అమరావతిపై మీ వైఖరేంటీ ?

0
330

రాజకీయ ప్రయోజనాలే గాని మీకు రాష్ట్రం పట్టదా?

చంద్రబాబును బలహీనపరిస్తే రాష్ట్రానికే నష్టం

బిజెపి-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ల మ్యాచ్‌ ఫిక్సింగ్‌ బయటపడుతోంది

మేక గెడ్డమెందుకు తీసెయ్యండి : గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ధ్వజం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 3 : నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌, జనసేన పార్టీల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు, గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి నడిబొడ్డున అన్ని హంగులతో ప్రపంచంలోనే అత్యుత్తమ, అత్యాధునిక రాజధానిగా అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్ళు శ్రమిస్తుంటే సహకరించవలసిన ప్రతిపక్ష పార్టీలు ఒక విధానం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష పార్టీలు తలక్రిందులుగా తపస్సు చేసినా, ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, బ్రహ్మాండం బద్ధలైనా 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబునాయుడే తిరిగి అధికారంలోకి వస్తారని, అయితే అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌, జనసేన పార్టీల్లో ఎవరైనా పొరపాటున అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని నిర్మాణంపై తమ విధానాన్ని ప్రజలకు బహిర్గత పర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్ని కృష్ణ మాట్లాడుతూ 2014లో నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు విధాన పరమైన నిర్ణయాల్లో, అమరావతి ల్యాండ్‌ ఫూలింగ్‌లో ఆనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక భాగస్వామిగా ఉన్న ఐవైఆర్‌ కృష్ణారావు సీనియారిటీని గుర్తించి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించడమే గాక ఆ తర్వాత పదవీ విరమణ చేశాక ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమిస్తే ఆయన ధిక్కారణ ధోరణితో వ్యవహరించి ఇప్పుడు అమరావతి ఎవరి కోసం అంటూ ఓ పుస్తకం రాయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అటువంటి కృష్ణారావుకు రాజమహేంద్రవరం మేథావితో సహ పలువురు ఒత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. అమెరికా వంటి అగ్ర దేశ వాసులను సైతం ఆశ్చర్యచకితుల్ని చేసేలా ప్రజా రాజధాని నిర్మాణానికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్‌ ఫూలింగ్‌ ద్వారా 33 వేల ఎకరాల భూసేకరణ చేయడం, రాజధాని నిర్మాణ దిశగా మౌలిక వసతుల కల్పన, నిర్మాణ ఆకృతుల ఖరారు వంటి చర్యలతో వడివడిగా అడుగులు పడుతుంటే ఓ పార్టీ నాయకుడు నది తీరాన రాజధాని ఏమిటని ప్రశ్నిస్తుండగా, రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే బలవంతంగా లాక్కున్నారనడంతో పాటు రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరమా? అని ప్రశ్నించడం చూస్తుంటే రాజధాని నిర్మాణంపై వీరికి ఓ స్పష్టత, అవగాహన లేదన్న విషయం అర్ధమవుతోందని, దీనిపై వారు తమ వైఖరిని స్పష్టం చేయాలని గన్ని డిమాండ్‌ చేశారు. అసత్య ఆరోపణలు, అరకొర కేటాయింపులతో గత నాలుగేళ్ళుగా నమ్మించి మోసం చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తుందన్న నమ్మకం ఎలాగూ లేదని, చంద్రబాబుపై యుద్ధం చేస్తూ రాజకీయ, స్వ ప్రయోజనాలే గాని రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీయడం లేదని, ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం లేనప్పుడు బాండ్ల ద్వారా నిధులు సమీకరించి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని గన్ని అన్నారు. ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతించడమే గాక ఎమ్మెల్సీ రామ సూర్యారావు వంటి నిష్పక్షపాతులు, నిరాడంబరులతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు తమ వంతుగా బాండ్ల కొనుగోలుకు ముందుకు రావడం హర్షణీయమని, ప్రతిపక్షాల వైఖరి చూస్తే రాజధాని నిర్మాణం జరగడం వారికి ఇష్టం లేదని అర్ధమవుతోందని ఆయన అన్నారు.

బాబుని బలహీనపరిస్తే ఏపీకే నష్టం

కష్టాల్లో ఉన్న ఏపీకి అత్యుత్తమ రాజధాని నిర్మించడంతో పాటు పోలవరం ప్రాజక్ట్‌ పూర్తికి, ఏపీని పరిశ్రమల, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కుటుంబ సౌఖ్యాన్ని కూడా వదులుకుని నిరంతర శ్రామికునిగా కష్టపడుతున్న చంద్రబాబుకు ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవలసిన తరుణంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను బలహీనపర్చాలని ప్రయత్నిస్తే అందువల్ల ఏపీకే ఎక్కువ నష్టమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గన్ని అన్నారు. మోసగాళ్ళను, మోసగారి మాటలను నమ్మి ప్రధాని మోడీకి మద్ధతుగా నిలిస్తే జాతి ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించారని, ఈ బిడ్డను జాగ్రత్తగా చూడాలని పెద్ద పెద్ద ‘ఎలక్షన్‌’ కబుర్లు చెప్పిన మోడీ ఇపుడు బిడ్డ ఉసురు కూడా తీసేలా వ్యవహరిస్తున్నారని గన్ని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాలుగేళ్ళగా మాట్లాడకుండా ఇప్పడు మాట్లాడితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు వేచి చూసే ధోరణిలో వ్యవహరించడంతో పాటు గళం విప్పితే వచ్చే నిధులు కూడా నిలిచిపోతాయని భావించడంతో పాటు ఆఖరి బడ్జెట్‌ కూడా చూసి ఏపీకి జరిగిన అన్యాయంపై పెదవి విప్పారని, అయితే మోడీ సర్కార్‌ ఇంత నమ్మక ద్రోహం చేస్తుందని భావించలేదని గన్ని అన్నారు.

ముసుగు క్రమేణా తొలగిపోతోంది…మ్యాచ్‌ ఫిక్సింగ్‌ బయటపడుతోంది

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, బిజెపి చీకటి మిత్రులు అనుకున్నామని, అయితే ఆ ముసుగు క్రమేణా తొలగిపోతోందని గన్ని వ్యాఖ్యానించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ 2 గా ఉండి ప్రతి శుక్రవారం జగన్‌తో పాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి పార్లమెంట్‌ ప్రాంగణంలో మోడీ కాళ్ళకు మొక్కడం, మీడియాకు, కెమెరాలకు దొరక్కుండా ప్రధాని కార్యాలయం చుట్టూ తిరగడం, నిత్యం చంద్రబాబును దుమ్మెత్తి పోసే జగన్‌తో పాటు విజయ్‌సాయిరెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధానమంత్రి మోడీని ఏనాడూ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం చూస్తే బిజెపి-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న విషయాన్ని బహిర్గతపరుస్తోందని గన్ని కృష్ణ వ్యాఖ్యానించారు. విజయ్‌సాయిరెడ్డి తానేదో సచ్ఛీలునిగా తనకు తాను అనుకుని నిత్యం కల్లు తాగిన కోతిలా గెంతులు వేస్తూ విజయ్‌మాల్యా వంటి ఆర్థిక నేరస్తులతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని, మాల్యాతో భేటీ అయ్యారంటూ ఇష్టానుసారం అసత్య ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. బిజెపి- వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య రహస్య ఒప్పందం లేకపోతే విజయ్‌సాయిరెడ్డి వంటి ఆర్థిక నేరస్తుడు పత్రికలకు, వీడియోలకు ముఖం చాటేసి దొంగచాటుగా దాక్కుంటూ నిత్యం ప్రధాని కార్యాలయం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. వీరి వైఖరి చూస్తే శత్రు పక్షాన్ని కాసుకోవచ్చు గాని నమ్మించి దగా చేసే మిత్రపక్షాన్ని కాసుకోవడం చాలా కష్టంగా ఉందన్న విషయం అర్ధమవుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై తమ ఎంపీలు రాజీనామా చేస్తారని, దీని కోసం ఎంతవరకైనా వెళతామంటూ జగన్‌ ఏడాదిగా కబుర్లు చెబుతూ వస్తున్నారని, పార్లమెంట్‌ సమావేశాల చివరిలో ఎంపీలు రాజీనామా చేస్తారని మరో డ్రామాకు తెరలేపి ఇప్పుడు రాజీనామాలు చేస్తామంటున్నారని, అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సమయంలో బిజెపి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఉన్న ఒప్పందం మేరకు రాజీనామాలు ఆమోదించకుండా కాలక్షేపం చేస్తూ డ్రామాలు ఆడి ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని సాకు చూపి ఉప ఎన్నికలకు వెళ్ళకుండా చూడాలన్నదే వారి ఒప్పందమని గన్ని వ్యాఖ్యానించారు. హోదాపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని గతంలో కోరిన వారు ఇప్పుడు అంతా అయిపోయాక అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ఏం లాభమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని గన్ని మండిపడ్డారు. అయినా ఓ వైపు కేంద్రంపై అవిశ్వాసం పెడతామంటూ మరో వైపు మోడీ కాళ్ళపై పడటమెందుకుని ఆయన ప్రశ్నించారు. మరో వైపు మోడీ సర్కార్‌పై విశ్వాసం లేదంటూ తీర్మానం డ్రామా ఆడుతూ మరో వైపు మోడీ వలనే హోదా సాధ్యమవుతుందని అనడం వీరి ద్వంద వైఖరికి, నాటకాలకు నిదర్శనమని గన్ని మండిపడ్డారు. అయినా రాజకీయ యోధుడు, దార్శనికుడు, పాలనా దక్షుడు చంద్రబాబు ముందు వీరి కుప్పిగంతులు హనుమంతుడి ముందు వేసినట్లుగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

బాబు పరిస్థితి ఇంట ఈగలమోత…బయట పల్లకిమోత

పోలవరం ప్రాజక్ట్‌ నిర్వాశితులకు న్యాయం జరగడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తుండగా ఇటీవల ప్రాజక్ట్‌ ప్రాంతంలో పర్యటించిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నిర్వాశితులకు నష్టపరిహారం అందజేస్తున్న ప్రక్రియ భేష్‌గా ఉందని అన్నారని, ఈ ఘనత వహించిన నేతలు ఆయనకు కూడా పార్టీ రంగు పులుముతారా అని గన్ని వ్యంగ్యంగా ప్రశ్నించారు. చివరకు చంద్రబాబు పరిస్థితి ఇంటిలో ఈగల మోత, బయట పల్లకి మోత అన్నట్లు ఉందని గన్ని వాపోయారు. ప్రతిపక్షాల వైఖరి చూస్తే రాజధాని, పోలవరం నిర్మాణం జరగడం వారికి ఇష్టం లేదన్న విషయం అర్ధమవుతోందన్నారు. పట్టిసీమపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్‌ తప్పు పట్టిందంటున్న రాజమహేంద్రవరం మేథావి పోలవరం పూర్తయ్యేవరకు గోదావరి డెల్టాను స్థిరీకరించడంతో పాటు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకోవడానికి పట్టిసీమ దోహదపడిందని, ఈ విషయాన్ని మాత్రం మరుగునపర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి ఎవరొస్తారు, ఎవరు ఉన్నారన్న విషయం ప్రధానం కాదని, అభివృద్ధి ముఖ్యమని, ఎవరొచ్చినా అభివృధ్ధి మాత్రం నిరంతరంగా సాగే ప్రక్రియని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని అడ్డుకోవద్దని, ఎన్నికలప్పుడే రాజకీయాలు అనే ధోరణిలో వ్యవహరించడం విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమని, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసుకుందాం అని ప్రతిపక్ష పార్టీలకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నానని గన్ని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోడీ ఉన్నప్పుడు కూడా కాగ్‌ ఆయన ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిందని, అయితే ప్రజా ప్రయోజనాల ప్రకారమే ఏ ప్రభుత్వమైనా పనులు చేస్తుందని ఈ విషయాన్ని ఆ మేథావితో పాటు నిత్యం గొంతు చించుకునే బిజెపి నేతలు గుర్తెరగాలన్నారు.

కర్ణాటకలో బిజెపికి బుద్ధి చెప్పండి

ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, సెంటిమెంట్లతో ఆకట్టుకుందామని చూస్తూ నమ్మించి ద్రోహం చేసే బిజెపిని త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఓటర్లు ఓడించాలని గన్ని కృష్ణ విజ్ఞప్తి చేశారు. అక్కడి తెలుగు వారు ఎలాగూ బిజెపికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. అసలు అబద్ధాలు చెప్పడమే బిజెపి నేతలందరికీ వెన్నతో పెట్టిన విద్య అని, గతంలో రాజమహేంద్రవరం వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా ఏపీకి అన్నీ శాంక్షన్లు చేస్తున్నామని చెప్పారని, అయితే వాటిలో కార్యరూపం దాల్చినవెన్నో చెప్పనేలేదని, అమిత్‌ షా గాలి కబుర్లు చూసి ఆ సమావేశానికి హాజరైన తనతో సహ ఎందరో మధ్యలోనే బయటకొచ్చేశారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏపీ పారిశ్రామిక ప్రగతి ముందడుగులో భాగంగా కియా మోటర్స్‌, అశోకా లేలాండ్‌ (బస్సు బాడీల తయారీ విభాగం) వంటి ఎన్నో పరిశ్రమల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని, అమరావతి ప్రాంతంతో పాటు, విశాఖలోనూ అనేక ఐటీ పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి అంతా అమరావతి చుట్టూనే కేంద్రీకృతమవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, అంటే రాజధాని ప్రాంతం అభివృద్ధి జరుగుతోందని పరోక్షంగా వారు అంగీకరించినట్టే కదా అని గన్ని వ్యాఖ్యానించారు.

ఉపయోగం లేని మేక గెడ్డమెందుకు తీసెయ్యండి…

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మద్ధతుతో గెలిచి నిత్యం చంద్రబాబుపై విషం కక్కే బిజెపి ఎమ్మెల్సీ ఒకరు ఎమ్మెల్సీ పదవి ఉపయోగం లేని మేక గెడ్డంలాంటిదని వ్యాఖ్యానించారని, ఉపయోగం లేదనుకున్నప్పుడు ఆ మేక గెడ్డం ఎందుకు తీసెయ్యెచ్చు కదా అని గన్ని వ్యంగ్యంగా అన్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా నిత్యం అవాకులు చవాకులు పేలుతూ చివరకు వ్యక్తిగతంగా మాట్లాడటం సంస్కారం కాదని, అలా మాట్లాడటం తమకు చేతనవునని, అయితే తమ నాయకుడు చంద్రబాబునాయుడు తమకు అటువంటి సంస్కారం నేర్పలేదని ఆయన అన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధులు పోటీ చేసినప్పుడు వారిని ఓడించామని ఆ పార్టీ నేత ఒకరు ఉత్తుత్తి ఆరోపణలు చేయడం సరికాదని, నిరూపించాలని గన్ని సవాలు చేశారు. ఇకనైనా బిజెపి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జనసేన పార్టీ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం, న్యాయం కోసం ఏకతాటిపైకి వచ్చి ఏపీ ప్రయోజనాల కోసం కలిసి రావాలని గన్ని పిలుపు ఇచ్చారు. త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని పరస్పరం నిందించుకోవడం ఆపి తెలుగు జాతి హక్కులు, ఆత్మ గౌరవం కోసం ఏపీలో అన్ని పార్టీలు సంఘటితంగా పోరాడేందుకు కలిసి రావాలని ఆయన అభ్యర్ధించారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, ద్వారా పార్వతి సుందరి, కోసూరి చండీప్రియ, కురగంటి ఈశ్వరి, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, పార్టీ 2 వ డివిజన్‌ అధ్యక్షులు పితాని కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here