అన్నదాతకు అండగా..

0
113
కాకినాడలో జనసేన సారథి పవన్‌ దీక్ష
కాకినాడ, డిసెంబర్‌ 12 : రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ కాకినాడలో దీక్ష చేపట్టారు. ‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరుతో జేఎన్‌టీయూ ఎరుదుగా చేపట్టిన ఈ దీక్షకు పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుంది. రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయాలని పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. గురువారం ఉదయం 8.05నిముషాలకు ఆయన దీక్షా శిబిరానికి చేరుకున్నారు. మహిళలు ఆయనకు పూలమాలలు వేసి దీక్షలో కూర్చోబెట్టారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పెద్దఎత్తున జనసైనికులు, రైతులు దీక్షా శిబిరం వద్దకు తరలివచ్చారు. నియోజకవర్గాల వారీగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పి మోసం చేసిందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. స్వర్ణ బియ్యాన్నే మర పట్టించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారని, ఈ విషయంలో జగన్మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు వచ్చి ఇక్కడ వారు పడుతున్న బాధలను వివరించారు. రైతు పండించిన ధాన్యానికి లాభసాటి ధర కావాలని, గిట్టుబాటు ధర కాదని పవన్‌ కళ్యాణ్‌ ముందు ప్రస్తావించారు. పెట్టుబడులు పెట్టలేక అప్పులు తీసుకుని తక్కువ మొత్తానికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తేమ ఇతర కారణాలతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య సంపద, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తులు, తదితర రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉన్నా వ్యవసాయ రంగానికి వచ్చే సరికి పరిస్థితి దయనీయంగా మారుతుందని, రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపరిస్తుందని పలువురు పవన్‌కళ్యాణ్‌ ముందు సమస్యలను ఏకరువు పెట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ రైతులకు లాభసాటి ధర దక్కే వరకు జనసేన తరపున పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి పూర్తి మొత్తంలో నగదు వెంటనే చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు నాగబాబు, జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, పంతం నానాజీ, వేగుళ్ళ లీలాకృష్ణ, తుమ్మల బాబు, పి.సూర్యచంద్ర, శెట్టిబత్తుల రాజబాబు, డిఎంఆర్‌ శేఖర్‌, పితాని బాలకృష్ణ, మాకిరెడ్డి శేషుకుమారి, మాజీ మేయర్‌ సరోజ, కె.విజయగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here