ఆదివారం ఆనందమయం

0
324
ఆదివారం ఆనందమయం
హ్యాపి సండే కార్యక్రమంలో కేరింతలు కొట్టిన పిల్లలు
పుష్కరఘాట్‌ వద్ద రొటీన్‌కు భిన్న వాతావరణం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  23: విపరీతమైన ట్రాఫిక్‌తో సాధారణ రోజుల్లో ఆ రోడ్డుపై నడవాలన్నా, వాహనంపై ప్రయాణించాలన్నా కూడా గగనంగానే ఉంటుంది. అటువంటి ఆ రోడ్డుపై కొద్దిసేపు రొటీన్‌కు భిన్నంగా ఆ ప్రాంతం కొద్దిసేపు నిర్భయంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పిల్లలు కేరింతలతో కనువిందు చేసింది. ఆటపాటలతో సరికొత్త వాతావరణాన్ని ఆవిష్కరించింది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రధాన నగరాల్లో రద్దీ రహదార్లపై పిల్లల ఆట పాటలను నిర్వహించి ఆదివారాలను ఉల్లాసంగా గడిపే ఏర్పాట్లలో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం నగరంలో కూడా ఆ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. అందుకు  నగరంలో విశాలంగా ఉండే పుష్కరఘాట్‌ రోడ్డు వేదికైంది.
కమిషనర్‌ చొరవకు ఎంపి మురళిమోహన్‌ ప్రశంసలు
రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని, మానసిక ఒత్తిడిని జయించాలన్న ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో హ్యాపి సండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆ కార్యక్రమాన్ని చారిత్రక రాజమహేంద్రవరంలో కమిషనర్‌ విజయరామరాజు చేపట్టడం అభినందనీయమని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళిమోహన్‌ అన్నారు. నగర పాలక సంస్ధ ఆధ్వర్యంలో  ఈరోజు పుష్కరఘాట్‌ వద్ద ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హ్యాపి సండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర  పాలక సంస్ధ పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని పలు ప్రదర్శనలు ఇచ్చారు. నృత్యాలు, జానపద ప్రదర్శనలు,  తీన్‌మార్‌, ఖోఖో, కబాడి, టగ్‌ ఆఫ్‌ వార్‌, కోలాటం, తోలుబొమ్మలాట వంటి ఆటలను ప్రదర్శించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మెహిందీ, ముగ్గుల పో టీలు నిర్వహించారు. దీంతో పాటు షుగర్‌, బిపి వ్యాధుల పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  కరెన్సీ నోట్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంటిపూడి  రామారావు ఎలిమెంటరీ స్కూల్‌కు చెందిన యు విజయ అనే విద్యార్ధిని జలం ఆవశ్యకతను తెలియజేస్తూ ఇచ్చిన సందేశం అందరిలో స్ఫూర్తిని నింపింది. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్ధులను ఎంపి  మురళిమోహన్‌, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కమిషనర్‌ విజయరామరాజులు అభినందించారు. ఈ సందర్భంగా మురళిమోహన్‌ మాట్లాడుతూ నగరంలో పండుగ వాతావరణం నెలకొల్పేందుకు హ్యాపి  సండే కార్యక్రమం ప్రారంభించామని, చారిత్రక రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరాన పవిత్ర స్ధలంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. త్వరలో యోగా నిర్వహణతో పాటు వంటల పోటీలను నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆ ఉద్ధేశ్యంతోనే సీఎం చంద్రబాబు ఐదు రోజుల పాటు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని, ఆరవ రోజు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ సభలో ఆదేశించినట్లు తెలిపారు. ఏడవ రోజు ప్రతి ఒక్కరూ కుటుంబంతో సంతోషంగా గడపాలని  అందుకోసమే హ్యాపి సండే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసే విషయంలో కమిషనర్‌ విజయరామరాజు ముందుంటున్నారని, ఈ కార్యక్రమం మున్ముందు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజలే నిర్వహించుకోవాలని, ప్రతి ఆదివారం నగర ప్రజలకు ఆనందమయం కావాలని ఆకాంక్షించారు. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్ధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబుతో పాటు పితాని లక్ష్మీకుమారి, గగ్గర సూర్యనారాయణ, గొర్రెల సురేష్‌, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, పాలవలస వీరభద్రం, తెదేపా నాయకులు పితాని కుటుంబరావు, తలారి భగవాన్‌, శెట్టి జగదీష్‌, మానే దొరబాబు, దొండపాటి సత్యంబాబు, నగర పాలక సంస్ధ మేనేజర్‌ శ్రీనివాస్‌, అధ్యాపకులు దుర్గాప్రసాద్‌, పద్మావతి, రత్నాంబ, మెడికల్‌ ఆఫీసర్‌ ఎంవిఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.