అవినీతికి అడ్డుకట్ట – పాలనకు పదును

0
551
ఆ దిశగా దృష్టి సారిస్తే చంద్రబాబుకు తిరుగేలేదు
జికె వార్తా వ్యాఖ్య
 
మంత్రులకు, నాయకులకు, ఇన్‌ఛార్జిలకు తెలుగుదేశం పార్టీ మూడు రోజుల పాటు విజయవాడలో నిర్వహించిన మేథోమధన సదస్సు ఫలప్రదంగా ముగిసింది. పరిపాలనలో వినూత్న సంస్కరణలు, హైటెక్‌ విధానాలు ప్రవేశపెట్టి తనంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇచ్చేందుకు చేసిన ఈ ప్రయత్నం మంచి ఫలితాలనే ఇచ్చిందని చెప్పొచ్చు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి సీనియర్‌ నేతలు  కూడా కొద్దిసేపు విద్యార్ధుల్లా మారిపోయి శ్రద్ధగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం  చేయడం అభినందనీయం. తీరిక లేకున్నా సీఎం చంద్రబాబు మూడు రోజుల పాటు శిక్షణా శిబిరం వద్దే ఉండి శ్రేణులకు స్ఫూర్తినివ్వడం బహు ప్రశంసనీయం. ఈ ప్రయత్నం బహుశ తెలుగుదేశం పార్టీలోనే కాదు దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. ఇటువంటి శిక్షణను త్వరలో మిగిలిన పార్టీ శ్రేణులకు కూడా ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇది చాలా సంతోషకరం.1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ళకు పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ఆనాడే పరిపాలనలో హైటెక్‌ విధానాలను ప్రవేశపెట్టి  హైటెక్‌ సీఎంగా ముద్ర పడ్డారు. అయితే మూలాలను వదిలి హైటెక్‌ విధానాలతో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారనే అపవాదును కూడా చంద్రబాబు ఎదుర్కొన్నారు. 2004 ఎన్నికల్లో అందుకు తగిన మూల్యాన్ని కూడా ఆయన చెల్లించుకోవలసి వచ్చింది.  అయితే ఆ తర్వాత చంద్రబాబు హైటెక్‌ విధానాలే తర్వాత వచ్చిన పాలకులకు దిక్సూచిలయ్యాయి. అప్పుడు….ఇప్పుడు కూడా రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ నవ్యాంధ్ర నిర్మాణానికి, అభివృద్ధికి, సంక్షేమ విధానాల అమలుకు శ్రమిస్తున్న చంద్రబాబు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టడమే గాక రెయిన్‌గన్లతో రాయలసీమలో కరవు రక్కసిని తరిమి కొట్టి శెహభాష్‌ అనిపించుకున్నారు. అచిర కాలంలోనే నవ్యాంధ్ర ప్రాంతం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించి ప్రజలకు పరిపాలనను కూడా చేరువ చేశారు. ఇంత దార్శనికత, కార్యదక్షత కల నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం వలనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు మన రాష్ట్రానికి సారధ్యం వహించడం  మన అదృష్టంగా భావించవచ్చు. రాష్ట్రం కోసం చంద్రబాబు ఇంతగా శ్రమిస్తున్నా ప్రతిపక్షాలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా ఆయన అవేమీ లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. ప్రజా సంక్షేమంతో పాటు మరే రాజకీయ పార్టీ తీసుకోనంత శ్రద్ధను పార్టీకి వెన్నెముకగా ఉన్న కార్యకర్తల సంక్షేమం కోసం కూడా చంద్రబాబు తీసుకోవడం సర్వదా ప్రశంసనీయం. అందులో భాగంగా చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సారధ్యంలో  కార్యకర్తల సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా…… ప్రభుత్వ పనితీరు పట్ల కింది స్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా రైతుల్లో, డ్వాక్రా మహిళల్లో ముఖ్యమంత్రి హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేరలేదన్న అసంతృప్తి ఎందుకు కలిగిందో పరిశీలన చేసుకోవలసి ఉంది. అలాగే కాంగ్రెస్‌ హయాంలో మాదిరిగా ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలనలో కూడా రాజకీయ స్థాయిలో, పరిపాలనా యంత్రాంగంలో అవినీతి ఎందుకు పెచ్చుమీరిందో ముఖ్యమంత్రి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రజలకు ఇసుకను ఉచితంగా అందించాలనే సదుద్ధేశ్యంతో చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టగా  అందులో కూడా అక్రమాలు, అవినీతి చోటు చేసుకోవడం, ఎన్ని హైటెక్‌ విధానాలను ప్రవేశపెట్టినా నేటికీ వేలాది మంది అనర్హులు నెలవారీ ఫించన్లు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇసుక తవ్వకాలు, పంపిణీలో అవకతవకలపై సొంత పార్టీ వారే విమర్శలు చేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. పాలనా యంత్రాంగంలో అవినీతి పెచ్చుమీరిందనడానికి ఇటీవల ఏసీబి  దాడులు పెరగడం, ఈ దాడుల్లో అధికారులు, ఉద్యోగుల నుంచి భారీగా అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. అవినీతి ఎంతగా ప్రబలితే ప్రజల్లో అంత వ్యతిరేకత వస్తుందన్న విషయం సర్వజ్ఞుడైన చంద్రబాబునాయుడుకు తెలియంది కాదు. అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికార యంత్రాంగానికి చంద్రబాబు సమయం వచ్చినప్పుడల్లా అనేక మార్లు వార్నింగ్‌లు ఇస్తున్నారు. అయితే వార్నింగ్‌లే గాక బాధ్యులపై చర్యలు ఉంటేనే ప్రయోజనం ఉంటుందన్న ప్రజా మనోగతాన్ని ముఖ్యమంత్రి గుర్తెరిగితే అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. చర్యల్లేకుంటే ప్రజా విశ్వాసాన్ని  చూరగొనలేమన్న విషయాన్ని  కూడా చంద్రబాబు గుర్తించడం శ్రేయస్కరం. అసలు ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణమా? అని కూడా విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల పట్ల కొన్ని వర్గాల్లో నిరుత్సాహం నెలకొంది. అందుకు గల కారణాలను ముఖ్యమంత్రి విశ్లేషించుకోవడం  శ్రేయస్కరం.  అటు రాజకీయ, ఇటు పాలనా యంత్రాంగంలో అవినీతిని అరికడితేనే చంద్రబాబు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వ పాలనకు ఇంకా దాదాపు రెండు సంవత్సరాల కాలం ఉన్నందున ఈ లోగా రాజకీయ స్థాయిలో, పాలనా యంత్రాంగంలో కూడా అవినీతిని అదుపు చేస్తే ప్రజలకు మేలు చేసిన వారవుతారు.అదే గనుక జరిగితే సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తూ  రాజకీయంగా తిరుగులేని నేతగా ఉన్న చంద్రబాబుకు భవిష్యత్తులో ఇక తిరుగే ఉండదు.