అనుకున్నది ఒకటి…అవుతున్నది ఇంకొకటి

0
997

ఆర్ధిక మాంద్యం వైపు దేశం అడుగులు?
నోట్ల రద్దులో అతిపెద్ద సైడ్ ఎఫెక్ట్
(శనివారం నవీనమ్)

ఆర్ధిక రంగంలో అత్యంత సురక్షితమైనదిగా వున్న భారత బ్యాంకింగ్ వ్యవస్ధ పట్ల పెద్దనోట్ల రద్దు , అనంతర పరిణామాల్లో ప్రజల విశ్వాసం దిగజారింది. ఇది విదేశీ పెట్టుబడిదారులను కలవరపరచే విషయం…ప్రధాని మోదీగారి ”మేక్ ఇన్ ఇండియాకు అవరోధం. మరోవైపు ప్రపంచ ఆర్ధిక రంగాన్ని నిర్దేశించే అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది…ఈ పరిణామాలన్నీ కలసి విదేశీపెట్టు బడులను ఉపసంహరించుకునేలా చేస్తున్నాయి…ఇప్పటికే దేశం నుంచి 200 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని స్టాక్ మార్కెట్ల అంచనా!

పెద్దనోట్లు రద్దు చేసిన 50 రోజుల్లో డబ్బు కంట్రోలుపై కేంద్రప్రభుత్వం, రిజర్వు బ్యాంకు 64 సార్లు రూల్స్ మార్చారు. జనాల్ని కష్టపెడుతున్న కేంద్రప్రభుత్వం ముందుచూపులేకుండా అత్యంత మౌలికమైన మార్పునకు తెగబడ్డారని పదేపదే రూల్స్ మారుస్తూండటానికి అర్ధం…జనాలు ఆర్ధిక సమస్యల్లో సతమతమౌతూండగా వారిని గట్టెకించే మార్గాలపై మోదీగారి ఆలోచనలు ఇంకా ప్రయోగాల దశలోనే వున్నాయని దీని అర్ధం.

ఆర్థిక సంక్షోభం పరిష్కారం కాని పక్షంలో 2017లో మనదేశం నుంచి భారీఎత్తున విదేశీ పెట్టుబడులు ఉపసంహరణ జరిగే ప్రమాదం ఉంది. నోట్ల రద్దుతో మెజారిటీ ప్రజలకు ప్రభుత్వం పట్ల, బ్యాంకింగ్‌ వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గింది. ప్రస్తుతం కొత్త రూ.2000 నోట్లను జారీ చేసినా, ప్రభుత్వం మళ్లీ దీనిని ఉపసంహరించవచ్చుననే భావన ప్రజల్లో తలెత్తింది.

డిమానిటైజేషన్‌తో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరెన్సీ రద్దు తిరోగమచర్య అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్య సేన్‌ పేర్కొనడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే జీడీపి వృద్ధి రేటు 2 శాతం తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.

దేశంలో ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరిన నల్ల డబ్బును నిర్వీర్యం చేసేందుకు, పన్ను ఎగవేత దారులను, దొంగనోట్ల చలా మణి దారులను దెబ్బతీసేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబరు 8 న ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రకటించారు.
అయితే నోట్ల రద్దు ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపో యింది. చలామణిలో ఉన్న రూ. 15.87లక్షల కోట్ల నోట్లలో 80 శాతం చెల్ల కుండా పోయాయి. ఆ ప్రకటన తరువాత కొత్త 500, 2000 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన వెలువడింది. పాత నోట్లు డిపాజిట్‌ చేసి, కొత్త నోట్లు తీసుకునేందుకు దేశ ప్రజలకు డిసెంబర్‌ 30 వర కూ గడువు ఇచ్చారు. రద్దయిన నోట్ల స్థానే ప్రజలందరికీ సరిపడా చిల్లర నోట్లు, కొత్త నోట్లు బ్యాంకులకు చేరకపోవడంతో జనం కటకటలాడుతున్నారు.

100 కోట్ల మందికి పైగా జనం కనీస అవసరాలకోసం చేతిలో చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు. కరెన్సీ సంక్షోభం కారణంగా లక్షలాది మంది రోజువారీ కూలీలు, ఉపాధి కూలీలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్‌ లావాదేవీలు, రియల్‌ ఎస్టేట్‌ నుంచి పలు రంగాలలో కార్యకలాపాలు స్తంభించి పోయాయి. దేశంలో 90 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. ఆ నగదే మాయం కావడంతో వ్యవసాయ మార్కెట్లు, ఫ్యాక్టరీ లలో ఉత్పత్తులు, రవాణా తో సహా పలు రంగాల్లో సంక్షోభం ఏర్పడింది. ఇదంతా ఆర్థిక మాంద్యం సూచనే!

నోట్ల రద్దుతో మెజారిటీ ప్రజలకు ప్రభుత్వం పట్ల, బ్యాంకింగ్‌ వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గింది. ప్రస్తుతం కొత్త రూ.2000 నోట్లను జారీ చేసినా, ప్రభుత్వం మళ్లీ దీనిని ఉపసంహరించవచ్చుననే భావన ప్రజల్లో తలెత్తింది. ఈ సారి 100 నోట్లను రద్దు చేస్తారని, బంగారంపై ఆంక్షలు విధిస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల సెంటిమెంటు మార్కెట్లను నడిపిస్తుంది.

ఇదే సమయంలో బినామీ ఆస్తులపై కొరడా ఝళిపిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించ డం విశేషం. ఆదాయపు పన్ను చట్టం సవరణ, లెక్కల్లో చూపని నల్లధనం పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తామన్న ప్రకటనలు ప్రజల్లో భయాందోళ నలను పెంచుతున్నాయి. ఇంతవరకూ భవిష్యత్‌ అవసరాలకు పొదుపు చేసు కునే లక్ష్యంతోనే సాగుతున్న జన జీవనం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ప్రస్తుతం తమకు వస్తున్న ఆదాయాన్ని ఎలా కాపాడుకోవాలా అనే స్థితిలో ప్రజ లు ఉన్నారు.

అంతర్జాతీయంగా అత్యధికంగా చమురు వినియోగించే దేశాల్లో భారత దేశం ఒకటి. మన చమురు వినియోగం పూర్తిగా విదేశాల నుంచి దిగుమ తులపైనే ఆధారపడి ఉంది. ఇటీవలి కాలంలో చమురు ధరలను నియంత్రించే ఒపెక్‌ దేశాలు చమురు ధరలను పెంచాయి. దీంతో మనదేశంలోనూ చమురు ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు మరింత పెద్ద మొత్తంలో చెల్లింపులు తప్పక పోవచ్చు. అంటే, విదేశీ మారక ద్రవ్యం మరింత తరలి పోతుంది.

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ప్రజల చేతుల్లో చిల్లర నోట్లు లేకపోవడం వల్ల కొనుగోలు సామర్థ్యం తగ్గింది. తమ వద్ద గల పెద్దనోట్లను డిపాజిట్‌ చేసిన తరువాత, బ్యాంకులవద్ద క్యూ లైన్లలో నిలిచి తెచ్చుకున్న అతి కొద్ది చిల్లర నోట్లను అత్యవసరాలకే వాడుకుంటున్నారు. విలాస వస్తువులు, అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లను జనం వాయిదా వేసుకుంటున్నారు. అటు ప్రజల చేతుల్లో, ఇటు బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో మార్కెట్‌లో డిమాండ్‌ తక్కు వగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశం ఆర్థిక మాంద్యం వైపు పోవడం ఖాయమే.

బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతున్న లక్షలకోట్ల డబ్బును ప్రభుత్వ రుణభారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉంది. అది సమంజసమే.

ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ తక్షణం కళ్లు తెర వాలి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలకు నడుం బిగించాలి. కరెన్సీ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా నివారించాలి. పన్ను ఎగవేత దారులను కనిపెట్టి పన్నులు వసూలు చేసేందుకు కఠినమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెండున్నర ఏళ్లుగా మోడీ సర్కార్‌ `మేక్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో విదేశీ పెట్టుబ డులను ఆకర్షించేందుకు యత్నించిందే తప్ప కనీసం పదో వంతు శ్రద్ధ కూడా దేశంలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చూపలేదు. దేశంలో బిజి నెస్‌ సంస్థలను, వ్యాపార వర్గాలలో విశ్వాసం పాదుకొలిపి ప్రోత్సహించాలి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపు ప్రభావం మనదేశంపై ఉండకుండా చూడాలి. నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల్లో భారీ ఎత్తున జమ అయిన మొత్తాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తే, తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది.

కానీ, ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగేదికాదు… ప్రజలు తేరుకోడానికి నెలలు…ఆర్ధిక రంగం ఉత్తేజితం కావడానికి సంవత్సరాలు పడుతుంది. ద్రవ్య చలామణి నుంచి వైదొలగిన 66 శాతం డబ్బు తిరిగి రొటేషన్ లోకి వచ్చేదాకా ఎకనామిక్ స్టిమ్యులేషన్ వుండదు…ఉపాధి అవకాశాలు పెరగవు…ప్రజల కొనుకోలు శక్తులు పతనమౌతాయి…అయితే పూర్తిగా 66 శాతం డబ్బునీ చెలామణిలోకి తెచ్చేది లేదని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు.