అరవ మోడల్‌

0
329

మనస్సాక్షి – 1076

వెంకటేశానికి పెత్తనాలెక్కువ. అంటే మరేం లేదు. ఒక వ్యవహారంలో తిన్నగా ఉండకుండా కాలుగాలిన పిల్లిలా తిరుగు తూంటాడు. కొంచెంసేపయితే చది విన చదువుతో ఏదన్నా ఉద్యోగంలో చేరితే ఎలా ఉంటుందా అని ఆలో చిస్తాడు. యివన్నీ కాకుండా అప్పుడ ప్పుడూ సేవా దురదలొస్తుంటాయి. అంటే మరేంలేదు. ఈ సొసైటీకి ఏదో సర్వీస్‌ చేయాలని ముచ్చట పడటం. ప్రస్తుతం కూడా అలాంటి దురదేదో మొదలైంది. దాంతో ఏ రకంగా ఆ సర్వీసులేవయినా చేయాలా అని ఆలో చించడం మొదలెట్టాడు. ఆలోచన యితే వచ్చిందిగానీ ఏం చేయాలన్నదే తెగడంలేదు. దాంతో అదేదో అడగ డానికి తన ఫ్రెండ్‌ లాయర్‌ సుందర్రావు దగ్గరకెళ్ళాడు. మిత్రులిద్దరూ కొంచెంసేపు మాట్లాడుకున్నాక వెంకటేశం ”ప్రజలకి ఏదయినా సేవ చేద్దామనుకుంటున్నారా” అన్నాడు. దాంతో సుందర్రావు తేలిగ్గా ”దాన్దేవుందిరా… రేపే వచ్చి నా దగ్గర చేరిపో. బోల్డంత సేవ.. అదే.. హెల్ప్‌ చేసుకోవచ్చు” అన్నాడు. దాంతో వెంకటేశం విసుక్కుని ”కుళ్ళుజోకులెయ్యకురా. నేను చేద్దామనుకుంటుంది నీ సేవ కాదురా. మానవసేవరా” అన్నాడు. దాంతో సుందర్రావు గతుక్కుమని ”సరే… ఓ పని చెయ్యరా. ప్రతివారం నాతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌కి వస్తుండు. నేను ప్రతి బుధవారం వెళ్ళి అక్కడికేవయినా సమస్యలతో వచ్చేవాళ్ళకి కౌన్సిలింగ్‌ యిస్తుంటాను. డబ్బులు రాకపోయినా అదో శాటిస్‌ఫేక్షన్‌” అన్నాడు. యిదేదో వెంకటేశానికి మాబాగా నచ్చేసింది. అంతేకాదు. అప్పటికప్పుడే వెళ్ళి ఆ సెంటర్‌లో సర్వీస్‌ చేయడానికి తన పేరు నమోదు చేయించుకున్నాడు.

—–

తర్వాత వారం నుంచే వెంకటేశం ఆ సెంటర్‌కి వెళ్ళి సర్వీసులు చేసి వస్తున్నాడు. ఆ సమస్యలూ అవీ వింటుంటే చాలా ఆసక్తిగా ఉంది. ఎలాగూ చదువుకున్నోడూ, తెలివైనోడూ కావడంతో వెంకటేశం వాళ్ళతో సమస్య చర్చించి, పరిష్కారం చెప్పగలుగుతున్నాడు. అయితే ఆరోజు వెంకటేశానికి మింగుడుపడని సమస్యొకటి వచ్చిపడింది. అదో భార్యాభర్తల గొడవ. ఆ భార్యాభర్తల గురించి బాగా తెలిసిన గోపాల్‌ ముందుగా వచ్చి వెంకటేశాన్ని కలవడం జరిగింది. వెంకటేశం విషయమేంటన్నట్టుగా అడిగాడు. దాంతో గోపాల్‌ ”సుబ్బారావు, శ్యామల అని వైఫ్‌ అండ్‌ హజ్బెండ్‌. పెళ్ళయి నాలుగేళ్ళు దాటి పోయింది. చాలా బాగుండేవాళ్ళు.. ‘నా భార్య దేవత’ మా ఆయన బంగారం అని మురిసిపోయేది. ఏమయిందో తెలీదు. గత కొన్ని రోజులుగా పరిస్థితి మొత్తం మారిపోయింది. యిద్దరికీ ఒక్క క్షణం కూడా పడటంలేదు. దారుణంగా గొడవలు పడుతున్నారు” అంటూ వివరించాడు. దాంతో వెంకటేశం ”సరే.. వాళ్ళని పంపించండి. నేను మాట్లాడతా” అన్నాడు. ఆ తర్వాత యింకో అరగంటకి భార్యాభర్త లిద్దరూ వచ్చేశారు. యిద్దరి మొహాల్లో అసహనం తొంగి చూస్తోంది. ‘ఈ తొక్కలో మీటింగ్‌లేంటీ.. విడాకులిచ్చేస్తే పోతాంగా’ అన్న భావం యిద్దరిలో తొంగిచూస్తోంది. వెంకటేశం యిద్దరినీ కూర్చోబెట్టి సమ స్యేంటని అడిగాడు. ముందుగా శ్యామల చెప్పడం మొదలెట్టింది. ”నాకు ఆయనతో కలిసుండడం యిష్టంలేదు. ఆయన పద్ధతులవీ నాకు నచ్చడంలేదు. అసలు ఆయన ప్రవర్తన తలుచుకుంటేనే అసహ్యమేస్తోంది” అంది. వెంకటేశం తలూపి ”అదెందుకున్నది కొంచెం వివరంగా చెబుతారా?” అన్నాడు. ఈసారి శ్యామల కొంచెం ఆవేశంగా చెప్పడం మొదలెట్టింది. ”నెలకి ఆయనకొచ్చేది యాభైవేలు పైమాటే. అయితే యింటిఖర్చులకి యిచ్చేదెంతో తెలుసా? వింటే నవ్విపోతారు. ముష్టి అయిదువేలు. అంత తక్కువ డబ్బుతో నేను యిల్లెలా నడపా లంట? యింట్లో ఏం వండుకోవాలన్నా బొటాబొటీయే. అక్కడికీ నేను తిండి కట్టుకుని ఆయనకి యిష్టమయినవన్నీ వండిపెడుతుంటా! ఈ మధ్యే యింకో విషయం తెలిసింది. తనక్కావలసినవన్నీ ఆయన బయట హోటల్లో తినేస్తుంటాడని. యిక నా పుట్టిన్రోజుకయితే ఏదో తూతూ మంత్రంగా కానిచ్చేస్తారంతే. చిన్న బహుమతి కూడా ఉండదు. అదే వాళ్ళ ఫ్రెండ్‌ భార్యకయితే ఈయన అయిదువేల ఖరీదయిన బహు మతి యిచ్చినట్టు తెలిసింది. ఒక స్నేహితుడి కుటుంబానికిచ్చిన విలువ యింట్లో పెళ్ళానికి యివ్వడం తెలీని మనిషితో నేను కలిసుండలేను” అంది ఖచ్చితంగా. అప్పుడు వెంకటేశం ”మరి ఆయన బంగారంలాంటివాడని అప్పట్లో అనే వారంట” అన్నాడు. శ్యామల తలూపి ”అవును. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందని నా బాధ ఎవరికీ చెప్పుకో లేదు. యింకా తట్టుకునే శక్తి లేకే యిప్పుడు బయటపడుతున్నా” అంది. ఈసారి వెంకటేశం సుబ్బారావు వంక తిరిగి ”ఊ… మీరు చెప్పండి” అన్నాడు.సుబ్బారావు గొంతు సవరించుకుని ”నేనేం చేసినా ఆవిడకి నచ్చదు. ఎప్పుడూ అసంతృప్తితో సణు క్కోవడమే. యిక యింటికి నా తరపు బంధువు లెవరైనా వచ్చినా వాళ్ళకి వినపడేలాగ ‘ఎప్పుడు పోతారో ఏంటో అంటుంది. దాంతో నా తరపువాళ్ళు మా యింటికి రావడమే మానే శారు. యిక చేసే ఆ వంటలు కూడా రుచీపచీ లేకుండా ఉంటాయి. అందుకే బయట తినవలసి వస్తుంది” అన్నాడు. యిద్దరి వాదనలూ వింటుంటే వెంక టేశానికి మతిపోతోంది. ఎవరిది తప్పో, ఎవరిది రైటో చెప్పలేని పరిస్థితి దాంతో వాళ్ళకేం చెప్పాలా అని ఆలోచనలో పడ్డాడు.

—-

”అది గురూగారూ నాకొచ్చిన కల. ఏంటో కలంతా అసంపూర్తిగా మిగిలిపోయింది. అయినా యిలాంటి కలెందుకొచ్చినంటారు? రేపెప్పుడో పెళ్ళి చేసుకోవద్దని హెచ్చరికంటారా?” అన్నాడు వెంకటేశం. ఆపాటికి చుట్ట కాలుస్తున్న గిరీశం ”ఆ.. యిప్పుడు నీకు ఏవో సంబంధా లొచ్చేస్తున్నట్టు… అసలిదంతా నీ గొడవ కాదులే. మన టిడిపి, కేంద్రంలో బీజేపీ తీరులే” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”బిజెపి, టిడిపిలని తీసు కుంటే నాలుగేళ్ళనాడు అధికారంలోకొచ్చిన కొత్తలో బాగానే ఉండేవి… లేదా.. కనీసం అలా ఉన్నట్టు కనిపించేవి. అయితే రాన్రానూ యిద్దరి మధ్యా అగాధం పెరిగిపోతున్నట్టుగా అర్థమవుతోంది. ఓ పక్క కేంద్రం… అదే… యిక్కడ బీజేపీ నాయకులు యిక్కడ రాష్ట్రానికి చాలా నిధు లిస్తున్నట్టుగా చెబుతున్నారు. యింకోపక్క టిడిపి నాయకులయితే రాష్ట్రానికి నిధులు సరిగా యివ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తుం దని ఆరోపిస్తున్నారు. ఆ నిజాలేంటన్నది ఆ పెరుమాళ్ళకెరుక. యిక యిప్పుడయితే పరిస్థితి తెగేదాకా వచ్చినట్టే ఉంది. మొన్న చివరి బడ్జెట్‌లో కూడా మన రాష్ట్రానికి దారుణమైన నిరాశే ఎదురయింది. దాంతో యింతకాలం సంయమనం పాటిస్తూ వచ్చిన సీఎం కూడా బయటపడిపోయి విమర్శల దాడిని పెంచడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలూ కలిసుంటారో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది” అంటూ ఆపాడు. దాంతో వెంకటేశం ”మరి అలా తెగ తెంపులయిపోయిన పక్షంలో టిడిపి స్ట్రేటజీ ఎలా ఉండొ చ్చంటారు?” అంటూ అడిగాడు. దాంతో గిరీశం ”ఏవుందోయ్‌… రాజకీయాల్లో ఏదయినా సాధ్యమే. టిడిపి వంటరిగానే కేంద్రం మీద గళమెత్తవచ్చు. లేకపోతే తమిళనాడులో ఒకే తాటిమీద నిలబడి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్‌ పార్టీతో కలిసి గళమెత్తినా ఆశ్చర్యం లేదు” అంటూ వివరించాడు.

– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here