అప్రమత్తంగానే ఉన్నాం…ఆందోళన వద్దు

0
432
గోదావరి వరద నిలకడగా ఉన్నా మళ్ళీ పెరిగే అవకాశాలు
జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలు : కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
రాజమహేంద్రవరం ఆగస్టు 18 : గోదావరి వరద ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో కొనసాగుతుండగా  ప్రస్తుతానికి నిలకడగా ఉందని, ఎగువన వరద శాంతిస్తుండటంతో ఇక్కడ కూడా క్రమేణా తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు.  అయితే గోదావరి ఉప నది శబరి బేసిన్‌లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ వరద మళ్ళీ పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆయన చెప్పారు. వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని, గోదావరి గట్ల పటిష్టతపై ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని ఆయన అన్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ వరద పరిస్థితి దృష్ట్యా హై అలర్ట్‌ ప్రకటించి సంబంధిత ప్రభుత్వ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. మూడేళ్ళ తర్వాత గోదావరి వరద ప్రమాద హెచ్చరికల జారీ స్థాయిలో ప్రవహిస్తోందని, ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 14.6 అడుగుల మేర కొనసాగుతోందని, అయితే ఎగువన స్వల్పంగా తగ్గుతున్నందున ఇక్కడ కూడా ఆ ప్రభావం కనిపించవచ్చని, శబరి నది పరివాహాక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున వరద పూర్తిగా తగ్గడానికి సమయం పట్టవచ్చని, ఈ దృష్ట్యా గోదావరి సాధారణ స్థాయికి చేరుకునే వరకు సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. వరదల కారణంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో ఒకటి, రంపచోడవరం డివిజన్‌లో రెండు, ఎటపాక డివిజన్‌లో 17 గ్రామాలకు వరద ముంపు ఏర్పడిందని కలెక్టర్‌ తెలిపారు. విలీన మండలాల్లో సహాయ చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. వరదల కారణంగా నిరాశ్రయులైన వారి కోసం జిల్లా వ్యాప్తంగా ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ శిబిరాల్లో 832 కుటుంబాలు ఆశ్రయం పొందుతున్నాయని ఆయన చెప్పారు. రాజమహేంద్రవరంలో పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రం, ఆల్కట్‌ గార్డెన్స్‌ ప్రాంతాల్లో లంక ప్రాంతాల వారి కోసం రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులకు ఆహార పొట్లాలను, మంచినీరు అందజేస్తున్నామని, గుడ్డు, అవసరమైన మందులు  కూడా సరఫరా చేస్తున్నామన్నారు. వరద దృష్ట్యా గోదావరి జలాలు బురదగా ఉన్నందున క్లోరినేషన్‌ పూర్తి స్థాయిలో చేపట్టి తాగునీటిని పరిశుభ్రంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామని ఒక ప్రశ్నకు సమాధానంగా కలెక్టర్‌ చెప్పారు. విలేకరుల సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, నగర పాలక సంస్థ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షిమోషి వాజ్‌పాయ్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ నగరంలోని ఆల్కట్‌తోటలో సహాయ కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here