అర్బన్‌ ఎస్పీగా షెముషి బాజ్‌పాయ్‌ 

0
454
రాజమహేంద్రవరం, జులై 18 : రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా డా.షెముషి బాజ్‌పాయ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న బి.రాజకుమారి విజయవాడ క్రైం డీసీపిగా బదిలీ అయ్యారు.  2016 జూన్‌లో ఇక్కడ ఎస్పీగా విధులు చేపట్టిన రాజకుమారి అర్బన్‌ జిల్లాకు తొలి మహిళా ఎస్పీ కావడం విశేషం. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ అర్బన్‌ జిల్లాలో పలు నూతన సంస్కరణలకు, విధానాలకు నాంది పలికిన రాజకుమారి పలు కీలక కేసులను కూడా చేధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. కాగా అర్బన్‌ జిల్లా కొత్త ఎస్పీగా నియమితులైన షెముషి బాజ్‌పాయ్‌ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన వారు. 2008 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా శిక్షణ అనంతరం ఆదోని ఏఎస్పీగా, కృష్ణా జిల్లా పరిపాలనా విభాగం అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతరం 2013లో విశాఖ  డీసీపీగా పనిచేశారు. 2014లో మెదక్‌ ఎస్పీగా, 2015లో బాలానగర్‌ డీపీపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ రైల్వే ఎస్పీగా పనిచేశారు. ఇలా ఉండగా రాజమహేంద్రవరం సౌత్‌ జోన్‌ ఏఎస్పీగా అజిత వెజండ్ల నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం రంపచోడవరం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా రంపచోడవరంం ఏఎస్పీగా రాహుల్‌దేవ్‌ సింగ్‌ నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం వరకు ఛత్తీస్‌ఘడ్‌లో ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన రాహుల్‌దేవ్‌సింగ్‌, అజిత వెజండ్ల భార్యభర్తలు. వీరిద్దరూ 2015 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు.  ఇటీవలే ఆంధ్రా క్యాడర్‌కు బదిలీ అయి వచ్చిన రాహుల్‌దేవ్‌ సింగ్‌ పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తుండగా ఆయన భార్య అజితను రాజమహేంద్రవరం నగరానికి బదిలీ చేసి ఆయనను రంపచోడవరం ఏఎస్పీగా నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here