ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది మీరే 

0
174
చంద్రబాబుపై వైకాపా ధ్వజం – దగా చేసిన పార్టీలకు బుద్ధి  చెప్పేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌
రాజమహేంద్రవరం, జనవరి 18 : కాంగ్రెస్‌తో జత కట్టి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది సీఎం చంద్రబాబునాయుడేనని, ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన కాంగ్రెస్‌, బిజెపిలను పక్కన పెట్టి ఫెడరల్‌ వ్యవస్థ ఏర్పాటుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నంలో తప్పేముందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ మార్గాని భరత్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రౌతు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఫెడరల్‌ వ్యవస్థ ఏర్పాటుకు కేసీఆర్‌ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని, అందులో భాగంగానే ఆయన కుమారుడు కేటీఆర్‌ జగన్‌తో సమావేశమయ్యారని, దీనిపై సీఎం నుంచి ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా గగ్గోలు పడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటీవల హరికృష్ణ చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్న సమయంలో కేసీఆర్‌తో కలిసి పోటీ చేయడానికి చంద్రబాబు చర్చించలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో చేతులు కలపడానికి టీఆర్‌ఎస్‌ అంగీకరించలేదని చెప్పారు. వారు కలిసి పోటీ చేస్తే సంసారంగా, ఆ నాయకులతో తమ పార్టీ నాయకులు చర్చిస్తే వ్యభిచారంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఆంధ్రాకు చెందిన సెటిలర్స్‌ కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచి టీఆర్‌ఎస్‌ విజయానికి దోహదపడ్డారని, ప్రజల్లో లేని విద్వేషాలను నాయకులు, కొన్ని పత్రికలు రెచ్చగొట్టడం సభ్యత, సంస్కారం కాదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ అధినేత జగన్‌ ఎంతో సంయమనంతో ఉన్నారని, విలువలతో కూడిన రాజకీయాలు జగన్‌కు సాధ్యమన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాని వైకాపాలో చేరాలంటే పదవులకు రాజీనామా చేస్తే గానీ అంగీకరించలేదని, కానీ చంద్రబాబు మాత్రం వైకాపా గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం విలువలతో కూడిన రాజకీయాలా? అని ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్‌ దెబ్బతీస్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు పార్టీని ఏర్పాటు చేశారని, ఇప్పుడు అలాంటి పార్టీతో జత కట్టడం ఆంధ్రుల ఆత్మాభిమానం తాకట్టు పెట్టడం కాదా? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ను పిలిచిన చంద్రబాబు కెేసీఆర్‌ నిర్వహించిన హోమానికి వెళ్ళలేదా? అని అడిగారు. మార్గాని భరత్‌ మాట్లాడుతూ ఆంధ్రులను దగా చేసిన కాంగ్రెస్‌, బిజెపిలను పక్కన పెట్టి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంటే చంద్రబాబు, ఆ పార్టీ నాయకులకు లేనిపోని కంగారు పుడుతోందన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌ ప్రతినిత్యం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటాలు చేస్తున్నారని, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ సజీవంగా ఉండటానికి ఆయన చేసిన కృషే కారణమన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని, హోదాతోపాటు అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గుత్తుల మురళీధరరావు, మాజీ  ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల, పార్టీ నాయకులు వాకచర్ల కృష్ణ, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్‌, పెంకే సురేష్‌, నీలం గణపతిరావు, కొమ్ము జిగ్లేర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here