ఆర్యాపురం బ్యాంక్‌పై 51 విచారణ జరపాలి..

0
197
తక్షణం ప్రత్యేకాధికారిని నియమించాలి – మాజీ డైరక్టర్ల డిమాండ్‌
రాజమహేంద్రవరం, జూన్‌ 26 : ది ఆర్యాపురం కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్‌ యాక్ట్‌ 1964 ప్రకారం 51 ఎంక్వైరీ నిర్వహించాలని మాజీ డైరక్టర్లు డిమాండ్‌ చేసారు. చైర్మన్‌ చల్లా శంకర్రావు, పాలక వర్గ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక జాంపేటలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో బ్యాంక్‌ మాజీ డైరెక్టర్లు,వైసిపి నాయకులు లంక సత్యనారాయణ, యజ్జరపు మరిడయ్య మాట్లాడుతూ పాలకవర్గం చేపట్టిన సిబ్బంది నియామకాలపై విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా నియమించిన వారిని తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేసారు. తిలక్‌ రోడ్‌ బ్రాంచ్‌ నిర్మాణానికి సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు స్థలం కొనుగోలు చేసి బ్యాంక్‌కు నష్టం కలిగించారని, నిర్మాణంలో టెండర్లు పిలవకుండా చైర్మన్‌ తమకు సంబంధించిన వ్యక్తులతో బ్యాంకు సొమ్ము దుబారా చేసారని ఆరోపించారు. బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో కూడా టెండర్లు పిలవకుండా రూ 4 కోట్లు ఖర్చు పెట్టారని, దాని నిర్మాణానికి సంబంధించిన ఐరన్‌, సిమెంటు, ఇతర సామగ్రి విషయంలో కూడా చాలా అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. ఏటా జనరల్‌ బాడీ సందర్భంగా మెంబర్లకు ఇచ్చే గిఫ్ట్‌లు కొనుగోలుపై కూడా విచారణ చేయాలన్నారు. డైరెక్టర్ల స్టడీ టూర్‌ల పేరుతో లక్షల రూపాయలు ఖర్చుచేసారని మండిపడ్డారు. చైర్మన్‌ ప్రోత్సాహంతో బ్యాంక్‌లో కొంత మంది డైరక్టర్లు వడ్డీవ్యాపారం చేస్తూ ఖాతాదారుల రుణాలను తిరగరాస్తున్నారని, ఆ రుణాలపై కూడా దర్యాప్తు జరగాలన్నారు. ఈ పాలకవర్గం హయాంలో ఏర్పాటు చేసిన బ్రాంచ్‌లన్నీ నష్టాలతో నడుస్తున్నాయని, అక్కడ ఇస్తున్న అప్పులు రికవరీ జరగడం లేదన్నారు. మోరంపూడిలో మహాలక్ష్మీ మార్కెట్‌ కాంప్లెక్స్‌కు రుణాల ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదన్నారు. ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 30తో ముగుస్తోందని, ప్రభుత్వం వెంటనే జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించాలని విజ్ఞప్తి చేసారు. సమావేశంలో వైకాపా నాయకులు డివివి త్రినాధ్‌, కొల్లిమళ్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here