అవగాహనారాహిత్యంతో అర్థరహిత ఆరోపణలు

0
362
షర్మిలారెడ్డిపై తెదేపా కార్పొరేటర్ల ధ్వజం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 8 : నగర పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌  షర్మిలారెడ్డి అర్థరహిత ఆరోపణలు చేస్తూ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నారని, గడిచిన రెండున్నరేళ్ళ కాలంలో కౌన్సిల్‌లోనూ, బయట విమర్శలే ధ్యేయంగా పనిచేస్తున్నారని డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తుందని, అభివృద్ధి విషయంలో ఎక్కడా వివక్ష చూపే ప్రసక్తే లేదన్నారు. రెండున్నరేళ్ళ కాలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డివిజన్‌లలో రూ.24 కోట్ల పనులు జరిగాయని తెలిపారు.  ప్రత్యామ్నాయంగా మరొక రోడ్డు వస్తున్నందువల్లే ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డును విస్తరించవద్దని కార్పొరేటర్లు లేఖలు ఇచ్చారని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకే విమర్శలకు దిగుతున్నారన్నారు. పదేళ్ళపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన రౌతు మోరంపూడి సెంటర్‌లో వ్యాన్‌ స్టాండ్లను ఖాళీ చేయించలేకపోయారని, ఇప్పుడు ఖాళీ చేయించి ప్రహరీగోడ నిర్మిస్తుంటే దానిపై కూడా కొన్ని పత్రికలు నిరాధారమైన వార్తలు రాయడం దురదృష్టకరమన్నారు. తమ హయాంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు. వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పార్టీ పేదల పక్షాన నిలిచేదని, అందుకే నగరపాలక సంస్థలో మూడు పర్యాయాలు అధికారాన్ని తెదేపాకు కట్టబెట్టారన్నారు. గత 30 ఏళ్ళకు పైగా రాజమండ్రి అభివృద్ధికి గోరంట్ల అహర్నిశలు కృషిచేస్తున్నారని చెప్పారు. కౌన్సిల్‌లో ప్రతిపక్షంగా ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని, అధికారపక్షంపై ఎదురు దాడే లక్ష్యంగా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలులో తెదేపా నాయకులు కారులు, :ఫ్లాట్లు, కోట్లు సంపాదించారని  షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలను వర్రే తీవ్రంగా ఖండించారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌కు 2010లో తీర్మానం చేశారని, కాంగ్రెస్‌ హయాంలోనే కన్సల్టెన్సీకి అప్పగించారని చెప్పారు. ప్రజల నుంచి  సుమారు 500కు పైగా అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. షర్మిలారెడ్డి కుటుంబ సభ్యులు 17 అభ్యంతరాలు తెలిపారని, ఆ విధంగా తెదేపా కార్పొరేటర్లు ఎవరూ వ్యాపారాలు చేయలేదన్నారు. దానవాయిపేట నార్త్‌ రోడ్‌ విస్తరణ తాను అడ్డుపడలేదని, ఆ రోడ్డులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్య నాయకుల భవనాలే ఉన్నాయని చెప్పారు. జాగృతి బ్లడ్‌ బ్యాంక్‌ నుండి టిటిడి కళ్యాణ మండపం వరకు వున్న రోడ్డును విస్తరిస్తున్నామని తెలిపారు. నార్త్‌ విస్తరణకు కూడా తాను సిద్ధమేనని చెప్పారు. చీఫ్‌ విప్‌ పాలిక శ్రీను మాట్లాడుతూ షర్మిలారెడ్డి అభ్యంతరాలను అంగీకరించకపోవడంతోనే  విమర్శలు చేస్తున్నారని, ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కార్పొరేటర్‌ చండీ ప్రియ మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించారని, ఆమెకు అవగాహనరాహిత్యం ఎంత ఉందో ఇప్పుడు అర్థమైందన్నారు. కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ మాట్లాడుతూ మేడపాటి షర్మిలారెడ్డి తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోరుమిల్లి విజయశేఖర్‌, కిలపర్తి శ్రీనివాస్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, బూర దుర్గాంజనేయరావు, కరగాని మాధవి, తంగెళ్ళ బాబి, పాలవలస వీరభద్రరావు, గరగ పార్వతి, కో-ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగు, పార్టీ నాయకులు మళ్ళ వెంకట్రాజు, పితాని కుటుంబరావు, తంగేటి సాయి పాల్గొన్నారు.