ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యం అందించాలి

0
120
-గుండె వైద్యుల రెండ్రోజుల సదస్సు ప్రారంభంంలో సివి రావు
రాజమహేంద్రవరం,ఆగస్టు 24 :అందుబాటులోకి వస్తున్న ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండె వ్యాధి గ్రస్తులకు అత్యవసర వైద్యాన్ని అందించి ప్రాణాలు నిలిపేందుకు అనుక్షణం ప్రయత్నించాలని,  కార్డియాలజిస్టులు, కార్డియాక్‌ సర్జన్లు మరింత సాంకేతిక అభివృద్ధి సాధించడం ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వీలవుతుందని ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ సివి రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఎపిసిఎస్‌ఐ) 5వ రాష్ట్రస్థాయి కార్డియాలజిస్టుల సదస్సు స్థానిక గాదాలమ్మ నగర్‌లో ఉన్న బివిఆర్‌ శ్రీ కన్వెన్షన్‌ సెంటర్లో శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సును విసి సివి రావు, రాజమహేంద్రవరం రూరల్‌, సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ, నగరపాలకసంస్థ కమీషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, కార్డియాలజీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూర్ణానంద్‌, ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రాఘవశర్మ, సదస్సు ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఎవి సుబ్బారావు, డాక్టర్‌ ఎన్‌ఎస్‌ రామరాజు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సివి రావు మాట్లాడుతూ వైద్యులు నిరంతరం విద్యార్థుల్లానే వ్యవహరించాలని సూచించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గనిర్ధేశకాల ప్రకారం రోగులకు వైద్యం అందించడంతో పాటు మానవతా విలువలను కూడా పొందించుకోవాలని సూచించారు. ఇటువంటి సదస్సుల్లో సీనియరిటీ కలిగిన వైద్యులు చేసిన కేసులు, వైద్యాన్ని తెలుసుకోవడం ద్వారా వృత్తి నైపుణ్యం పెరుగుతుందన్నారు. వైద్యులు రోగులతో వ్యవహరించే తీరును మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ప్రొఫెషజలిమ్‌, ఎమర్జెన్సీ వైద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. గోరంట్ల, ఆదిరెడ్డి మాట్లాడుతూ వైద్యులు దేవుడితో సమానమని అదే స్ఫూర్తితో అవసరమైన వైద్య సేవలందించాలన్నారు. ప్రజలకు ఆధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు ఆరోగ్యపరంగా వ్యాధులురాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఇటువంటి సదస్సుల ద్వారా కొత్త వైద్యులు తమ వృత్తిలో మరింత పురోగతి సాధించేందుకు దోహదపడతాయన్నారు. డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, రాజశేఖర్‌, సి.చంద్రశేఖర్‌, పివి రాఘవశర్మ, వి.సుజాత, కె.గోపాలకృష్ణ, జి.సుబ్రహ్మణ్యం, ఐఎవి ప్రసాద్‌లాల్‌, ఆర్‌.జాన్‌ సతీష్‌, పి.రమేష్‌బాబు, ఎం.శ్రీనివాసరావు, వి.వనజ, ఎం.భాస్కరరావు తదితరులు గుండె వ్యాధి నిర్ధారణ, ఆరోగ్యం మెరుగుదల, తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇతర దేశాల్లో అందిస్తున్న వైద్యం, అక్కడి ఆహారపు అలవాట్ల కారణంగా వ్యాధులు రాకుండా తీసుకుంటున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ కార్డియాలజిస్టులు, వైద్య విద్యార్థులు సదస్సుకు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here