ఆర్ధికంగా శక్తివంతులు కావాలి

0
298
డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు పిలుపు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : ప్రతి మహిళ ఆర్ధికంగా శక్తివంతులుగా ఎదగాలనే తాపత్రయంతోనే  డ్వాక్రా సంఘాలను ప్రారంభించామని, ప్రతి సభ్యురాలికి రూ. 10 వేల వంతున ఇచ్చామని, కొత్తగా వచ్చిన సభ్యులకు సైతం ఇది వర్తించేలా  చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మున్సిపల్‌ స్టేడియంలో నిన్న సాయంత్రం జరిగిన డ్వాక్రా సంఘాల సదస్సులో సీఎం మాట్లాడుతూ తన మానస పుత్రికలైన డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడమే తన ధ్యేయమన్నారు. మహిళలు స్వయంగా చిరు వ్యాపారాల ద్వారా ఆర్ధికంగా ఎదిగి నెలకు కనీసం రూ. 10 వేలు సంపాదించుకునే విధంగా ఉండాలన్నారు. పచ్చళ్ళు, దుస్తులు, తినుబండారాలు తయారు చేస్తూ ఆర్ధిక స్వావలంబన సాధించడం అభినందనీయమన్నారు. మహిళలు సెల్‌ ఫోన్‌ బ్యాంకింగ్‌ నేర్చుకోవాలని, రాబోయే రోజుల్లో మొత్తం ఆర్ధిక వ్యవహారాలన్నీ  మొబైల్‌తోనే జరగాలన్నారు.  ప్రస్తుతం జనాభా తగ్గుదల కారణంగా ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలనైనా కనవచ్చని సీఎం చమత్కరించారు. జిల్లా వ్యాప్తంగా స్వయం సంఘాల సభ్యులు 8.04 లక్షల మంది ఉండగా వారికి సీఎం చేతుల మీదుగా రూ. 431.98 కోట్ల చెక్కును అందించారు. మెప్మా ద్వారా 16,431 మంది సభ్యులుండగా వారికి రుణాలుగా రూ.64.70 కోట్ల చెక్కును అందజేశారు. అలాగే చంద్రన్న బీమా పథకం కింద టి.రామకృష్ణ, శివరామయ్యలకు రూ. 5 లక్షల వంతున చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.