అమరవీరుల త్యాగాలను స్మరించాలి

0
135
ఆస్రా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న ‘ఐ స్టాండ్‌ ఫర్‌ ది నేషన్‌’
పోస్టర్‌ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్న జవాన్ల సేవలను ఎన్నడూ మరువకూడదని, గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడులో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ ఆస్రా ఆధ్వర్యంలో  వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3:15 గంటలకు దేశ వ్యాప్తంగా ‘ ఐ స్టాండ్‌ ఫర్‌ ది నేషన్‌’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కోరారు. ఆస్రా సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆ సంస్థ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమ బలభద్ర ఆధ్వర్యంలో ఆకుల సత్యనారాయణ తన నివాసం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3:15 గంటలకు భారతీయులు ఎక్కడున్నా ఆ సమయానికి నిలబడి జాతీయ గీతం ఆలపించి అమరవీరుల త్యాగాలను స్మరించాలని కోరారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న ఆస్రా సంస్థ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబాలను విడిచి దేశ సరిహద్దులో కాపలా కాస్తున్న భారత సైనికులకు భరోసా కల్పించాలన్నారు. మరో ముఖ్య అతిధి చాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు మాట్లాడుతూ అమరవీరుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం భారతీయుల కర్తవ్యమని అన్నారు. దేశ సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టి జవాన్లు కాపలా కాయడం వలనే అందరూ సంతోషంగా ఉండగలుగుతున్నామని అన్నారు. ఆస్రా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్రా కార్యదర్శి రావినూతల వాసు, రామలింగారెడ్డి, నగేష్‌ బలభద్ర,ఈశ్వరాచారి, రాజారెడ్డి, గొల్లపూడి వాసు,వీరాజీ,ఈశ్వరరావు, మహిళా సభ్యులు వాసవి, అన్నపూర్ణ, వాసవి చైతన్య పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here