ఆదర్శప్రాయం కృష్ణకుమారి జీవితం

0
274

సంతాప సభలో పలువురు వక్తలు

రాజమహేంద్రవరం, మార్చి 16 : మహిళా ఉద్యమ నేత, సిపిఎం తొలితరం నాయకురాలు, మాజీ కౌన్సిలర్‌ జి.కృష్ణకుమారి బాటలో అంతా నడవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు టి.ప్రభావతి కోరారు. స్ధానిక మోరంపూడిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మిడియం బాబూరావు ఇంటి వద్ద జరిగిన కృష్ణకుమారి సంస్మరణ సభలో ఆమె మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టిఎస్‌ ప్రకాష్‌ అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణకుమారి చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ కృష్ణకుమారి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆమె ఆయశసాధన కోసం అంతా కృషి చేయాలని కోరారు. ఎప్పుడూ ప్రజల కోసం, ప్రజలతో ఆమె గడిపారన్నారు. సంపాదనే లక్ష్యంగా నేటి తరం రాజకీయ నాయకులు నడుస్తుంటే కమ్యూనిస్టులు ప్రజల కోసమే జీవిస్తాన్నారనడానికి కృష్ణకుమారి జీవితమేఉదాహరణ అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు మాట్లాడుతూ కృష్ణకుమారి ఉద్యమ స్పూర్తిని అందరూ కొనసాగించాలని కోరారు. తుది శ్వాస విడిచేవరకూ ప్రజా ఉద్యమ బాటను ఆమె వీడలేదన్నారు.అట్టడుగున ఉన్న మహిళలు, కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. కృష్ణకుమారి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరం అలవరుచుకోవాలని కోరారు.సిసిసి ఛానల్‌ చైర్మన్‌ పంతం కొండలరావు మాట్టాడుతూ నేటితరంలో కృష్ణకుమారి ఉద్యమ స్ఫూర్తి కొరవడిందన్నారు. విద్యావేత్త టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కృష్ణకుమారి, బాలాజీదాస్‌ దంపతులు ప్రజా సేవ కోసమే తమ జీవితం అంకితం చేశారన్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవాధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ బాలాజీదాస్‌, కృష్ణకుమారి పోరాట పటిమ అంతా అలవరచు కోవాలని కోరారు. సీపియం నేత సుందరయ్య, బాటను అనుసరించాలన్నారు.కమ్యూనిస్టుల త్యాగాలను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. కృష్ణకుమారి పోరాటాలే ఊపిరిగా జీవించారని కొనియాడారు. సిపిఐ (ఎంఎల్‌-న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఏవి రమణ మాట్లాడుతూ బాలాజీదాస్‌, కృష్ణకుమారి స్ఫూర్తితోనే తాను కమ్యూనిస్టు ఉద్యమంలో చేరానన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ రాజకీయ నాయకులు తమ ఆస్తులను తమ పిల్లలకు వారసత్తంగా అందిస్తుంటే కమ్యూనిస్టులు కమ్యూనిస్టు భావజాలాన్ని వారసత్వంగా అందిస్తున్నారన్నారు. కృష్ణకుమారి పోరాట పటిమను అంతా అనుసరించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టిఎస్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ కృష్ణకుమారిని ధీర వనితగా అభివర్ణించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బాలాజీదాస్‌, కృష్ణకుమారి ఉద్యమ పంథాను వీడలేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ ఉద్యమాలే ఊపిరిగా పనిచేసిన కృష్ణకుమారి నేటి తరానికి ఆదర్శమన్నారు.సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి మాట్లాడుతూ ఏడేళ్లుగా మంచానికే పరిమితమైనప్పటికీ ప్రతిరోజూ ప్రస్తుత రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసేవారని కొనియాడారు. కోపరేటివ్‌ బ్యాంకు యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట రామారావు మాట్లాడుతూ కృష్ణకుమారి ఆలోచన ఎప్పుడూ ప్రజల పక్షంగానే ఉండేదని చెప్పారు. ఈ సభలో కృష్ణకుమారి పెద్ద కుమారుడు జిఏభూషన్‌ బాబు, సిపిఎం నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు,పెద్దాపురం సిపిఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయుకుడు కె.సురేష్‌, సాహితీ స్రవంతి నాయకుడు పెద్దింశెట్టి రామకృష్ణ,ఐద్వా జిల్లా కార్యదర్శి తులసి,స్రవంతి,ఎస్‌.ఎఫ్‌.ఐ,డి.వై.ఎఫ్‌.ఐ జిల్లా కార్యదర్శులు పవన్‌, రాజులోవ,సిఐటియు నాయకులు రామచంద్రరావు,వి.రాము,సోషల్‌ మీడియా ఫర్‌ సోసైటీ కార్యదర్శి శంకర్‌, పలివెల వీరబాబు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here