ఆకులు – మూతుల

0
304
మనస్సాక్షి  – 1120
ఉత్తరప్రదేశ్‌లోని మథురా జిల్లాలో ఓ పట్నం.. యింకా పొద్దెక్కకపోవడంతో జన సంచారం అంతగా లేదు. జోగి వీధి మొదట్లో స్థంభం కింద కూర్చుని తన బొచ్చె సర్ధుకుంటున్నాడు. యిప్పుడనేకాదు. గత పదేళ్ళుగా జోగి అక్కడే కూర్చుని అడక్కుంటుంటాడు. యింతలో జోగి దృష్టి ఓ వ్యక్తి ఆకర్షించాడు. ఆ వ్యక్తి గబగబా అక్కడున్న స్థంభం ఎక్కి దానిమీద కెమెరాలాంటిదేదో ఫిట్‌ చేస్తున్నాడు. దాంతో జోగి ”అదేంటి బాబయ్యా?” అన్నాడు. ఈలోగా  ఆ కెమెరా ఏదో బిగించేసి కిందకి దిగేసిన ఆ శాల్తీ.. యిదా.. యిది సీసీ కెమెరాలే. నువ్వూ, యింకా నీలాంటోళ్ళూ వేసే కంత్రీ వేషాలేవయినా  ఉంటే రికార్డయిపోతుంది” అన్నాడు వేళాకోళంగా. దాంతో జోగి ”అదేంటి బాబయ్యా.. నేనేం వేషాలేస్తానంట? ఏదో మధ్య మధ్యలో గుడ్డోడినని కళ్ళు చికిలించి అడుక్కోవడం తప్ప” అన్నాడు. దాంతో ఆ శాల్తీ సర్లే.. సర్లే.. అంటూ వెళ్ళిపోయింది. ఆరోజు రాత్రి ఓ విశేషం జరిగింది. జోగి ఆరోజుకి డ్యూటీ నుంచి …అదే.. అడుక్కునే డ్యూటీ నుంచి దిగిపోతుండగా ఓ వేనొచ్చి అక్కడ ఆగింది. దాంట్లోంచి నరేంద్ర దిగాడు. నరేంద్ర అంటే మునిసిపల్‌ ఆఫీస్‌లో ఆఫీసర్‌. నేరుగా జోగి దగ్గరకొచ్చేశాడు. ”ఏరా.. పొద్దుట్నించీ ఏమాత్రం సంపాదించావ్‌?” అన్నాడు.  దాంతో జోగి మొహం మరింత దీనంగా పెట్టి ”ఏం సంపాదనలే బాబయ్యా.. ధర్మపెబువులు కరువయిపోయారు. ఏదో తింటానికి సరిపడా ఓ వందో, నూటయాభయ్యో వచ్చుంటుంది” అన్నాడు. దాంతో నరేంద్ర ”నిజం చెప్పరా” అన్నాడు. ఈసారి జోగి ఏమాత్రం తడుముకోకుండా ”నిజమే బాబయ్యా.. అంతే వచ్చింది” అన్నాడు. దాంతో నరేంద్ర చిన్నగా నవ్వి ”సర్లే.. అదేదో యిప్పుడే తేలుస్తా నుండు” అంటూ ఎవరికో ఫోన్‌ చేసి ఏదో చెప్పాడు. యింకో పది నిమిషాల్లో అక్కడున్న స్థంభానికి బిగించిన కెమెరా తాలూకా రికార్డింగ్‌లు వచ్చేశాయి. వాటిని చకచకా పరిశీలించి ”మధ్యా హ్నం ఒంటిగంటకోసారి మూడొందల దాకా లెక్కపెట్టుకుని లోపలపెట్టుకున్నావు. తర్వాత సాయంత్రం నాలుగున్నరకు యింకో రెండొందలు లెక్కెట్టి బొచ్చెలో వేసుకున్నావు. మొత్తం మీద ఈపాటికి సంపాదన ఆరొందలు దాటే ఉంటుంది” అన్నాడు.  దాంతో జోగి పళ్ళికిలించి ”అవును బాబయ్యా.. మొత్తం సంపాదన ఆరొందల తొంభై” అన్నాడు. ఈసారి నరేంద్ర ”ఊ..నీ సంపాదన మీద 30 శాతం అంటే 207 రూపాయలు కేరింగ్‌ టేక్స్‌ కట్టు” అన్నాడు రశీదు పుస్తకం తీస్తూ. యిక చేసేదేంలేక జోగి ఆరోజు సంపాదనలో ఆ డబ్బేదో తీసిచ్చేశాడు. నరేంద్ర ఆ డబ్బేదో తీసుకుని వెళ్ళబోతుండగా జోగి.. బాబయ్యా.. దానం చెయ్యండి” అంటూ చెయ్యి చాపాడు. నరేంద్ర జేబులోంచి ఓ రూపాయి బొచ్చెలో వేసి ముందుకి కదిలాడు. నరేంద్ర వెళ్ళిపోయాక జోగి ‘నాలాంటోడి పొట్టకొడితే ఆ ఉసురు ఊరికే పోదురా.. అసలిదంతా పెట్టిందెవడో ఆడు నాశనమయిపోతాడు’ అని కసితీరా తిట్టుకున్నాడు. యింతకీ ఆ తిట్లేవో తగిలింది ఎవరికో కాదు… ఎక్కడో గోదావరి జిల్లాల్లో ఉండే వెంకటేశానికి…! అసలీ ముష్టివాడి కడుపుమంటకీ, వెంకటేశానికీ సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే వారం వెనక్కి వెళ్ళాల్సిందే…
——
వెంకటేశం అప్పుడే లక్నోలో రైలు దిగాడు. వెంకటేశం యిలా లక్నో వచ్చింది తన ఫ్రెండ్‌ కేదార్‌ని కలవడానికి. నిజానికి యిద్దరూ పదేళ్ళనాడు కాంపిటీటివ్‌ పరీక్షల కోసం కలిసి చదివినవాళ్ళు. తర్వాత్తర్వాత వెంకటేశం యిక్కడ రాజకీయాల్లోకి దూరడానికి ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ కేదార్‌ మాత్రం యూపీ రాజకీయాల్లో దూరేసి, ఆనక ఎలక్షన్లో గెలిచేసి, మంత్రి కూడా అయిపోవడం జరిగింది… అదీ మున్సిపల్‌ శాఖామంత్రిగా. అయితే యిప్పటికీ తరచుగా ఫోన్‌ మాట్లాడుకుంటుంటారు. అదీగాక తరచుగా వెంకటేశాన్ని యూపీ రమ్మని పిలుస్తున్నాడు కూడా. అందుకే వెంకటేశం యిప్పుడు యూపీ  వచ్చింది. మొత్తానికి యింకో గంట తర్వాత గెస్ట్‌హౌస్‌కెళ్ళి కేదార్‌ని కలిశాడు. మిత్రులిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. యిక ఆ రోజంతా వెంకటేశం కేదార్‌ వెంటే ఉన్నాడు. ఆరోజు రాత్రి కేదార్‌ కాస్త ముఖానికి మాస్క్‌ వేసుకుని ఆనక యిద్దరూ వీధి చివరనున్న బడ్డీకొట్టు దగ్గరకెళ్ళి టీ తాగేరు కూడా. అలా తాగుతుంటే పదేళ్ళనాడు  తాము గడిపిన రోజులు గుర్తొచ్చాయి. టీ తాగుతుండగా  వెంకటేశం ”మొత్తానికి మంచి పొజిషన్‌లోకి వెళ్ళిపోయావురా” అన్నాడు. దాంతో కేదార్‌ నవ్వేసి ”ఏం వెళ్ళడమో ఏంటో… ఎప్పుడూ టెన్షనే. ఎప్పుడూ టెన్షనే. గవర్నమెంట్‌ అధికార వికేంద్రీకరణ చేస్తోంది. అంటే ఏం లేదు. ఏ శాఖకి ఆ శాఖని ఏ ఊరికా ఊరిని అభివృద్ధి చేయడం అనుకో. దాని వలన ఏ మునిసిపాలిటీకా మునిసిపాలిటీకి నిధులు సమకూర్చుకోవాలి. లేకపోతే అభివృద్ధి ఉండడం లేదు” అన్నాడు. వెంకటేశం తలూపి ”యింతకీ మునిసిపాలిటీకి ఆదాయ మార్గా లేంటి?” అన్నాడు. దానికి కేదార్‌ ”ఏవుందీ… కుళాయి పన్నూ, యింటి పన్నూ, యింకా వేకెంట్‌ లేండ్‌ పన్నూ లాంటివనుకో. వాటి వలన వచ్చేది ఒక మేర వరకే. దాని వలన ఏదో బండి నడు స్తుంది తప్ప అభివృద్ధి కార్యక్రమాలకి వీలుపడడం లేదు. నువ్వు నాకంటే బాగా ఆలోచిస్తావు కదా. ఆదాయం పెంచుకునే మార్గాలేవయినా ఉంటే చెప్పు” అన్నాడు. వెంకటేశం తలూపాడు. అంతేకాదు. ఆ క్షణం నుంచే ఆలోచనలో పడ్డాడు.
——
మర్నాడు పొద్దున్న వెంకటేశం అక్కడికి దగ్గర్లోని ఓ ఊరికి వెళ్ళాడు. అక్కడ సెంటర్లో ఉన్న టాంగావాలా దగ్గరికి నడిచాడు. ఆ వాలకం అదీ చూస్తుంటే కొంచెం బోళాగానే ఉన్నట్టనిపించింది. వెంకటేశం నెమ్మదిగా ఆ శాల్తీని మాటల్లో పెట్టాడు. ”నాదీ ఊరు కాదు భయ్యా.. అవునూ.. యిక్కడ ఏది ఫేమస్‌?” అన్నాడు. దాంతో టాంగావాలా కొంచెం సిగ్గుపడి ”చిలకలకి. సంపాదనంతా ఆళ్ళదే. యింకా బిచ్చగాళ్ళు కూడా దున్నేస్తుంటారు. ఆళ్ళ పనీ బాగుంటుంది” అన్నాడు.  దాంతో వెంకటేశం మనసులో ఓ ఆలోచన మెరుపులా వచ్చింది. గబగబా వెళ్ళి కేదార్‌కి తన ఆలోచన చెప్పాడు. అది వినగానే కేదార్‌ మొహం వెలిగిపోయింది. అంతేకాదు. ఆరోజే  బిచ్చగాళ్ళ, ప్రాసిట్యూట్‌ల సంపాదన మీద కేరింగ్‌ టేక్స్‌ వెయ్యాలని ఆదేశించడం జరిగింది.
——
..అది గురూగారూ.. నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. అంతా విన్న గిరీశం ”ఈమధ్య యూపీలో మున్సిపల్‌ శాఖ యిలా బిచ్చగాళ్ళు, వ్యభిచారిణుల ఆదాయం మీద కేరింగ్‌ టేక్స్‌ పేరుతో పన్ను విధించే యోచనలో ఉంది. అదేదో నీ బుర్రలో దూరినట్టుంది” అన్నాడు.  వెంకటేశం తలూపి ”అయినా యిది తప్పంటారా?” అన్నాడు. గిరీశం  తలూపి ”తప్పే… అయినా కేరింగ్‌ టేక్స్‌ ఏంటో… ఎవరి కేరింగ్‌ కోసమో.. అంతా ఒక విషయం ఆలోచించాలి. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుందంటే.. ఆమె తన వ్యక్తిత్వాన్ని చంపుకుని తప్పనిసరి పరి స్థితుల్లో చేసే ఆ పనికి ఎంత బాధపడుతుందో తెలుసా? అలాగే బిచ్చగాళ్ళు కూడా తాము చేసే దానికి ఎంతో బాధపడుతుంటారు. అలాంటోళ్ళ సంపాదన లాక్కోవడం ఎంత హేయం? ముందసలు  ప్రభుత్వాలు ఈ సమస్యల మూలాల మీద దృష్టిపెడితే బాగు టుంది. అసలీ వ్యభిచారిణులు, బిక్షగాళ్ళు పుట్టింది ఎక్కడ్నుంచో కాదు.  ఈ వ్యవస్థ వైఫల్యాల నుంచే. అందుకే ముందీ వ్యవస్థనే ప్రక్షాళన చేయగలిగితే అసలీ వ్యభిచారిణులు, భిక్షగాళ్ళు అనే వాళ్ళే లేకుండా చేయొచ్చు” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here