ఆమె ఎవరో తెలిసింది…

0
530
 నిందితులు ఎవరో తేలాల్సి ఉంది
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 8 : స్ధానిక రైల్వే క్వార్టర్స్‌లో కాళ్ళు, చేతులు కట్టేసి నిర్భందించబడి, అపస్మారక స్థితిలో గుర్తించిన మహిళను ఆలమూరు మండలం, పెదపళ్ళ గ్రామానికి చెందిన చిలుకూరి భవానీగా గుర్తించారు. అపస్మారక స్థితిలో గుర్తించిన మహిళను పోలీసులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పత్రికల్లో ఈమె గురించిన వార్త రావడంతో ఆమె బంధువులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈమె సెప్టెంబర్‌ 30వ తేదీన మండపేట వెళ్ళేందుకు గ్రామం నుంచి బయలుదేరి వెళ్ళిన ఈమె ఇప్పటి వరకు కన్పించకుండా పోయింది. అపస్మారక స్థితిలో ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవానీ ఆరోగ్య పరిస్తితిని బట్టీ, గత మూడు రోజులుగా ఇక్కడ బంధించి, ఆహారం, మంచినీరు అందకుండా చేసి ఉంటారని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈమెను మూడు రోజుల క్రితమే ఇక్కడ బంధించి ఉంటే, అంతకుముందు ఈమె ఎక్కడ ఉందన్నది చిక్కు ప్రశ్నగా మారింది. ఈమె అపస్మారక స్థితి నుంచి బయటపడితేనే గానీ అసలు విషయాలు బయట పడవు. ఈమె అల్లుడు పట్టాభి రామయ్య, అడపడుచు ఝాన్సీలు ఆసుపత్రికి వచ్చి ఈమెను గుర్తుపట్టారు. డిఎస్పీ నారాయణరావు ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.