అభ్యర్ధించడానికి వెళితే అరదండాలా?

0
134
నేతల కోసం వెళ్ళిన తెదేపా శ్రేణులను అరెస్ట్‌ చేసిన పోలీసులు
రాజమహేంద్రవరం, జనవరి 21 : అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాజమహేంద్రవరం అర్బన్‌లో  మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా ప్రథమ చైర్మన్‌ గన్ని కృష్ణ, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడులను గృహ నిర్బంధం చేసి 24 గంటలు దాటిందని, వారిని తక్షణమే గృహ నిర్బంధం నుంచి విముక్తి కలిగించాలని  కోరుతూ అర్బన్‌ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్‌ చేసి ప్రకాశంనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించడం నగరంలో చర్చనీయాంశమైంది. పెద్ద వయసు కలిగిన నాయకులను గృహ నిర్బంధం చేయడం సరికాదని కోరుతూ అర్బన్‌ ఎస్పీ కార్యాలయానికి ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌  కాశి నవీన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు, చాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బిసి నాయకులు రెడ్డి రాజు, ఉప్పులూరి జానకిరామయ్య, విశ్వనాథరాజు, బుడ్డిగ రవి, పాలిక దుర్గా శ్యామ్‌, వై.సత్యనారాయణ తదితరులు వెళ్ళారు. తమ నాయకులను గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. అయితే పోలీసులు మాత్రం ఎస్పీ కార్యాలయానికి వెళ్ళిన నాయకులను అక్కడ నుంచి ప్రకాశంనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జరిగిన ఈ సంఘటనపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళిన నాయకులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించడం దుర్మార్గపు చర్య అని యర్రా వేణుగోపాలరాయుడు ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో ప్రభుత్వానికి పోలీసులు ఈ విధంగా సహకరించడం సరికాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here