అరవై కోట్ల పండగ

0
279
మనస్సాక్షి  – 1119
వెంకటేశం ఓ పట్టాన ఎవరికీ అర్థం కాడు. అంతెం దుకూ.. పదేళ్ళ నుంచీ ఎడాపెడా పాఠాలు చెబు తున్న  గిరీశానికే అర్థమయి చావడు. ఎప్పుడూ తాబే లులా నెమ్మదిగానే ఉంటాడు. ఉన్నట్టుండి ఏదో నిర్ణయం తీసుకుంటాడు. అంతే.. అక్కడ్నుంచి లేడిపిల్లలా అంతా ఉరుకులూ పరగులే. ఆరోజూ అలాగే జరిగింది.. గిరీశం తీరిగ్గా టీవీ ముందు కూర్చుని చాగంటి వారి ప్రవచనాలేవో చూస్తున్నాడు. యింతలో ఆదరా బాదరాగా వెంకటేశం పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే ”గురూగారూ.. నేను తెలంగాణా పోతున్నా” అన్నాడు. దాంతో గిరీశం తల తప్పి ”దొంగలు పడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరిగినట్టుందోయ్‌ యవ్వారం.. రెండ్రోజుల్లో అక్కడ ఎలక్షన్లు. యిప్పుడెళ్ళి అక్కడేం పీకుతావంట?” అన్నాడు. దాంతో వెంకటేశం ”చాలా ఉంది గురూగారూ… జరగబోయే ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారనేది సర్వే చేసి కనిపెడతా” అన్నాడు. గిరీశం అర్థం కానట్టు ”ఆ… ఎలక్షన్ల యిన మూడ్రోజులకి ఎలాగా ఆ రిజల్ట్స్‌ ఏవో వచ్చేస్తాయి కదా.. యింక ఈ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఎందుకంట?” అన్నాడు. ఈలోగా వెంకటేశం కుర్చీలో సెటిలై ”ఎలక్షన్స్‌కీ, రిజల్ట్స్‌కీ మధ్య ఆ మూడు రోజులూ చాలా ముఖ్యమయినవి. ఎవరు గెలుస్తారనేది ముందే తెలుసుకోగలిగితే అక్కడ పోటీ చేస్తే అభ్యర్ధులకి చాలా ఉప యోగం” అన్నాడు. గిరీశం అర్థం కానట్టుగా ”అదేం ఉపయోగం? ఎలక్షన్లు అయిపోయాక చేసేదేముందని? ఏ రిజల్ట్‌ వచ్చినా చచ్చినట్టు ఒప్పుకోక తప్పదు కదా” అన్నాడు. దాంతో వెంకటేశం ”అవుననుకోండి.. దీని వలన ఆ పోటీ చేసే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అసలయితే నన్నిలా సర్వే చేసి పెట్టమన్నది యాదగిరి… నా ఫ్రెండు” అన్నాడు. గిరీశం యింకా అర్థంకానట్టుగా చూశాడు. దాంతో వెంకటేశం ”యాదగిరి ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. ఒకవేళ ఈ ఎలక్షన్లో తను గెలుస్తానని మా యాదగిరికి ముందే తెలిసిపోయిందనుకోండి. దాంతో యింకెవరినీ దరిదాపులకి రానివ్వడు. అలాక్కాకుండా తను ఓడిపోతున్నట్టు ఈ సర్వేలో తేలితే ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెడతాడు. ఈ తిట్లూ, కుతంత్రాలూ పక్కనపెట్టి ఆ గెలవబోతున్నవాడితో అంటకాగే ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. యింకా బెట్టింగుల గోలా ఉండొచ్చు” అంటూ వివరించాడు. దాంతో గిరీశం ”బావుందోయ్‌.. వెళ్ళు. వెళ్ళి ఆ సర్వే ఏదో చేసిపెట్టెయ్‌.. పర్మిషన్‌ యిచ్చేస్తున్నా” అన్నాడు. దాంతో వెంక టేశం ”నేనొచ్చింది మీ పర్మిషన్‌ కోసం కాదు. ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం అయిపోయింది. విషయం చెప్పిపోదామని వచ్చా” అంటూ లేచి చక్కాపోయాడు. గిరీశం మాత్రం ”ఛ..ఛ.. రోజులు మారి పోయాయి’ అని గొణుక్కుంటూ యింకో చుట్ట అంటించాడు.
——–
మర్నాటి పొద్దున్నకల్లా వెంకటేశం ఆదిలాబాద్‌ జిల్లాలో దిగి పోయాడు. వెంకటేశంతోపాటు వెంకటేశం సేన యింకో వందమంది కూడా అనుసరించారు. యింతకీ వెంకటేశం సేన అంటే ఎవరో కాదు. వెంకటేశం సొంతూళ్ళో బాగా చదువుకుని, యింకా ఉద్యోగం కోసం చూస్తున్న చురుకైన కుర్రాళ్ళు. వాళ్ళం దరితో కలిసి వెంకటేశం రంగంలోకి దిగాడు. నేరుగా తనకి సర్వే పని పురమాయించిన యాద గిరి పోటీ చేస్తున్న సంగిడి నియో జకవర్గానికి వెళ్ళాడు. ఆ నియో జకవర్గంలో మొత్తంగా వందకి అటూయిటూగా పోలింగ్‌ బూత్‌లు న్నాయి. తనసేనలో వంద మందికీ తలో బూత్‌నూ అప్పగించాడు. వాళ్ళ పనల్లా ఎలక్షన్లో ఓటింగ్‌ మొదలయినప్పట్నుంచీ ఉంటుంది.  యింతకీ వాళ్ళు చేసేది ఓటేసి బయటకొచ్చిన ప్రతి అయిదో ఓటరునీ నెమ్మదిగా మాటల్లోపెట్టి ఏ పార్టీకి  ఓటేసిందీ కనుక్కుని నోట్‌ చేసుకోవాలి. ఒకవేళ ఆ అయిదోవాడు చెప్పకపోతే ఆరోవాడిని అడగాలి. దీని వలన దాదాపుగా ఓటర్లందరి పల్స్‌ తెలిసిపోతుంది. ఆ కుర్రాళ్ళు కూడా తెలివయినోళ్ళూ, మాటకారులూ కావడంతో ఓటేసిన వాళ్ళ నుంచి జాగ్రత్తగా విషయం రాబట్టగలుగుతున్నారు. మొత్తానికి సాయంత్రం ఓటింగ్‌ పూర్తయ్యే సమయానికి ఆ వందమందీ తాము సంపాదించిన డేటాలన్నీ వెంకటేశానికి అందించారు. వెంకటేశం వాళ్ళకి తలో వెయ్యి రూపాయలూ, యింకా ఖర్చులికీ డబ్బులిచ్చి పంపించేశాడు. తర్వాత వాళ్ళందరి డేటాలూ దగ్గర పెట్టుకుని ఫైనల్‌ రిజల్ట్‌ తయారు చేశాడు.
——–
సుబ్రమణ్యానికయితే కడుపు మండిపోతోంది. యింతకీ సుబ్ర మణ్యం అంటే ఎవరో కాదు. ఎలక్షన్లో  పోటీ చేస్తున్న యాదగిరికి రైట్‌ హేండ్‌. ఎప్పట్నుంచో యాదగిరికి కావలసిన సలహాలవీ తనే యిస్తుంటాడు. అలాంటిది ఈసారి తన అభిప్రాయం కాదని ఎగ్జిట్‌పోల్‌ సర్వే కోసం ఎక్కడో గోదావరి జిల్లాల నుంచి ఎవడో వెంకటేశం అన్నవాడిని పిలిపించి ఆ సర్వే ఏదో బోల్డంత ఖర్చుపెట్టి  చేయించడం బొత్తిగా నచ్చలేదు. దాంతో ఓ నిర్ణయా నికి వచ్చాడు. ‘ఆ సర్వే ఏదో అంత హడావిడీ, ఖర్చూ లేకుండా తనే చేయించి చూపించాలి. అప్పటికి తన విలువేంటనేది తన బాస్‌కి తెలుస్తుంది’ అని ఆలోచించాడు. దాంతో అప్పటికప్పుడే తన పేటలో ఉండే పదిమంది బంటా జనాల్ని పిలిచాడు. అంతా వచ్చాక ”మీరంతా ఓ పని చేయాలి. ఈరోజు సాయంత్రం అయి దింటికల్లా ఎలక్షన్‌ అయిపో తుంది. ఆ తర్వాత మీరంతా మన నియోజక వర్గంలో తలో పదిళ్ళకీ వెళ్ళండి. వాళ్ళె వరికి ఓటేశారో జాగ్రత్తగా కూపీ లాగండి. మీ పదిమందికీ తలో అయిదు వందలూ యిస్తా” అన్నాడు. దాంతో అంతా తలూపి వెళ్ళిపోయారు. అంతేకాదు. ఆ సాయం త్రం పొద్దుపోయేసరికి అంతా తాము సంపాదించిన డేటాలు తెచ్చిచ్చే శారు. మొత్తానికి వాళ్ళంతా యిచ్చిన డేటాల్లో ఓ వందమంది ఓటర్లు చెప్పింది ఉన్నట్టయింది. దాంతో రిపోర్టు తయారుచేసి సుబ్రమణ్యం తన బాస్‌ యాదగిరి దగ్గరికి పట్టు కెళ్ళి యిచ్చాడు. అప్పటికే వెంకటేశం యిచ్చిన సర్వే రిపోర్టు కూడా యాదగిరి దగ్గరుంది. యాదగిరి ఆ రెండు సర్వే రిపోర్టులూ చూశాడు. ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. దానిక్కారణం రెండు రిపోర్టులూ పూర్తి రివర్స్‌లో ఉన్నాయి…! దాంతో యాదగిరి జుట్టు పీక్కున్నాడు.
——-
”అది గురూగారూ… నాకలాంటి కలొచ్చింది. యిదేదో ఒక నియో జకవర్గానికి సంబంధించిన వ్యవహారమే. అలాక్కాకుండా ఈ ఎగ్జిట్‌ పోల్‌ల సర్వే వ్యవహారమేదో మొత్తం రాష్ట్రమంతా చేయించి పారేస్తా. దాంతో ఈ పార్టీల నాయకుల దగ్గర గట్టిగా వసూలు చేయొచ్చు. ఏవంటారు?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం విసుక్కుని ”అసలు ఎవడి గొడవో నీకెందుకూ… ముందు నువ్వు రాజయ్యే దారి చూసుకోవోయ్‌” అన్నాడు. దాంతో వెంక టేశం యిబ్బందిపడి ”అయినా ఈ కలెందుకు వచ్చినట్టం టారు?” అన్నాడు. దాంతో గిరీశం ”ఏవుందోయ్‌… ఈ మధ్య ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ హడావిడి ఎక్కువయింది కదా. అదేదో నీ బుర్రలో దూరినట్టుందిలే. అయినా యిక్కడ ఓ విషయం గమనించు. యిన్ని సర్వేలూ ఒకేలా లేవు. తలో మాటా చెబుతున్నాయి” అన్నాడు. దాంతో వెంకటేశం ”అయితే ఈ సర్వేలు నమ్మ క్కర్లేదంటారా?” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”అలా అని కాదోయ్‌… అయినా చేసే సర్వే ఏదో అడ్డంగా ఊపి ”అలా అని కాదోయ్‌… అయినా చేసే సర్వే ఏదో నీ కలలో నువ్వు చేసినట్టుగా కొంచెం శాస్త్రీయంగా చేస్తే కరెక్ట్‌ రిజల్ట్స్‌ వస్తాయి. ఎలా అంటావా… కుండలో బియ్యం ఉడుకుతున్నప్పుడు ఆ మూలో మెతుకూ, ఈ మూలో మెతుకూ పరీక్షిస్తేనే అన్నమంతా ఉడికిందో లేదో తెలుస్తుంది. అంతేగానీ ఒక్కచోటే ముద్దలా మెతుకులు తీసి పరీక్షిస్తే మొత్తం అన్నం ఎంత స్థాయిలో ఉడికిందన్న దానికి సరయిన అంచనాకి రాలేకపోవచ్చు. ఈ ఓటర్ల విషయంలో కూడా ఓ గుంపులో అందర్నీ అడిగేసి చేతులు దులిపేసుకుంటే  అది సరయిన సర్వే కాదు. అందుకే సర్వేలు రకరకాలదారుల్లో  నడుస్తున్నాయి” అన్నాడు. వెంకటేశం తలూపి ”అయితే ఈ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు శుద్ధ అనవసర వ్యవహారం అంటారా?” అన్నాడు. ఈసారి గిరీశం కొంచెం గట్టిగానే ”అవునోయ్‌…అయినా పార్టీలకి ఈ సర్వేలు ఎందుకంట? బాగా చదివే కుర్రాడికి పరీక్షలో ఏ ప్రశ్నలిస్తారు? ఏ సెంటర్‌ పడుతుంది? పక్కన పడ్డ కుర్రాడు కాపీ కొట్టనిస్తాడా? లాంటి ఆలోచనలుండవు. శుభ్రంగా వెళ్ళి రాసొచ్చే స్తాడు. ఫలితం గురించి కూడా ఆందోళనపడడు. బ్రహ్మాండంగా పాసవు తాడు. అలాగే నిరంతరం ప్రజా శ్రేయస్సుకి పాటుపడే పార్టీకి ఈ సర్వేలతో పనేంటంట?” అన్నాడు. వెంకటేశానికి యిదేదో నిజమే అనిపించింది. దాంతో అవుననన్నట్టుగా తలూపాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here