అధ్యాయం ముగిసింది – మాసంగతేవిటి మిగిలింది

0
208
మనస్సాక్షి  – 1153
వెంకటేశానికి బెంగ ఎక్కువయి పోయింది. ఆ బెంగేదో ఉద్యోగం రాలే దనో లేకపోతే ఎలక్షన్లో సీటు రాలేదనో కాదు. మరి.. పెళ్ళి కావడం లేదని..! ఓ పక్కన వయసు చూస్తుంటే మూడు పదులు దాటిపోతుందాయె. సంబం ధాలు రావడంలేదని కాదు గానీ వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వచ్చిన సంబంధా లేవీ వెంకటేశానికి నచ్చి చావడం లేదాయె. ఒక్కొక్కళ్ళయితే వెంకటేశానికి నచ్చితే వాళ్ళకి వెంకటేశం నచ్చడంలేదు. దాంతో యిక తనకి పెళ్ళి కాదని వెంకటేశం బెంగెట్టుకున్నారు. అయితే అక్కడికీ కొందరు అనుభవజ్ఞులయితే ‘పెళ్ళికాకపోవడం అదృష్ట మోయ్‌.. ‘పెళ్ళి చేసుకుని అనవసరంగా ఊబిలో దిగకు’ అని ఉదారంగా  సలహాలు కూడా యిచ్చారు. అయితే వెంకటేశం అదేం పట్టించుకోకుండా సంబంధాల వేటలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో  వెంకటేశానికి ఓ అమ్మాయి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఆ అమ్మాయి వెంకటేశానికి గుళ్ళో కనిపించింది. దాంతో వెంకటేశం కాస్తా విషయాన్ని తన యింట్లో చేరవేశాడు. వెంకటేశం తండ్రి నారాయణ ఆ అమ్మాయి గురించి ఎంక్వయిరీ చేయిస్తే ఆ అమ్మాయి పేరు మంగతాయారనీ, సుబ్బావధాన్లు గారి అమ్మా యనీ తేలింది. దాంతో యింకాలస్యం చేయకుండా నారాయణ గబగబా సుబ్బావధాన్లు గారింటికెళ్ళిపోయాడు. తనని పరిచయం చేసుకుని ”మా అబ్బాయి వెంకటేశం ఎంబీఏ చేసేశాడు. ఉద్యోగంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ చిరంజీవి మంగతాయారుని గుడిలో చూశాట్ట. తెగ నచ్చేసిందట. మీరు ఊ అంటే వాళ్ళిద్దరికీ ముడి పెట్టేద్దాం. ఏవంటారు?” అన్నాడు. దానికి సుబ్బావధాన్లు తేలిగ్గా ”అలా చేస్తే భేషుగ్గా ఉంటుంది.  మీవాడి గురించి విన్నా. లక్షణమయిన కుర్రాడు. ఈ పెళ్ళికి  నాకేం అభ్యంతరం లేదు. అయితే అమ్మాయికో మాట చెప్పి ఉత్తరం రాస్తా” అన్నాడు. దాంతో నారాయణ చాలా ఆనంద పడిపోయి, యిక ఈ సంబంధం ఏదో ఖాయమైపోయిందనే భావించి వెనక్కి తిరిగొచ్చే శాడు. వస్తూనే యింట్లో అందరితో ”పెళ్ళి ఖాయమయ పోయినట్టే. ఉత్తరం వచ్చిన వెంటనే పనులు మొదలు పెట్టొచ్చు” అన్నాడు. యిక అక్కడ్నుంచి ఆ ఉత్తరం ఏదో వస్తుందని యింట్లో అంతా ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే రెండ్రోజులు కాదు కదా.. వారం.. నెలయినా ఆ ఉత్తరం రానేలేదు. దాంతో ఓ నెలాగి నారాయణ మళ్ళీ సుబ్బావధాన్లు యింటికి వెళ్ళాడు. సుబ్బావ ధాన్లు ఎప్పటిలాగే నారాయణని సాదరంగా ఆహ్వానించాడు. కొంత మాటలయ్యాక నారాయణ ”బావ.. గారూ.. మావాడి సంగతేం చేశారు? ఉత్తరం రాస్తానన్నారు. యింకా రాయలేదూ..” అన్నాడు. దాంతో సుబ్బావధాన్లు ”అదీ.. యింకా అమ్మాయి తేల్చలేదు. పెళ్ళంటే యిదిగో.. అదిగో అంటూ నానుస్తోంది. ఒప్పుకోగానే తెలియజేస్తాం” అన్నాడు. దాంతో నారాయణ శెలవు తీసుకుని వచ్చేశాడు.
——-
నెలలు గడుస్తున్నాయి. సుబ్బావధాన్ల నుంచి ఎలాంటి ఉత్తరం అయితే రాలేదు గానీ నారాయణ మాత్రం వాళ్ళింటికి వెళ్ళొస్తూనే ఉన్నాడు. ‘మావాడి సంగతేంటీ?’ అని అడుగుతూనే ఉన్నాడు. సుబ్బావధాన్లు ఏదో చెబుతూనే ఉన్నాడు.  ఓసారి పెళ్ళి వద్దం టుందనీ, యింకోసారి చదువుకుంటానంటుందనీ ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు. అలా 39సార్లు తిరిగింతర్వాత యిక నారా యణ అయితే విసిగిపోయాడు. దాంతో వెంకటేశంతో ”రేయ్‌.. యింక ఆ సంబంధం గురించి మర్చిపో. ఆ సంబంధం కుదరదు” అంటూ తేల్చి చెప్పేశాడు. యిదేదో వెంకటేశానికి బోల్డంత నిరాశ మిగిల్చినా తన పట్టువిడవలేదు. గిరీశం దగ్గరకెళ్ళి విషయమంతా చెప్పాడు. దాంతో గిరీశం ”మరేం కంగారుపడకోయ్‌.. నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషనోయ్‌.. వాళ్ళనెలాగయినా ఒప్పించే పూచీ నాది” అంటూ రంగంలోకి దిగాడు. యిక ఆరోజు నుంచీ సుబ్బావధాన్లు  యింటి చుట్టూ తిరగడం గిరీశంవంతయింది. గిరీశం వెళ్ళినప్పుడల్లా  సుబ్బావధాన్లు అయితే ఏదో చెబుతూనే ఉన్నాడు.  యిలా కొన్ని నెలలు గడిచాయి. ఆరోజు గిరీశం సుబ్బావధాన్ల  గారింటికెళ్ళినప్పుడు ఓ విశేషం జరిగింది. ఆపాటికి వాళ్ళింట్లో ఏదో హడా విడిగా ఉంది. గిరీశం విశేషం ఏంటాని ఆలో చిస్తుండగా లోపల్నుంచి సుబ్బావ ధాన్లు వచ్చాడు. గిరీశం ఆత్రంగా ”మావాడి సంగతేంటీ?” అన్నాడు. ఈరోజు మా అమ్మాయి నిశ్చితార్థం”అంటూ కబురు చల్లగా చెప్పాడు. అయినా గిరీశం నిరాశ పడకుండా ”నిశ్చితార్థమా..! దాందే వుంది లెద్దురూ.. ఎన్ని సినిమాల్లో చూట్టం లేదూ..” నిశ్చితార్థం అయ్యాక కూడా ఎన్ని సంబంధాలు తప్పిపోవడంలేదూ.. మరేం ఫరవాలేదు. మావాడితో పెళ్ళి గురించి ఆలోచించండి” అంటూ బయటికి నడిచాడు. రెండు వారాలాగి గిరీశం మళ్ళీ ఆ యింటికి వెళ్ళాడు. ఆపాటికయితే యింకా ఎక్కువ హడావిడిగా ఉంది. యింటి ముందు పందిరేసి ఉంది. గిరీశాన్ని చూసి సుబ్బావధాన్లు  బయటి కొచ్చాడు. అయితే ఈసారేదో కొంత అసహనంగా కనిపించాడు. ”యిదిగో గిరీశం గారూ.. మా అమ్మాయికి  పెళ్ళి కూడా అయిపోతుంది. తెల్లారితే పెళ్ళి.. వేరే సంబంధం చూసుకొమ్మని మీవాడికి చెప్పండి” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”అ..మ్మ..మ్మ.. పెళ్ళి పీటల మీద కూడా ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎన్నిలేవని.. ఏదయినా జరగొచ్చు” అని ఎంతో ఆశాభావంతో శెలవిచ్చి బయటికొచ్చేశాడు. అయితే అలాంటిదేం జరక్కుండా ఆ పెళ్ళేదో జరిగిపోయింది. అయితే అక్కడితో గిరీశం రాకపోకలు ఆగలేదు. ఓ సంవత్సరం ఆగి గిరీశం మళ్ళీ వెళ్ళాడు. ఆపాటికి సుబ్బావధాన్లు గారిల్లు కళకళలాడి పోతోంది. లోపలేదో ముత్తయిదువుల హడావిడి కనిపిస్తోంది. యింతలో బయట కొచ్చిన సుబ్బావధాన్లు గిరీశం దగ్గరకొచ్చి ”చూడు నాయనా.. ఈరోజు  మా అమ్మాయికి సీమంతం చేస్తున్నాం. వచ్చే నెలలో డెల వరీ కూడా” అన్నాడు. దాంతో గిరీశం ”శుభం.. యిదేదో మహత్తరంగా ఉంది సుమండీ. కలిసొచ్చే టైమొస్తే నడిచొచ్చే  కొడుకు రావడం అంటే యిదే. మావాడు అదృష్ట వంతుడు. మీ అమ్మాయినీ, మనవడినీ కూడా మావాడు పువ్వుల్లో పెట్టి చూసు కుంటా డనుకోండి. ఆ దిశగా ఆలోచన చేయండి” అంటూ బయటికొచ్చే శాడు. వెనక నుంచి సుబ్బావధాన్లు  గట్టిగానే తిట్టుకోవడం వినిపిస్తోంది.
——-
”గురూగారూ.. రాత్రి యిలాంటి దిక్కుమాలిన కలొచ్చింది. ఛ..ఛ.. అయినా నా పరిస్థితి మరీ అంత తీసికట్టు నానంబొట్టుగా తయారయిపోతుందంటారా?” అంటూ అడిగాడు వెంకటేశం. దాంతో గిరీశం పెద్దగా నవ్వేసి ”నీకేంటోయ్‌. అమ్మాయిలు నీకోసం క్యూలో నిలబడి మరీ వస్తారు” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం సిగ్గుపడి ”మరి కలలో ఆ దేబిరింపులేంటి.. దరిద్రంగా” అన్నాడు. దాంతో గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”యిదంతా ‘మరి మా సంగతేంటీ’ అనే ముగిసిన అధ్యాయం కధలే. యింకా వివరంగా చెప్పాలంటే.. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా అంశం తెర మీదకొచ్చింది. అప్పట్లో బాబుగారు ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీ చుట్టూ ఓ పాతిక ముప్పైసార్లు తిరగడం జరిగింది. నిజానికి అప్పట్లో కేంద్రంతో బాబుకి మంచి సంబంధ బాంధవ్యాలున్నా వాళ్ళు ప్రత్యేక హోదా అయితే యిస్తామనలేదు. యివ్వడం కుదరదని తేల్చి చెప్పే శారు. తర్వాత కాలంలో బాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడం జరిగింది. ఈలోగా బాబు స్థానంలో జగన్‌ రావడం జరిగింది.  బీజేపీ వాళ్ళు ఎప్పటిలాగే ‘ప్రత్యేక హోదా అనేది ముగిసిన  అధ్యాయ మంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ యివ్వడం కుదరదు’ అని చెపుతూనే ఉన్నారు. అయినా జగన్‌ వీటున్నప్పుడల్లా ‘మా సంగతేం చేశారు? ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారు? అని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తు న్నాడు. అవతల మోడీ,  అమిత్‌షాలు ఎంత మొండివాళ్ళన్నది తెలీంది కాదు. తామేదన్నా అనుకుంటే యిక అంతే. ప్రత్యేక హోదా అనేది యివ్వడం కుదరదు. దానికి సరిసమానమయిన ఫలాలు యిస్తాం అని కొన్నాళ్ళు  ఇచ్చేశాం కదా’ అని కొన్నాళ్ళు చెపుతున్నారు. అంటే యిక ప్రత్యేక హోదా గురించి  మర్చిపోవచ్చు. యిలాంటి నేపథ్యంలో వాళ్ళిద్దరూ కశ్మీర్‌ విషయంగా అంత తలమునకలయి ఉంటే పట్టువదలని విక్రమార్కుడిలా జగన్‌ ఢిల్లీలో ‘మరి మా సంగతేంటీ?.. అని అడుగుతూనే ఉన్నాడు. ముగిసిన అధ్యాయంలాంటి ఆ అంశం పెళ్ళయిన అమ్మాయి కోసం యింకా  వెంపర్లాడడంలాంటిదే.  యిప్పటికయినా ఆ ప్రత్యేక హోదా అడగడం మానేసి, దానికి మించిన ఫలాలేవో సాధించుకోవడం మంచిది’ అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here