అయోధ్య వివాదస్పద స్ధలం హిందువులదే

0
115
మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నయ స్థలం ఇవ్వాలి
కీలక తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ,నవంబర్‌ 9 : దశాబ్ధాల కాలం వివాదాలు, న్యాయస్ధానాల మధ్య నలిగిన అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీదు అంశంపై యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై కొంతకాలంగా నడుస్తున్న వాదోపవాదాలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేసిన అత్యున్నత న్యాయస్ధానం ఈరోజు వెలువరించిన తీర్పు ద్వారా అయోధ్యలో వివాదస్పద స్థలం హిందువులదేనని పేర్కొంటూ మసీదు నిర్మాణానికి ముస్లిమ్‌లకు ప్రత్యామ్నయ స్ధలం కేటాయించాలని ఆదేశించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గోగొయ్‌ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం  ఈ ఉదయం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. వివాదస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు క్లైమ్‌ను తిరస్కరించారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. దీనిపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ విషయంలో నిర్మోహి అఖాడా వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ప్రకారం నిర్ణయం తీసుకున్నామని ధర్మాసనం పేర్కొంది.  రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొంది. వివాదస్పద స్ధలంపై ఎవరూ హక్కులు కోరలేదని వివరించారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అక్కడే మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. వివాదస్పద స్థలాన్ని అలహాబాద్‌ హైకోర్టు ఐదు భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ 2.77 ఎకరాల వివాదస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించాలని పేర్కొంది. ఆ స్ధలంలో ఆలయం నిర్మించాలని స్పష్టం చేసింది. వివాదస్పద స్ధలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని, ఆ స్ధలాన్ని ట్రస్ట్‌ ఆధీనంలో ఉంచాలని ఆదేశించింది. ఆలయ నిర్మాణం,ట్రస్ట్‌ విధి విధానాదలపై కేంద్రం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అయిదుగురు న్యాయమూర్తులు కలిసి ఏకగ్రీవ తీర్పును వెలువరించడం ఈ కేసులో ఓ విశేషం. రాజకీయాలకు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని పేర్కొంటూ ఒక లౌకిక సంస్థగా కోర్టు భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలని, అలాగే అన్ని వర్గాల మధ్య సమతుల్యతను పాటిస్తూ అందరి విశ్వాసాలను పరిరక్షించాలని పేర్కొంది. మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో తెలియదని, రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని, దీనిపై పురావస్తు శాఖ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుత కట్టడంలోని నిర్మాణం ఇస్లామిక్‌ శైలిలో లేదని పురావస్తు శాఖ తెలిపిందని, మసీదు నిర్మాణానికి ముందే ఆ స్ధలంలో ఓ నిర్మాణం ఉందని, అయితే  మందిరాన్ని కూల్చివేశారన్న ఆధారాలు మాత్రం లేవని పురావస్తు శాఖ తన నివేదికలో పేర్కొందని ధర్మాసనం తెలిపింది. కోర్టు తీర్పు నేపథ్యంలో దేశమంతా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here