అసలు ఆంధ్రప్రదేశ్‌ ఉందన్న మాట గుర్తుందా?

0
337

కేంద్రం తీరుపై మాజీ ఎం.పి. మిడియం బాబూరావు ధ్వజం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 : కేంద్ర బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా విస్మరించిందని, బడ్జెట్‌తో కార్పోరేెట్లకు మంచిరోజులు, సామాన్యప్రజలకు దుర్ధినాలు మొదలయ్యాయని భారత కమ్యునిస్టుపార్టీ (మార్క్సిస్టు) సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డా. మిడియం బాబూరావు విమర్శించారు. సి.పి.ఎం. పార్టీ రాజమండ్రి నగరకమిటీ ఆధ్వర్యంలో శ్యామలా సెంటర్‌లో కేంద్ర బడ్జెట్‌లో ఎ.పి. కి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 2018-19 బడ్జట్‌ ప్రతులను తగులబెట్టారు. అనంతరం జరిగిన సభలో బాబూరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ పెట్టారని, దేశంలో ఒక శాతం కార్పోరేట్ల చేతుల్లో 73 శాతం సంపద ఉందని, వీరిపై ప్రత్యక్ష పన్నులు పెంచాల్సిందిపోయి 51.6 శాతం నుండి 50.6 శాతానికి తగ్గించారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు 5 ఏళ్ళలో 10 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ కేవలం 43 లక్షలు మాత్రమే ఇచ్చారని అవి కూడా ప్రైవేటు ఉద్యోగాలేనని అన్నారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు ఎలాంటి నిధుల కేటాయింపూ లేదని, 50 లక్షల మంది యువతకు నైపున్య శిక్షణ ఇస్తామని చెప్పారని, అయితే శిక్షణ ఇచ్చి కార్పోరేట్‌ కంపెనీల వద్ధ బానిసలలా కనీసజీతం, హక్కులు లేకుండా చేయనుందన్నారు. ఎ.పి.కి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు, రైల్వే జోన్‌, రాయలసీమ, ఉత్తరాంద్రా ప్రత్యేక ప్యాకేజీ, గిరిజన, సెంట్రల్‌ యూనివర్శిటీలు, అమరావతి నిర్మాణానికి, విభజన వల్ల రాష్ట్రంలో ఏర్పడ్డ లోటును భర్తీ చేసేందుకు ఎలాంటి కేటాయింపులు లేకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసారన్నారు. 10 కోట్ల ప్రజలకు హెల్త్‌ ఇన్సూరెన్సు ఇస్తానని చెబుతున్నా ఈ బడ్జెట్‌లో కేటాయింపులేమీ లేవని, ఈ పథకం పూర్తిగా కార్పోరేట్‌ కంపెనీల దాతృత్వంపై ఆధారపడి ఉందన్నారు. వ్యవసాయానికి, సామాజిక రంగాలకూ పెద్దపీట వేశారని చెప్పుకుంటున్నా ఇది రైతాంగానికి ఎటాంటి లాభంలేదని, గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులుసైతం ఒక వంతుకూడా ఖర్చు చేయలేదన్నారు. విధ్యారంగానికి, కేంద్ర అమలు చేస్తున్న స్కీములకు సైతం కేటాయింపులు లేవని, యూనివర్శిటీలకు నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపు కున్నారన్నారు. మొత్తంగా ఇది కార్పోరేట్‌ బడ్జెట్‌ అని దీని వల్ల దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, సామాజిక అణచివేత మరింత పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.ఎస్‌.మూర్తి, జిల్లా కమిటి సభ్యులు పి.వెంకటేశ్వరరావు ఎన్‌. భీమేశ్వరరావు, పి.తులసి, బి.రాజులోవ, బి.పవన్‌, నగరకమిటీ సభ్యులు కె. రామకృష్ణ, ప్యారీలింగం, పి.శ్రవంతి, ఎన్‌.రంగ, జి.సాయిబాబు, పార్టీ సభ్యులు సోమేశ్వరరావు, మాచారావు, రాంబాబు, పూర్ణ, జరీనా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here