అనుకున్న దొక్కటి

0
297
అక్కడ వాతావరణం బరువుగా ఉంది. అలా గని అక్కడేవీ కొంపలంటుకుపోయేంత దారుణం జరిగిపోలేదు. అక్కడున్న యిద్దరూ ఎడాపెడా ఆలోచిస్తున్నారంతే. ఆ యిద్దరిలో ఒకరు కాబోయే కింగ్‌ననుకునే వెంకటేశం అయితే రెండోవారు అలాంటి కింగుల్ని తయారు చేసే గిరీశం. గిరీశం అయితే చుట్ట పొగలోంచి రింగులు రప్పిస్తూ మరీ ఆలోచించేస్తున్నాడు. యింకోపక్క వెంకటేశం కాలుగాలిన పిల్లిలా అటూయిటూ పచార్లు చేస్తున్నాడు. చాలాసేపు యిద్దరూ ఏం మాట్లాడుకోలేదు. యింతలో ఆ నిశ్శబ్ధాన్ని బద్దలు కొట్టడానికా అన్నట్టుగా వెంకటేశం ”ఏంటి గురూగారూ… ఏదో తెగ ఆలోచించేస్తున్నట్టు?” అన్నాడు. గిరీశం తలూపి ”ఆ…మన నాయకుల తీరు గురిం చిలే. నా సంగతి సరేగానీ… నువ్వలా ఉన్నావేం?” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఓ అదా… మొన్నోసారి రాజకీయాల్లో అర్జంటుగా ఎదిగి పోవాలంటే అంచెలంచెలుగా ఎదగడం కంటే అలక్షణంగా వెడితేనే తొందరగా ఎదగొచ్చని అనుకున్నాం కదా. దాని గురించే ఆలోచి స్తున్నా” అన్నాడు. దాంతో గిరీశం ”చదవేస్తే ఉన్న మతి పోయినట్టుం దోయ్‌ నీ తీరు. సలక్షణానికి  వ్యతిరేకం అలక్షణం కాదని విలక్షణ మని నా అనుమానం” అన్నాడు. దాంతో వెంకటేశం నాలుక్కరచు కుని.. ఏదో లెద్దురూ… మొత్తానికి ఏదో చెడు దారి అనుకోండి. అలా నెగెటివ్‌ దారిలో వెళ్ళినప్పుడే వెంటనే రిజల్ట్‌ రావచ్చు. అయితే అలాంటి ప్రయత్నంలో ఏదయినా తేడా జరిగితే పరిస్థితి ఏంటంట?” అన్నాడు. గిరీశం తలూపి ”యింకేముంది… ఉన్నది కూడా ఊడు తుంది అన్నట్టుగా అసలుకే  ఎసరు రావడం ఖాయం. సరే… ఈ వారం ప్రశ్నేదో దీని మీదే లాగించేద్దాం. యిదే విషయాన్ని కొంచెం వివరంగా చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం ఆలోచించి అప్పుడు చిన్న ఊహ లాంటిది చెప్పసాగాడు…
——-
గంగలకుర్రు… ప్రపంచానికి అంతగా తెలీని చాలా చిన్న ఊరు. ఎప్పుడూ ఆ ఊరి పేరు వార్తల్లోకి రాదు. ఒకే ఒక్క కారణంగా ఆ ఊరు కొద్దిపాటి ప్రాధాన్యత సంతరించుకుంది. మరేంలేదు… గిరీశం, వెంకటేశం ఆ ఊరివాళ్ళు కావడమే. అలాంటి తన ఊరంటే వెంకటేశానికి వల్ల మాలిన ప్రేమ. అందుకే వీలున్నప్పుడల్లా ఏ ఊళ్ళో ఉన్నా తన ఊరొచ్చి పడిపోతుంటాడు. ప్రస్తుతం కూడా అలాగే ఊరొచ్చి ఉన్నాడు. అయితే ఈసారి కొంచెం ఎక్కువరోజులు ఉండి పోయాడు. ఆరోజు పొద్దున్నయితే ఏదో ఆలోచన వచ్చినట్టుగా ఆ ఊరి సర్పంచ్‌ సత్తిబాబుని కలుసుకున్నాడు. వెంకటేశాన్ని చూడగానే సత్తిబాబు విశాలంగా నవ్వేసి ”ఏంటబ్బాయ్‌… ఈ మధ్య యిక్కడే ఎక్కువగా ఉంటున్నట్టున్నావ్‌…” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవు నండీ… ఎంతయినా మన ఊరు మన ఊరే కదా. ఏదో ఒకటి చేసి మన ఊరి పేరు దేశమంతా మార్మోగిపోయేలా చేయాలని ఉంది. ఎలా ఉంటుందంటారు?” అన్నాడు. దాంతో సత్తిబాబు మొహంలో ఆసక్తి ప్రవేశించింది. ”అయినా అది చాలా కష్టమబ్బాయ్‌… అలా మనూరి పేరు మార్మోగిపోవాలంటే మనూళ్ళో గొప్పోళ్ళెవరయినా పుట్టాలి కదా” అన్నాడు. దాంతో వెంకటేశం ”నేను పుట్టా కదా. అలా చూస్తుండండి. బ్రహ్మాండమయిన కార్యక్రమం ఒకటి చేసి ఊరి పేరుని ఎక్కడికో తీసుకుపోతా” అన్నాడు. దాంతో సత్తిబాబు చాలా ఆనందపడిపోయాడు. ”యిదిగో అబ్బాయ్‌… పనిలో పనిగా ఆ కార్యక్రమంలో నా పేరు యిరికించు. అసలే ఎలక్షన్లొస్తున్నాయి” అన్నాడు. వెంకటేశం తలూపి బయటికి నడిచాడు.
———
విజయదశమినాడు గంగలకుర్రులో బ్రహ్మాండమయిన కార్యక్రమం ఒకటి ఏర్పాటయింది. మామూలుగా అయితే ఆ కార్యక్రమానికి అంత ప్రాధాన్యత లేకపోవును. అయితే ఆ కార్యక్రమంలో చిన్న వెరయిటీ ఉంది. అది… ఊళ్ళో ఉన్న మైదానానికి రావణ లీలా మైదానం అని పేరు పెట్టేసి అక్కడ రావణాసురు డికి పూజలూ, యజ్ఞాలవీ జరిపించడం. అంతేనా… యింకా రావణా సురిడికి పాలాభిషేకం, సహస్ర దీపా లంకరణ చేయడం లాంటివి చేస్తు న్నారు. దాంతో సంచలనం మొదల యింది. అదీ కాక ఈ కార్య క్రమానికి సంబంధించిన వార్తేదో వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా దేశమంతా తెలిసిపోయింది. దాంతో కార్యక్రమం రోజు ఆసక్తి కొద్దీ వేలాదిగా జనాలు తరలివచ్చారు. యిక మీడియా సంగతి సరేసరి. ఓ పక్కన రావణుడిని దేవుడిలా భావిస్తూ పూజలవీ జరుగు తుంటే యింకో పక్క విలేఖర్లంతా వెంకటేశం చుట్టూ చేరి పోయారు.”అసలు మీరు యిలాంటి వినూత్న కార్య క్రమం తలపెట్టడానికి కారణం?” అంటూ ఎవరో అడిగారు. దానికి వెంకటేశం ”వేలాది సంవత్స రాలుగా నిమ్న జాతులకి జరుగుతున్న అన్యాయం గురించి బాధపడే యిదంతా  చేస్తున్నా.  ఈ అగ్రకులాల వాళ్ళ ఆధిపత్యం మొదట్నుంచీ యిలాగే ఉంది. వాళ్ళ దాష్టీకానికి ఈ నిమ్నజాతివాళ్ళు బలయిపోతూనే ఉన్నారు. అందుకు ఎంతో గొప్ప వాడయిన రావణాసురుడే సాక్ష్యం. కేవలం నిమ్నజాతి వాడవడం వలనే రావణుడిని అంత నీచంగా చిత్రించి తొక్కేశారు. అలాంటి మహాత్ముడికి న్యాయం జరగాలనే  యిదంతా” అన్నాడు. వెంకటేశం చెప్పిందాంతో అంతా మెస్మరైజ్‌ అయిపోయి రాసుకోసాగారు. సరిగ్గా అప్పుడు జరిగిందది. ఆ రిపోర్టర్లలో కొంచెం హుషారుగా ఉండే క్రాంతి లేచి నిలబడ్డాడు. ఎకాఎకిన వెంకటేశాన్ని తగులుకున్నాడు. ”మీరంటున్నట్టు రావణుడు నిమ్నజాతివాడు కాదు. అగ్రకులానికి చెందిన బ్రాహ్మణ కులస్థుడు. నిజానికి రాముడే అతని కన్నా కాస్త తక్కువ కులానికి చెందిన క్షత్రియుడు. పోనీ శాస్త్రాల్లో చెప్పబడినట్టు పుట్టుకని బట్టి కాకుండా గుణగణాలని బట్టి కులం నిర్ణయించబడు తుందనుకున్నా రావణుడు అధముడి కిందే లెక్క. మరి అలాంటివాడికి ఈ పూజలవీ చేయడంలో అర్థమే లేదు” అన్నాడు. క్రాంతి చెప్పిందాంతో అక్కడ పెద్ద సంచలనమే రేగింది. వెంకటేశం అయితే కిక్కురుమంటే ఒట్టు. ఈలోగా విషయమంతా బుర్రలోకెక్కిన జనాలంతా పోయి రావణుడి విగ్రహం అంటించేశారు. యింకా యజ్ఞమదీ నాశనం చేసేశారు. యిక మర్నాడు ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. గంగలకుర్రులో రావణాసురుడి మీద బ్రహ్మాండంగా మొద లెట్టిన కార్యక్రమం రసాభాసగా ముగిసిందన్నది ఆ వార్త. జరిగిం దాంతో ఊరి పరువుపోయిందని అంతా తలలు పట్టుకున్నారు.
———
”అది గురూగారూ… చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. గిరీశం తలూపి ఊహ బాగానే ఉంది గానీ అదేదో కొంచెం వర్తమానంలో జరిగే వాటితో అన్వయించి చెపితే బాగుంటుంది” అన్నాడు. దాంతో వెంకటేశం ”అలా అయితే ముందుగా చెప్పుకోవలసింది కేజ్రీవాల్‌, రాహుల్‌ల వ్యవహారం. సర్జికల్‌ దాడుల తర్వాత ఆ యిద్దరూ మోడీని మెచ్చుకోవడంతో వాళ్ళు మారారనీ, కీలక సమయంలో అధికార పక్షానికి బాసటగా నిలిచారనీ అంతా సంబరపడ్డారు. అయితే కుక్క తోక వంకర అన్నట్టుగా అనవసర రాద్ధాంతం చేసి మళ్ళీ తమ నైజం బయటపెట్టుకున్నారు. ‘అసలు ఆరోజు సర్జికల్‌ దాడి జరిగిందా.. జరిగితే ఆధారాలు చూపించండి’ అన్నది ఆ వాదన. వీళ్ళ స్టేట్‌మెంట్లు చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌కి ప్రాణం పోసినట్టయింది. ‘అసలు సర్జికల్‌ దాడి జరిగినట్టుగా ఆ దేశంలో ప్రతిపక్షాలే నమ్మడం లేదు. అసలు అదంతా అబద్ధమే’ అని చెప్పడం మొదలెట్టింది. అయినా కొన్ని విషయాలు దేశ భద్రత దృష్ట్యా బయటపెట్టడం కుద రదు. యిదేదో కొంచెం మోటుగా చెప్పాలంటే… పెళ్ళి జరిగిందానికి  ఆధారాలు ఏవో అంటే ఫొటోలూ, వీడియోలూ చూపించొచ్చు. అలాగే శోభనం జరిగిందానికి సాక్ష్యాలు చూపించమంటే ఎంత దరి ద్రంగా ఉంటుందని… యిదీ అంతే. ఏతావాతా చెప్పేదేంటంటే… ఒనిడా ప్రకటనలోలా నెగెటివ్‌ దారిలో రాజకీయాల్లో మైలేజ్‌ పెంచు కోవచ్చు. అయితే ఆ ఎంచుకున్న అంశాలేవో కొన్ని పరిమితులకి కట్టుబడి ఉండాలి. లేకపోతే అసలుకే  ఎసరొచ్చి రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌ల్లాగ విమర్శల పాలవడం ఖాయం” అంటూ ఆపాడు. అయితే గిరీశం ఏం మాట్లాడకుండా మౌనం వహించాడు. ‘మౌనం అర్థాంగీకారం కదా. అదే మా గురువుగారి మౌనం పూర్తి అంగీ కారమే. ఆ లెక్కన నేనీ వారం గట్టెక్కేసినట్టే’ అనుకుంటూ వెంకటేశం బయటికి నడిచాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి