అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేస్తాం

0
418
జాంపేట బ్యాంక్‌ మెంబర్లకు ద్వారా ఆనంద్‌ ప్యానెల్‌ విన్నపం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 : ఈనెల 6వ తేదీన జరగనున్న జాంపేట కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికలలో తమ ప్యానెల్‌ను గెలిపిస్తే బ్యాంక్‌ను మరింత ప్రగతిపథంలో నడిపిస్తామని చైర్మన్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్వారా ఆనంద్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు తన ప్యానెల్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా అదే పాలకవర్గం సారధ్యంలో బ్యాంక్‌ నడుస్తోందని, ఈసారి ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ బొమ్మన ప్యానెల్‌ వ్యతిరేకించినందున తాము ఎన్నికల బరిలో నిలిచామన్నారు. తన ప్యానెల్‌లో అల్లాడ అప్పలరాజు, అల్లాడ శ్యామలాదేవి, ఆశపు శేఖర్‌, కటకం వెంకట మల్లికార్జునరావు, కంకిపాటి కోటి ఉమా మహేశ్వరిదేవి, గుంటముక్కల సత్యనారాయణప్రసాద్‌, చింతా వెంకట చలపతిరావు, బత్తుల సోమశేఖరరావు, బళ్ళా శ్రీనివాసరావు, బీరా శ్రీనివాసరావు, వట్టం షణ్ముఖరావు ఉన్నట్లు తెలిపారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలిపారు. బళ్ళా శ్రీనివాసరావు, చింతా వెంకట చలపతిరావు, కటకం వెంకట మల్లికార్జునరావులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నలుగురికి కొత్తగా అవకాశం ఇవ్వాలని కోరగా తిరస్కరించడంతో తాము బరిలోకి దిగామన్నారు. కాలెపు సత్యనారాయణమూర్తి, జామిశెట్టి గాంధీ, ప్రసాదుల హరినాధ్‌, శీలా రఘుబాబు, కొమ్మన వెంకటేశ్వరరావులు ఇప్పటికి మూడు పర్యాయాలు డైరెక్టర్‌లుగా ఉన్నారని, ఇప్పుడు నాలుగవ పర్యాయానికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమ ప్యానెల్‌ను గెలిపిస్తే దుబారా ఖర్చును తగ్గిస్తామని, బ్యాంక్‌కు చెందిన అన్ని శాఖలకు నూతన భవనాలను నిర్మిస్తామని, ఎన్‌పిఏను తగ్గిస్తామని, ప్రస్తుతమున్న రూ.135 కోట్ల డిపాజిట్లను రూ.300 కోట్లకు పెంచుతామన్నారు. తమ ప్యానెల్‌లో అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారని చెప్పారు.