అసంతృప్తి ప్రజలకు కాదు…. ప్రతిపక్షాలకే….

0
319
అభివృద్ధికి సౖౖెంధవుల్లా అడ్డుపడుతున్నారు
2019లో అధికారం మాదే అంటూ పగటి కలలు
తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ధ్వజం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 : చంద్రబాబునాయుడు పాలన పట్ల ప్రతిపక్షాలకే తప్ప ప్రజలకు ఎలాంటి  అసంతృప్తి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  గన్ని కృష్ణ అన్నారు. విభజన కష్టాలను, ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ  నవ్యాంద్ర రాజధాని నిర్మాణానికి శ్రమిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు సహకరించవలసిన ప్రతిపక్షాలు అవాస్తవ ఆరోపణలతో విమర్శలే ధ్యేయంగా అడుగడుగునా అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో కష్టాలకు ఓరుస్తూ ఏపీని ప్రగతి పథంలో నడిపేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారని, ఈ నేపధ్యంలో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధో, అనధికార ప్రతినిధో, ఎపుడు ఎవరిని విమర్శిస్తారో తెలియని అతి మేథావితనం ఉన్న మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ 2018 తర్వాత తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందని జోస్యం చెప్పడం  హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే తె లుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రల కంటే జన క్షమాపణ యాత్రలు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు చేసిన విమర్శలను గన్ని తిప్పిగొట్టారు. విత్తు వేసిన వెంటనే చెట్టు మొలవదని, ఆ మాత్రం కూడా తెలియని ప్రతిపక్ష నాయకులు విభజన కష్టాలు పట్టకుండా, చంద్రబాబు ఎన్నికల హామీల అమలు, రాజధాని నిర్మాణ విషయంలో పదే పదే విమర్శలు చేయడం అవివేకమన్నారు. ప్రతిపక్షాలు సైంధవుల్లా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఆర్ధికంగా ఎంతో భారమైనా హామీ అమలు కోసం రైతు, డ్వాక్రా రుణాల మాఫీకి విడతల వారీగా నిధులు కేటాయిస్తున్నారని, ఇంతవరకు రెండు విడతల రైతు రుణాలు మాఫీ కాగా మరో రెండు విడతలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలాగే మూడు వేల కోట్ల రూపాయల మేర డ్వాక్రా రుణాల్ని మాఫీ చేశారని అన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు ఇంత కష్టపడుతుంటే దుగ్ధతో కుర్చీపైనే దృష్టి ఉన్న వైకాపా అధినేత జగన్‌ ఆ కుర్చీని ఎపుడు తన్నుకుపోదామా? అని చూస్తున్నారని గన్ని ధ్వజమెత్తారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పట్టిసీమ ద్వారా నదుల్ని అనుసంధానం చేశారని, అమరావతి ప్రాంతంలో కేవలం ఎనిమిది నెలల్లో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసి పాలనను రాష్ట్రానికి నడిబొడ్డుకు తెచ్చారని, శాశ్వత రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబు దార్శనికత, సమర్ధతలపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉన్నా ప్రతిపక్షాలు 2019లో అధికారం మాదే అంటూ పగటి కలలు కంటున్నాయని, అయితే వారివన్నీ భ్రమలే కాగలవని, వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం తమదేనన్నారు.
పోలీసుల ప్రతాపం సామాన్యులపైనేనా?
నగరంలో మద్యం దుకాణాలు నిర్ణీత వేళల్ని మించి తెరిచి ఉన్నా పట్టించుకోని పోలీసులు సామాన్యులపైనే తమ ప్రతాపం చూపుతున్నారని గన్ని కృష్ణ విమర్శించారు.  చట్టం ముందు అంతా సమానులేనని, అయితే పోలీసులు చిరు వ్యాపారులు, సామాన్యులపైనే జులుం చేస్తున్నారని అన్నారు. స్ధానిక దానవాయిపేటలో తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావుకు, పోలీసులకు మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ దీనిపై విచారణ జరిపి తప ్పు ఎవరిదైతే వారిపై చర్య తీసుకోవచ్చని, అయితే కొన్ని పత్రికల్లో, ఛానళ్ళలో ఈ వివాదంపై అవాస్తవ కథనాలు రావడం బాధాకరమన్నారు. రాత్రి 11 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచుకోవడానికి సీఎం చంద్రబాబు పుష్కరాల సమయంలో అనుమతించారని, అయితే మద్యం దుకాణాలు పరిమితి వేళలకు మించి తెరిచి ఉన్నా,  గాంధీ జయంతి నాడు కూడా మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు తెరిచి ఉన్నా పట్టించుకోని   ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు  చిరు వ్యాపారులపై జులుం చేయడం దారుణమన్నారు. అనుక్షణం రద్దీగా ఉండే రహదారులపై మద్యం దుకాణాల వద్ద మందుబాబులు చిందులేస్తున్నా పట్టించుకోని పోలీసులు చట్టాన్ని సమానంగా అమలు చేయడం నేర్చుకోవాలన్నారు.