ఆకట్టుకున్న ‘తానా’ జానపద కళోత్సవం 

0
329
రాజమహేంద్రవరంలో తొలిసారి నిర్వహణ – పుర వీధుల్లో ర్యాలీ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 21 : నగరంలోని శ్రీ వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో తానా జానపద కళోత్సవం గత రాత్రి అత్యంత వైభవంగా సాగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక విభాగం సహకారంతో రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళిమోహన్‌ సారధ్యంలో  జరిగిన తానా జానపద కళోత్సవం అద్యంతం ఆసక్తిగా సాగింది. వందమంది కళాకారులతో డీలక్స్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా కళా కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల విద్యార్ధులు, ఉమా నృత్యనికేతన్‌ శిష్య బృందం, విశాఖపట్టణానికి చెందిన విజయ్‌ బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి . హైదరాబాద్‌కు చెందిన శోభానాయుడు శిష్యులు క్రాంతి నారాయణ బృందం చేసిన విఘ్నేశ్వర నృత్యం, తణుకు నుంచి వచ్చిన అంబిక బృందం చేసిన రింగ్‌ నృత్యం ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపి మురళిమోహన్‌ మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళలను కాపాడాలనే తపనతో అమెరికాలో స్థిరపడిన తెలుగు వారంతా 40 ఏళ్ళుగా తానా పేరుతో భాషాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కళల రాజధాని రాజమహేంద్రవరంలో ఈ కళోత్సవం నిర్వహించడం ఎంతో శుభదాయకమన్నారు. తానా పౌండేషన్‌ అధ్యక్షుడు చౌదరి జంపాల మాట్లాడుతూ జానపద కళారూపాలు భారతీయ సంస్కృతికి చిహ్నాలని అన్నారు. జానపద కళలకు ప్రోత్సాహం అందించి వాటిని సంరక్షించాలనే తపనతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జానపదాన్ని ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో మొదటి సారిగా ఈ జానపద కళోత్సవం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే తానా ఆధ్వర్యంలో  వైద్య శిబిరాలు  వంటి పలు సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తున్నామన్నారు. 1977లో తానా ఏర్పడిందని, 35 వేల మంది జీవిత సభ్యులున్నారని తెలిపారు. సాంఘిక, సామాజిక, విద్య ఇతర రంగాల్లో తానా ద్వారా విస్తృతంగా సేవలందిస్తున్నామన్నారు. ప్రతి ఏటా రూ. 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఏపీలో సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ మరుగున పడుతున్న కళలను పరిరక్షించేందుకు తానా ముందుకు రావడం, ఎంపి మురళీమోహన్‌ అందుకు సారధ్యం వహించడం అభినందనీయమన్నారు. అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు వారధిగా తానా విశేష కృషి చేస్తుందని అన్నారు. పాశ్చాత్య దేశమైన అమెరికాలో భారత దేశ సంస్కృతి విరాజిల్లడం వెనుక తానా  కృషి ఉందన్నారు. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అన్నట్లుగా అమెరికాలో స్ధిరపడినప్పటికి పుట్టిన గడ్డను మర్చిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, సీఎం చంద్రబాబు  పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ కళలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జీఎస్‌ఎల్‌ ఆసుపత్రి అండ్‌ కాలేజీ చైర్మన్‌ డా.గన్ని భాస్కరరావు,  తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, డా.చలుమూరు తులసీ మోహనరావు, తానా సభ్యులు సతీష్‌ వేమన, శ్రీనివాస్‌ గోగినేటి, రవి పొట్లూరి, మంజులత కన్నిగంటి , నవీన్‌ వాసిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.