అభివృద్ధి పనుల్లో ముమ్మర భాగస్వామ్యం

0
309

రూ. 1.08 కోట్ల ఖర్చుకు గుడా పాలకవర్గం తీర్మానం

పరిధి విస్తృతికి ప్రభుత్వానికి ప్రతిపాదన-భూసేకరణ చేపట్టాలని నిర్ణయం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 17 : గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) ద్వారా జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని పాలకవర్గం నిర్ణయించింది. సంస్థాపరమైన కార్యకలాపాలకే పరిమితం కాకుండా తన పరిధిలోని పట్టణాలు, గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే దిశలో గుడా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే కాకినాడలోని సర్పవరం జంక్షన్‌ నుంచి అచ్చంపేట కూడలి వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు రూ. 1.20 కోట్లను కేటాయించిన గుడా జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులకు కోటి ఎనిమిది లక్షల రూపాయిలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు కాకినాడలో చైర్మన్‌ గన్ని కృష్ణ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. రాజమహేంద్రవరం ప్రజలకు ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచి ప్రస్తుతం కళావిహీనంగా మారిన కంబాలచెరువు ఉద్యానవనానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జరుగుతున్న అభివృద్ధి పనుల్లో గుడా భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది.అందులో భాగంగా పార్కులో చెరువు చుట్టూ సిమెంట్‌ రైలింగ్‌ స్ధానే స్టీల్‌ రైలింగ్‌ ఏర్పాటుకు అవసరమైన రూ.50 లక్షలను మంజూరు చేయాలని నిర్ణయించింది. సామర్లకోట రైల్వే స్టేషన్‌ సమీపంలో రౌండ్‌ క్లాక్‌ సర్కిల్‌ను అభివృద్ధి చేసేందుకు రూ. 15 లక్షలు, పెద్దాపురంలో పైలాన్‌, రౌండ్‌ సర్కిల్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలని తీర్మానించారు. పిఠాపురంలో పాదగయ సెంటర్‌లో ముఖ ద్వార నిర్మాణానికి రూ. 20 లక్షలు, కాకినాడలో డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియంలో వాకింగ్‌ ట్రాక్‌కు లైటింగ్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.3.50 లక్షలు కేటాయించాలని తీర్మానించారు. లయన్స్‌ క్లబ్‌ ఎలైట్‌తో కలిసి అచ్చంపేట సెంటర్‌లో బస్‌ షెల్టర్‌ నిర్మించాలని,అందుకయ్యే వ్యయం రూ. 8 లక్షల్లో చెరి సగం భరించాలని తీర్మానించారు. అలా షెల్టర్లు ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే సగం వ్యయం భరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గుడా ద్వారా కాకినాడలో ఒక ముఖ్యమైన సెంటర్‌లో ప్రీ వైఫై హాట్‌ స్పాట్‌ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. సర్పవరం నుంచి అచ్చంపేట కూడలి వరకు గుడా ఆధ్వర్యంలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నందున అచ్చంపేట కూడలికి గుడా సర్కిల్‌గా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిర్ణయించారు. విశాఖ-కాకినాడ పెట్రో కారిడర్‌ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలు ఉడా పరిధిలో ఉన్నాయని, వాటిని గుడా పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ తీర్మానించారు. తమ పరిధిలో ప్రస్తుతం 2,183 చదరపు కిలోమీటర్లు ఉండగా అదనంగా 884 చదరపు కిలోమీటర్లను కలిపి మరో 123 గ్రామాలను గుడా పరిధిలోకి తీసుకొచ్చేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. గుడా ద్వారా భూ సేకరణ చేసి అభివృద్ధి కార్యక్రమాలను తలపెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గుడా డైరక్టర్లు గట్టి సత్యనారాయణ, ఎలిశెట్టి నాని, పిల్లి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌, గుడా సెక్రటరీ సాయిబాబా, జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌.ఇ. సత్యనారాయణరెడ్డి, జిల్లా టూరిజం శాఖ, జిల్లా పంచాయితీరాజ్‌ శాఖ, పరిశ్రమల శాఖల అధికారులతో పాటు అసిిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here