అల్లూరి ఆశయ సాధనకు కృషిచేయాలి

0
123
సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రామాలయం జంక్షన్‌లో ఘన నివాళులు
రాజమహేంద్రవరం, జులై 4 :  మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు పునరంకితం కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎవి అప్పారావు రామాలయం సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆదిరెడ్డి మాట్లాడుతూ మన్యం వీరుడిగా విల్లంబులు చేతబూని గిరిజనుల్లో చైతన్యం తేవడమే కాక బ్రిటీషు వారిని గడగడలాడించి అల్లూరి స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఆనాటి నాయకులు చేసిన కృషి ఫలితంగానే నేడు దేశం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. అటువంటి స్వాతంత్య్ర సమరయోధులు చూపిన బాటలో పయనించడం ద్వారా సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మన్యంవీరుడు అల్లూరి ఆశయ సాధనకు కృషిచేసినప్పుడే ఆయనకు ఘనంగా నివాళులర్పించినట్లవుతుందన్నారు. బ్రిటీషు వారికి వెన్నుచూపని వీరుడిగా ఎదుర్కొని దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. దేశ ప్రజల గుండెల్లో అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నేటి యువత, విద్యార్థులు అల్లూరి జీవిత చరిత్రలను తెలుసుకుని చైతన్యం తెచ్చుకోవాలని కోరారు. ప్రముఖ వ్యాపార  వేత్త డివియుబి రాజు మాట్లాడుతూ అల్లూరి జయంతి, వర్థంతిలను ప్రతీ ఏటా క్రమం తప్పకుండా రామాలయం సెంటర్లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. అల్లూరి పోరాటయోధుడని ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు గొర్రెల సురేష్‌, కోసూరి చండీప్రియ, ఓఎన్‌జిసి యూనియన్‌ నాయకుడు డివి కృష్ణంరాజు, క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు ఉప్పలపాటి భగవాన్‌రాజు, మంతెన సత్యనారాయణ రాజు (మాస్టారు), విశ్వనాధరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here