అవగాహన కల్పిస్తుంటే ఉలుకెందుకు ?

0
76
వలంటీర్లను బ్లాక్‌ మెయిల్‌ చేస్తే ఊరుకోం..
తెదేపాకు వైసిపి మాజీ ఫ్లోర్‌లీడర్లు పోలు, మేడపాటి హెచ్చరిక
రాజమహేంద్రవరం, డిసెంబరు 3 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ ఫలాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో మహిళా విభాగం ఆధ్వర్యంలో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని, ఆర్‌పిలు, వలంటీర్లను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు నగర ప్రజాప్రతినిధి తమపై నిందలు వేయడం మానుకోకుంటే సహించేది లేదని నగర పాలక సంస్థ వైకాపా మాజీ ఫ్లోర్‌లీడర్లు పోలు విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి హెచ్చరించారు. స్థానిక జమిందార్‌మెట్టపై ఉన్న వైఎస్‌ఆర్‌ సిపి సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం కార్యాయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. నగరంలోని డివిజన్లలో జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను డ్వాక్రా మహిళలు సహా అన్ని కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో వైసిపి ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీలను పెట్టి అందర్నీ దోచుకుంటే జగన్‌ నేడు వలంటీర్లను నియమించి పారదర్శకంగా ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నారని అన్నారు. అధికారులు, ఆర్పీలను, వలంటీర్లను బ్లాక్‌ మెయిల్‌ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆ మహిళా ప్రజాప్రతినిధికి స్వతంత్రంగా వ్యవహరించే ధైర్యం లేదని విమర్శించారు. టీడీపీ అరాచకాలు, పెత్తనాన్ని సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులేకపోయినా మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా హామీలు అమలు చేస్తున్న జగన్‌కు అండగా నిలుస్తామన్నారు. సిటీ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటలా భావిస్తోందని దాన్ని త్వరలోనే బద్దలు కొట్టడానికి వైసిపి సిద్ధంగా ఉందని సవాల్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, అదే స్ఫూర్తితో జగన్‌ కూడా నవరత్నాలు, నవశకం అమలు చేసి అందరికి మేలు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్పీలను గందరగోళంలోకి నెట్టాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ఆధార్‌, రేషన్‌కార్డులు రద్దవుతాయని ఇంటింటికి వెళ్లి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ఆదేశాల మేరకు వైసిపి నాయకులంతా ప్రజలకు సేవకులుగా పనిచేస్తామన్నారు. పారదర్శకంగా నాలుగు లక్షల ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా, విద్యాదీవెన, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ తదితర అన్ని పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా అన్ని డివిజన్లలో మహిళలకు అవగాహన కల్పిస్తుంటే టీడీపీ ఉలుకెందుకని ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని కోరారు. మహిళల సంక్షేమం, ప్రజల వద్దకు పాలన తెచ్చిన జగన్‌ పథకాలను మరింత చేరువ చేసేందుకు తమకు సహకరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, కురుమెల్లి అనూరాధ, చోడిశెట్టి సత్యవాణి, పార్టీ నాయకులు సంకిస భవానీప్రియ, షబ్నం అఫ్సర్‌, గుడాల ఆదిలక్ష్మి, నిరీక్షణ జేమ్స్‌, దంగమంగ లక్ష్మి, సయ్యద్‌ హసీనా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here