‌గా పనిచేసి సగర్వంగా తనదైన ముద్ర వేసానని సంతోషం వ్యక్తం చేసారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఎప్పుడూ నారా చంద్రబాబునాయుడే మా ముఖ్యమంత్రని అన్నారు. రేపు తెదేపా వ్యవస్ధాపకులు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని గన్ని పిలుపునిచ్చారు.  సమావేశంలో పార్టీ నాయకులు రెడ్డి మణి,కురగంటి సతీష్‌, మళ్ల వెంకట్రాజు, మొన్ని చిన్ని యాదవ్‌, ఉప్పులూరి జానకీరామయ్య, సెనివాడ అర్జున్‌, కెవి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here