అనుభవం ఉందని అధికారమిస్తే ఒరగబెట్టిందేమిటీ?

0
450
బిజెపితో వైసిపి  ఒప్పందం అన్నది దుష్ప్రచారం మాత్రమే
హోదా నినాదం బతికించింది జగన్‌ కాదా ? : మాజీ ఎమ్మెల్యే రౌతు
 రాజమహేంద్రవరం, జూలై 11 :  ‘ ఎంతో అనుభవం గల నాయకుడని చంద్రబాబుని నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే, ఇసుకు,మట్టి,మద్యం ఇలా అన్నింటా అవినీతి పెచ్చు మీరిపోయింది. పోలవరం లాంటి ప్రాజెక్టుల విషయంలో వారి బండారం తెల్సుస్తోంది. ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారు. అందుకే బిజెపితో జగన్‌ ఒప్పందం అంటూ పైనుంచి కింది స్థాయి వరకూ ప్రతి  తెలుగు దేశం నాయకుడూ దుష్ప్రచారం సాగిస్తున్నారు. నిన్నటిదాకా హోదా ఎందుకని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు హోదా వీరునిగా చిత్రించుకుంటున్నారు. నిజానికి ప్రత్యేక హోదా నినాదం బతికి ఉందంటే అందుకు జగన్‌ కారణం. అవినీతిని కప్పిపుచ్చుకోడానికి తెలుగుదేశం రకరకాల ఎత్తులు వేస్తూ, దుష్ప్రచారానికి దిగుతోంది. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు” అని వైస్సార్‌ కాంగ్రెస్‌ సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం కార్పొరేటర్లు బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, నాయకులు పోలు కిరణ్‌ కుమార్‌ రెడ్డి,మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్‌,మార్తి లక్ష్మి,పెంకే సురేష్‌, వంకాయల సత్తిబాబు, వేగుళ్ల నాని, కుక్క తాతబ్బాయి, మైనార్టీ నాయకులు రబ్బానీ, బాషా, ఆసిన్‌,తదితరులతో కల్సి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లూ బిజెపితో అంటకాగి,తీరా అవినీతీ గురించి ప్రశ్నించేసరికి బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజల ద ష్టిని మరల్చడానికి జగన్‌, బిజెపి కుమ్మక్కయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని రౌతు విమర్శించారు. టిడిపి వాళ్లకు ఈ మధ్య జగన్‌ , బిజెపి కుమ్మక్కు అనే పదం ఊతపదంగా మారిపోయిందన్నారు. బిజెపితో కల్సి  నాలుగేళ్లు అధికారం పంచుకున్న టిడిపి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక  హోదా సాధించకుండా, దీని కోసం పోరాడేవాళ్ళను అరెస్టు చేసి, కేసులు పెట్టి , హోదా సంజీవిని కాదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన పేర్కొంటూ ఇప్పుడు  హోదాా కోసం టిడిపియే పోరాటం చేస్తున్నట్లు ఆడుతున్న డ్రామా ప్రజలకు అర్ధం అయిందన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి విభజన చేయమని చెప్పిన చంద్రబాబు, ఆతర్వాత కాంగ్రెస్‌ మోసం చేసిందని చెప్పారని, ఇక  బిజెపి నుంచి తెగతెంపులు చేసుకున్నాక, మొన్న కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్బంగా రాహుల్‌ గాంధీతో కరచాలనం కోసం తాపత్రయ పడ్డారని రౌతు గుర్తుచేస్తూ ఇంతపచ్చి అవకాశం వాదం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
 టోపీలు మార్చే సంస్క తి …
ఎన్డీయేతో ఉండగా గుర్తుకు రాని ముస్లిం లు ఒక్కసారిగా చంద్రబాబుకి గుర్తుకొచ్చేశారని రౌతు ఎద్దేవా చేసారు. బిజెపితో బంధం తెగిన వెంటనే ముస్లిమ్స్‌తో టోపీలు పెట్టుకుని ఫోటోలు దిగారని, అయితే మంత్రి వర్గంలో మాత్రం ముస్లింకి ప్రాధ్యాన్యత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీగా ముస్లిం ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.  అలాగే  దళితులను ఇష్టం వచ్చినట్లు మంత్రులు సైతం  అవమానకరంగా మాట్లాడుతూ వచ్చారని, అయితే  ఒక్కసారిగా ప్రేమ పుట్టుకు వచ్చేసి, ఏదేదో చేస్తున్నట్లు చెబుతున్నారని, ఇక  క్రైస్తవులకు అది చేసాం ఇది చేస్తున్నాం అని చెబుతున్నారని ఆయన అన్నారు.
ఇప్పుడు కూడు గుర్తొచ్చిందా ?
ఎన్నికల ముందు అన్న క్యాంటీన్లు పెడతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎన్నికల ముందు క్యాంటీన్లు పెడుతున్నారని రౌతు పేర్కొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వచ్చి, ప్రతిమనిషికీ  కూడు, గూడు, గుడ్డ  ఉండాలని అమలు చేసి చూపించారని ఆయన పేర్కొంటూ, మరి కీలకమైన కూడు అంశం గడిచిన నాలుగేళ్లుగా గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు.  ఇప్పటివరకూ ఇళ్ళు నిర్మాణం చేయకుండా సడన్‌ గా 19లక్షల ఇళ్ళు కట్టేస్తామని చెప్పడం వింతగా ఉందన్నారు.
నాలుగేళ్లలో నగరానికి ఏం చేసారు …
అది తెచ్చాం, ఇది తెచ్చాం, కోట్లు వచ్చేస్తున్నాయి అంటూ పోటీపడి మరీ నగరంలో టిడిపి నేతలు చెబుతున్నారని అయితే గతంలో మంజూరైన పనులు తప్ప కొత్తగా ఏమి చేసారని, అసలు ఈ నాలుగేళ్లలో నగరానికి వారు ఏం చేసారని రౌతు ప్రశ్నించారు. క్రైస్తవుల స్మశాన వాటికకు సంబంధించి మంజూరు చేస్తూ  గతంలో జీవో వచ్చిందని, అలాగే హాస్టల్స్‌ వంటివి కూడా గతంలో మంజూరయినవేనని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here