ఆకాశానికి చిల్లు పడిందా !

0
308
నగరంలో ఎడతెరిపి లేని వర్షం – నీటమునిగిన పల్లపు ప్రాంతాలు
పౌరజీవనానికి అంతరాయం – మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 22 :  ‘ఆకాశానికి చిల్లు పడిందా’ అన్నట్టుగా ఎడతెరిపి లేని వర్షంతో నగరం తడిసి ముద్దవుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్పపీడనంతో పాటు ఆవర్తన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేయడంతో పల్లపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి రోజంతా అడపా దడపా వర్షం పడినా రాత్రి నుంచి మాత్రం ఎడతెరిపి లేకుండా కురస్తోంది. నిరంతరాయంగా వర్షం కురుస్తుండటంతో నగరంలోని ఆల్కట్‌తోట, రైల్వే స్టేషన్‌ రోడ్డు, టి.నగర్‌, డీలక్స్‌ సెంటర్‌, ఆర్యాపురం, సీతంపేట, లింగంపేట, తుమ్మలావ, సాంబశివరావు పేట, రామచంద్రరావు పేట,  కంబాలచెరువు, కోరుకొండ రోడ్డు  తదితర ప్రాంతాలు నీట మునిగాయి.  ఎడతెరిపిలేని వర్షాలతో నగరంలోని రహదారులన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. అలాగే డ్రైనేజీలు కూడా నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. మరో వైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉప నదుల నుంచి నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది.  ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం ప్రస్తుతం 10. 80 అడుగులు ఉండగా నది నుంచి సముద్రంలోకి 2.66 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అవసరమైన సహాయ చర్యలను చేపట్టాలని సీఎం ఆదేశించారు.