ఆరోపణలపై సమగ్ర విచారణ

0
42
ఫిర్యాదులో కొన్ని అవాస్తవాలు – పూర్తి నివేదిక ఆధారంగా చర్యలు : విసి సురేష్‌ వర్మ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆంగ్ల విభాగాధిపతి డా.ఎన్‌. సూర్య రాఘవేంద్రపై వచ్చిన ఫిర్యాదు ఉందని వీసీ ఆచార్య సురేష్‌ వర్మ తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విసి మాట్లాడారు. ఆంగ్ల విభాగాధిపతి సూర్య రాఘవేంద్రపై వచ్చిన ఫిర్యాదును విశ్వవిద్యాలయం చాలా సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఇటువంటి ఫిర్యాదుల్లో విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయ ఉమెన్స్‌ సెల్‌కు సంబంధిత ఫిర్యాదును అప్పగించామని తెలిపారు. ఉమెన్‌ సెల్‌ కమిటీ ప్రాథమిక విచారణ చేసిన తర్వాత కొన్ని విషయాలను తెలిపారని చెప్పారు. వాటి ఆధారంగా ఫిర్యాదులో కొన్ని అవాస్తవాలు ఉన్నట్లు వెల్లడించారు. డా.ఎన్‌.సూర్య రాఘవేంద్రపై వచ్చిన ఫిర్యాదు ప్రకారం విద్యార్థులు 2017-19 విద్యాసంవత్సరానికి చెందినవారు అని తెలుస్తుందన్నారు. సదరు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం ”వీసీ ఆచార్య పి సురేష్‌ వర్మకి, సూర్య రాఘవేంద్రకు క్లోజ్‌ ఫ్రెండ్‌ షిప్‌ ఉన్న కారణంగా వీసీ సురేష్‌ వర్మకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని” పేర్కొన్నారని తెలిపారు. కానీ 2017-19(మార్చి) విద్యా సంవత్సరం నాటికి తాను వీసీగా బాధ్యతలలో లేనని తెలిపారు. అటువంటప్పుడు విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్లిపోయిన విద్యార్థులు ఈ విధమైన ఫిర్యాదు చేయడం వెనుక అంతరార్థం ఏమిటో తెలియాల్సి ఉందని అన్నారు. అలాగే ఎటువంటి సంతకాలు లేకుండా ఫిర్యాదు వచ్చిందని అన్నారు. విశ్వవిద్యాలయ ఉమెన్స్‌ సెల్‌ కమిటీ ప్రాథమిక విచారణలో భాగంగా సదరు ఫిర్యాదు దారులకు ఫోన్‌ చేసినా ఫోన్లు పని చేయలేదని తెలిపారు. ఈ విధంగా సంతకాలు లేని ఫిర్యాదు చేయడం, ఫిర్యాదుదారులు స్పందించకపోవడం, ఫిర్యాదులో కొన్ని అవాస్తవాలు ఉండడం ఫిర్యాదుపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఫిర్యాదు ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా సదరు ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలికి తీస్తామని తెలిపారు. విచారణను వేగవంతం చేస్తున్నామని పూర్తి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here