అసుర సంహారం

0
192
గంగలకుర్రు.. అమలాపురానికి దగ్గర్లో ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న ఊరు. అలాంటి ఊరికి సైతం ప్రాధాన్యత రావడానికి కారణం అప్పుడెప్పుడో బుచ్చమ్మ గారి తమ్ముడు వెంకటేశం నుంచి ఈనాటి మనవడు వెంకటేశం వరకూ అంతా అక్కడే పుట్టి పెరగడం. యిప్పటి వెంకటేశం దగ్గర కొచ్చేసరికి రాజమండ్రిలో గిరీశం గారి దగ్గర శిష్యరికం వెలగబెడుతున్నా అడపాదడపా ఊళ్ళోనే ఉండి వ్యవహారాలవీ చక్కబెడు తుంటాడు. ప్రస్తుతం కూడా అదే పనిలో ఉన్నాడు. ఆ రోజో విశేషం జరిగింది. వెంక టేశానికి అప్పుడే మెలకువొచ్చింది. బద్ధకంగా  వొళ్ళు విరుచుకుంటూ పైకి లేవబోతుండగా ఎవరో హడావిడిగా తలుపులు కొట్టడం వినిపించింది. దాంతో యింత పొద్దున్నే  ఎవరొచ్చారా అనుకుంటూ వెళ్ళి తలుపులు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగా తన పొలం చూసే వీరన్న, కూడా యింకో అరడజను మందీ వచ్చారు. అందులోనూ వీరన్న నెత్తిమీద చిన్నపాటి దెబ్బ తగిలి నట్టు కూడా ఉంది. దాంతో వెంకటేశం కంగారుపడి ‘ఏవయింది వీరన్నా?” అంటూ అడిగాడు. వీరన్న ఏదో చెప్పబోతుండగా కూడా వచ్చినవాళ్ళలోని నారాయణ ముందుకొచ్చి ”యిదంతా మన పొలం పక్కన పొలం ఉన్న సాంబయ్యగాడి పని బాబయ్యా.. యిందాక ఆడే కొట్టాడు” అన్నాడు. ఆపాటికి వెంకటేశం మత్తు పూర్తిగా దిగి పోయింది. ”ఏంటీ.. ఆ సాంబయ్య  కొట్టాడా?” అన్నాడు. అంతా తలలూపారు. యింతలో నారాయణ ”అవును బాబయ్యా.. మన పొలం లోకి వెళ్ళడానికి దారి లేదు కదా. చుట్టూ తిరిగి వెళ్ళాలి. అందుకే ఆ ముందున్న సాంబయ్య పొలం లోంచే మన వీరన్న వెడుతుంటాడు. అలాగే అప్పు డప్పుడూ గేదెల్ని కూడా ఆ పొలంలోంచే మన పొలం లోకి తోలుకుపోతుంటాడు. నిన్నా అలాగే తోలుకెడుతున్నప్పుడు అవేవో కొన్ని పంట మొక్కల్ని తొక్కేసినట్టున్నాయి. అదంతా మనసులో పెట్టు కుని యిందాక వీరన్న పొలంలో ఉండగా ఆ సాంబయ్య వచ్చి కొట్టేశాడు.  ఆ సాంబయ్య గాడి విషయం మీరే ఏదో చెయ్యాలి బాబయ్యా” అన్నాడు. దాంతో వెంకటేశం ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అంత లోనే గబగబా లోపలికెళ్ళాడు. అంతా ఆసక్తిగా  ఎదురు చూస్తుండగా లోపల్నుంచి వెంకటేశం ఓ పెద్ద కర్రొకటి పట్టుకునొచ్చాడు. అంతే కాదు. వచ్చీ రాగానే  దాంతో ఆ అందరినీ బాదడం మొదలెట్టాడు. దాంతో అంతా అదిరిపోయి కుయ్యో మొర్రోమన్నాడు. అంతా తేరు కునేలోపు యింకో రెండేసి దెబ్బలు తగిలాయి. దాంతో ఆ వచ్చిన వాళ్ళంతా లబలబలాడుతూ ”యిదేంటి బాబయ్యా.. మేం చేసిన తప్పేంటీ?” అన్నారు. ఈలోగా వెంకటేశం కర్ర కిందపడుతూ” యిప్పుడు మీరంతా యిలాగే పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళండి. వెళ్ళి ‘ఆ సాంబయ్య  తన మనుషులతో దాడిచేసి మిమ్మల్నందర్నీ కొట్టించా డని చెప్పండి. అప్పుడయితే కేసు బలంగా ఉంటుంది” అన్నాడు. అప్పటికి అందరికీ వెంకటేశం అలా ఎందుకు చేశాడో అర్థమయింది. వెంకటేశం వంక ఆరాధనగా చూసి ‘ఎంతైనా చదువుకున్నోడు చదువు కున్నోడే. ఆ తెలివితేటలు ఎక్కడికి పోతాయి’ అనుకుంటూ ఆ కర్రతో యింకో నాలుగేసి దెబ్బలు తగిలించుకుని వెనుదిరిగారు.
వెంకటేశం కాలుగాలిన పిల్లిలా తయారయ్యాడు. దానిక్కారణం పొద్దున్న తను వేసిన ప్లాన్‌ కాస్తా బెడిసికొట్టడం. వీరన్న, మిగతావాళ్ళు  పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళి కంప్లయింట్‌ చేసేశారు. అయితే ఆ వార్తేదో యింకోలా ఊరంతా గుప్పుమంది. అది.. వెంకటేశం తాలూకా మనుషుల్ని తప్పుచేసినందుకు ఆ పక్క పొలం తాలూకా సాంబయ్య మనుషులు చావగొట్టారనీ, దాంతో వీళ్ళు పిరికిపందల్లా పారి పోయారనీ. యిదంతా వెంకటేశానికి అవమానంగా తోచింది. అసలే త్వరలో తను రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడు. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ తలపట్టుకున్నాడు.
వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అంతా కల..! ‘ఛ..ఛ.. యిలాంటి కలొచ్చిందేంటీ ‘ అనుకుంటూ చుట్టూ చూశాడు. యింకా గురువుగారి జాడలేదు. దాంతో వెంకటేశం అరుగుమీద మళ్ళీ చిన్నగా నిద్రలోకి జారిపోయాడు. ఈసారి యింకో కలొచ్చింది.
ఎవరో తలుపులు కొడుతుండేసరికి  వెంకటేశం వెళ్ళి తలుపులు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగా తన పొలం పనులు చేసే వీరన్న ఉన్నాడు. అయితే వొంటినిండా దెబ్బలతో ఉన్నాడు. ఏవయిందీ అని అడిగే లోపు వీరన్నే వొస్తున్న ఏడుపునాపు కుంటూ ”యిదంతా మన పక్క పొలం సాంబయ్య గాడి పని బాబయ్యా వాడి పొలంలోంచి వెడుతున్నా నని కొట్టాడు” అంటూ జరిగిందంతా చెప్పాడు.  అయితే అప్పుడో విశేషం జరిగింది. వెంకటేశం కంగారుగా ”యిదిగో వీరన్నా.. నువ్వర్జంటుగా ఊరొదిలి వెళ్ళు. మళ్ళీ ఈ దెబ్బలవీ తగ్గిం తర్వాతే ఊళ్ళోకిరా. ఎవరడిగినా సైకిల్‌ మీంచి పడిపోయానని చెప్పు” అంటూ తోలేశాడు. అయితే మధ్యాహ్నం కావస్తుండగా ఎస్సై వచ్చి వెంకటేశాన్ని కలిశాడు. ”మీ వాడిని ఆ సాంబయ్య కొట్టాడని అంతా చెప్పుకుంటున్నారు. నిజ మేనా?” అనడిగాడు. దాంతో వెంకటేశం అసహనంగా ”అబద్ధం.. అలాంటిదేవీ జరగలేదు. మా వాడేదో సైకిల్‌ మీంచి పడ్డాడంతే” అని గట్టిగా చెప్పేశాడు. దాంతో ఎస్సై వెనుదిరిగాడు.
మొహంమీద వేడిగా తగిలేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చు న్నాడు. ఎదురుగా నోట్లో చుట్టతో గిరీశం..!” ఏవివాయ్‌.. జోరుగా కలేదో కంటున్నట్టున్నావ్‌..” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును గురూగారూ.. ఒక కల రెండు రకాలుగా వచ్చింది” అంటూ తన కొచ్చిన కలలన్నీ చెప్పాడు. అంతా విన్న గిరీశం ”అయితే ఈసారి  నీ కలలోకి పాకిస్థాన్‌ దూరినట్టుందోయ్‌” అన్నాడు. పాకిస్థాన్‌ అనేసరికి వెంకటేశం మొహం చిట్లించాడు. యింతలో గిరీశం కొనసాగిస్తూ ”అవునోయ్‌.. పాకిస్థాన్‌ వ్యవహారం మొదట్నుంచీ తెలిసిందే. కరడు గట్టిన ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం అక్కడి పాలకులకి అలవాటే. మొన్నటికి మొన్న ఆ ఉగ్రమూక మన 48 మంది సైనికులని బలిగొనడం జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్‌ మీద విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో పాక్‌ ప్రధాని యిమ్రాన్‌ ”అబ్బే.. మా దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలూ లేవు. కావాలంటే ఆధారాలు చూపించండి” అంటూ చెవుల్లో పూలెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఓ పదిరోజులాగి మన సైనికులు పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుని పోయి మరీ మూడొందలమంది ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న ఉగ్ర వాదుల్ని చంపేశారు. అది అటు ఉగ్రవాదులకీ, యిటు వారిని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ పాలకులకీ చావుదెబ్బే. ఓ పక్కన జరిగిందాంతో కడుపు మండిపోయినా పాకిస్థాన్‌ ప్రభుత్వం బయటికి కక్కలేని, మింగలేని పరిస్థితిలో పడిపోయింది. ఓ రకంగా తేలుకుట్టిన దొంగలాంటి పరిస్థితి. దాంతో పాక్‌ ప్రధాని పరువు పోకుండా అబ్బే ఒక్కళ్ళు కూడా చావలేదనీ మేకపోతు గాంభీర్యంతో శాంతి కబుర్లు మొదలెట్టారు… దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, యిక రామా యణంలో పిడకలవేటలాంటి యింకో ట్విస్ట్‌ ఏంటంటే.. రెండు దేశాల మధ్యా శాంతి సాధనకి కృషి చేస్తున్నందుకు ఇమ్రాన్‌కి నోబెల్‌ శాంతి బహుమతి యివ్వాలని పాక్‌ పార్లమెంటులో  ప్రజా ప్రతి నిదులు డిమాండ్‌ చేయడం” అంటూ నవ్వాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here